దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి:

బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను వెంటాడి వేటాడుతున్నాడు కాంగ్రెస్‌ నేత శరత్‌రెడ్డి. ఎన్నికల ముందు చేసిన శపథం నిజం చేసే క్రమంలో ఏ ఒక్క చాన్స్‌ దొరికినా షకీల్‌ మూలాలపై దెబ్బ మీద దెబ్బ కొడుతూ వస్తున్నాడు. ఇప్పటికే షకీల్‌ రైస్‌మిల్లులపై దాడులు చేయించిన శరత్‌రెడ్డి… తాజాగా షకీల్‌ కొడుకు యాక్సిడెంట్‌ కేసులో మూలాలు తవ్వాడు. ఈ కేసుకు బోధన్‌తో లింకులున్న విషయాన్ని బయటపెట్టాడు. షకీల్‌కు దగ్గరగా మసలుకున్న అప్పటి బోధన్‌ టౌన్‌ సీఐ ప్రేమ్‌కుమార్‌కు, షకీల్‌కు అత్యంత సన్నిహితుడు, కుడిభుజమైన అబ్దుల్‌ వాసింలను అరెస్టు చేయించడం కలకలం రేపింది. పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని జరిగిన యాక్సిడెంట్‌ కేసులు షకీల్‌ కొడుకు రాహిల్‌ ప్రధాన నిందితుడు.

ఈ కేసు నుంచి షకీల్‌ కొడుకును తప్పించేందుకు బోధన్‌ ఏరియా నుంచే చక్రం తిప్పాడు. ఇక్కడ తన ఆర్థిక లావాదేవీలన్నీ చూసుకునే అత్యంత సన్నిహితుడైన అబ్దుల్ వాసేను రంగంలోకి దింపాడు. టౌన్‌ సీఐగా లీవ్‌లో వెళ్లిన ప్రేమ్‌కుమార్‌కు గాలం వేశారు. ప్రేమ్ కుమార్‌ పంజాగుట్ట పీఎస్‌లో తన పలుకుబడిని ఉపయోగించి రాహిల్‌ను తప్పించే ప్రయత్నం చేయగా ఇది బెడిసికొట్టింది. అందరూ దీన్ని హైదరాబాద్‌ కేసుగానే పరిగణించారు. కీలక పావులు కదిపింది బోధన్‌ నుంచే. ఈ విషయంలో శరత్‌రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి కేసును దర్యాప్తు చేసే విషయంలో ఒత్తిడి పెంచారు. దీంతో బోధన్‌ నుంచి ఈ ఇద్దరి ప్రమేయం బయటపడటంతో వీరిద్దరినీ ఆదివారం అరెస్టు చేయడం బోధన్‌లో రాజకీయంగా చర్చ మొదలైంది.

అరెస్టుకు ముందు ప్రేమ్‌కుమార్‌ను సీసీఎస్‌కు అటాచ్‌ చేసి మరీ ఆ మరుసటి రోజే అరెస్టు చేశారు. బోధన్‌ రూరల్ సీఐని కూడా ఇక్కడి నుంచి సాగనంపారు. ఇప్పటికే సుదర్శన్‌రెడ్డికీ హోం శాఖ ఇస్తారనే ప్రచారం ఊపందుకున్న తరుణంలో జిల్లాపై ఆయన తన పట్టను పెంచుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం షకీల్‌ అతని కొడుకు దుబాయ్‌లో ఉన్నారు. ఈ పరిణామం బోధన్‌ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరగగా శరత్‌రెడ్డి ఒత్తిడి మూలంగానే ఈ కేసులో మూలాలు బయటపడ్డాయనే ప్రచారమూ ఊపందుకున్నది.

You missed