దండుగుల శ్రీనివాస్- వాస్తవం ప్రతినిధి:
మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి గణతంత్ర వేడుకల సందర్భంగా అధికార పార్టీ నేత సునీల్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. పరోక్షంగా అతని వైఖరిని, వ్యవహరశైలిని తప్పుపడుతూ రాజ్యాంగేతర శక్తిగా అభివర్ణించారు. శుక్రవారం బాల్కొండలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన తనదైన శైలిలో సునీల్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ఇక నుంచైనా బుద్ది మార్చుకోవాలని హితవు పలికారాయన. పనిలో పనిగా అధికారులకూ చురకలేశారు. అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది కదా అని ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి ముత్యాల సునీల్‌రెడ్డికి వత్తాసుపలికే విధంగా, తొత్తులుగా వ్యవహించే పద్దతి సరికాదని పరోక్షంగా ఘాటుగా చురకలంటించారు ఆయన.
ఇప్పటి వరకు తెలిసో తెలియకో చేశారు. ఇకపై చాలించండి. అని సుతిమెత్తగా వారికి వార్నింగ్ కూడా ఇచ్చేశారు. గతంలో కూడా ప్రొటోకాల్ పాటించలేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డ విషయం తెలిసిందే. అప్పట్నంచి ఇద్దరి మధ్య నియోజకవర్గంలో కోల్డ్ వార్ నడుస్తోంది. శుక్రవారం రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన మరింత ముందుకు వెళ్లి సునీల్‌ను రాజ్యాంగేతర శక్తిగా పోల్చడం, పద్దతి మార్చుకోవాలని వార్నింగ్ ఇవ్వడం నియోజకవర్గంలోనే కాదు.. జిల్లా రాజకీయాల్లో కూడా చర్చనీయాంశమైంది. ఇంకా ఆయనేమన్నాడంటే..
‘ ఘనంగా భారత్ మొత్తం వేడుకగా జరుపుకుంటున్న ఈ సందర్భంలో అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ స్పూర్తి సక్రమంగా అమలు చేయబడాలి.. బారతదేశంలోని ప్రతీ ఒక్క పౌరుడికి సమాన హక్కులుండాలుండాలని ఆకాంక్షిస్తున్నాను.. బాల్కొండలో కూడా రాజ్యాంగ స్పూర్తి అమలు కావాలి… ఎవరి అధికారాలు వారికుండాలె. రాజ్యాంగేతర శక్తులు అధికారుల విధుల్లో జోక్యం చేసుకుంటున్నారు. ఇది మంచి పద్దతి కాదు. అధికారులకు, రాజ్యాంగేతర శక్తులకు పిలుపునిస్తున్నా. ఇది మంచి పద్దతి కాదు. అధికారులను వాళ్ల పనులను వాళ్లు చేసుకునేలా చూడాలి. ప్రజలచే గెలిచిన ప్రజాప్రతినిదులు వాళ్ల పనులు చేసుకునే క్రమంలో ఎవరూ అడ్డుకోరాదు.’ అని ప్రశాంత్‌రెడ్డి హితవు పలికారు. రాజ్యాంగాన్ని స్పూర్తిగా తీసుకుని ఇక్కడ, జిల్లాలో, రాష్ట్రంలో అదికారులంతా రాజ్యాంగానికి లోబడి వారి వారి విధులు నిర్వర్తించాలని కోరారు. ఈ రాజ్యంగ చట్రంలో రాజ్యాంగేతర శక్తులు దూరొద్దన్నారు. రాజ్యాంగానికి, సమాజానికి ఇది మంచిదికాదన్నారు. కొత్తలో ఏదో తెలియక చేసిండొచ్చు గానీ, రేపటి నుంచి ఇలాంటి పనులు చేయొద్దని హెచ్చరించారు. ఎవరికి వారు రాజ్యాంగ బద్దంగా విధులు నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు వేముల.