దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రతినిధి:

నిస్తేజంలో ఉన్న ఇందూరు బీఆరెస్‌లో నూతనోత్తేజం నింపేందుకు జిల్లా పార్టీ అధ్యక్షుడిని మార్చాలని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో గెలిచింది బాల్కొండలోనే. ప్రశాంత్‌రెడ్డి గెలుపుతో ఆయనకే జిల్లా పార్టీ పగ్గాలిస్తే పార్టీని ముందుకు నడిపే సత్తా ఉంటుందని భావిస్తున్నట్టు తెలిసింది. సమీపంలో పార్లమెంటు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అంతా తానై నడిపించి పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపించే విధంగా అన్ని విధాగాలు అండగా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. దీనికి ప్రశాంత్‌రెడ్డి సెట్ అవుతారని భావిస్తున్నారు.

మిగిలిన సీనియర్‌ నాయకులు కూడా దాదాపుగా ఇదే ఆలోచనను పంచుకున్నట్టు తెలుస్తోంది. ఈనెల 7న నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ సమావేశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పార్టీలో అందరి చర్చ దీనిపైనే కొనసాగుతోంది. ఎవరికి వారే యుమునా తీరే అన్న విధంగా మారిన పార్టీ పరిస్థితిని చక్కదిద్ది గాడిన పడేలా అధిష్టానం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో పార్టీ జిల్లా అధ్యక్షుడి మార్పు అనివార్యం కానుంది. తెలంగాణ భవన్‌లో భేటీ కి ముందే నిర్ణయం ఉంటుందా..? ఆ తరువాత ఉంటుందా..? తెలియదు. కానీ మార్పు అనివార్యంగా కనిపిస్తోంది.

పార్లమెంటు అభ్యర్థిగా ఎమ్మెల్సీ కవితే పోటీ చేస్తారని ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో నిజామాబాద్‌ స్థానాన్ని అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది. గతంలో ఓటమి పాలైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఆ తప్పిదాలు పునరావృతం కాకుండా పార్టీని పకడ్బందీగా గాడిలో పడేయాలని భావిస్తున్నారు.

You missed