నిజామాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల వేళ సీఎం కేసీఆర్ సభల శంఖారావం జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం నుంచే ముందుగా మోగనున్నది. గురువారం బాల్కొండ నియోజకవర్గం లోని వేల్పూర్ మండల కేంద్రం సమీపంలో స్పైసెస్ పార్కు 43 ఎకరాల మైదానంలో భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. సభ ఏర్పాట్లను మంగళవారం సాయంత్రం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. గురువారం ఇక్కడ జరగనున్న ప్రజా ఆశీర్వాద సభను నియోజకవర్గ ప్రజలు విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సహకారంతో బాల్కొండ నియోజకవర్గంలో అన్ని రంగాల్లో అభివృద్ధిని అందించానని.. అదంతా ప్రజల కండ్ల ముందే ఉందన్నారు. నియోజకవర్గం కోసం ఏది అడిగినా కాదనకుండా ఇచ్చిన కెసిఆర్ ను.. తనను గెలిపించిన ప్రజల ప్రేమను గురుత్వంగా గుర్తుంచుకొని నిద్రాహారాలు కాదనుకొని అందించిన తన శ్రమను గుర్తించి ప్రజలందరూ సభకు హాజరై ఆశీర్వదించాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. మధ్యాహ్నం రెండు గంటలకల్లా కేసీఆర్ సమయానికి చేరుకుంటారని, ప్రజలు మధ్యాహ్నం ఒంటిగంట కల్లా సభా ప్రాంగణంలోకి చేరుకోవాలని కోరారు.

మెదక్ ఎంపీ, మెదక్ జిల్లా దుబ్బాక నియోజక వర్గం టిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని కాంగ్రెస్ నాయకుడు కత్తితో పొడిచిన ఘటనలను మంత్రిగా ఉన్న ప్రశాంత్ రెడ్డి ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించారు. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆయనను పదవి నుంచి దించివేసి ముఖ్యమంత్రి కావడానికి ఆ పార్టీ వారే హైదరాబాదులో మతకల్లోలాలు సృష్టించి, వందల మంది ప్రాణాలను బలిగొన్న చరిత్ర తెలంగాణ ప్రజలకు తెలియంది కాదన్నారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ను గెలిపిస్తే ఆ పార్టీలో ముఖ్యమంత్రి రేసులో పదిమంది ఉన్నారని.. వారిలో ఎవరు ముఖ్యమంత్రి అయినా కొద్ది కాలంలోనే మిగతా ఎవరో ఒకరు ఏదో ఒక రకమైన ఘర్షణలు సృష్టించి ప్రజల ప్రాణాలను బలిగొనే ప్రమాదం లేకపోలేదని అన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన రేవంత్ రెడ్డి సీఎం అయితే తుపాకీ పెట్టిన నాటి నైజాన్ని చూపుతాడని.. ప్రజలు అప్రమత్తంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని మంత్రి వేముల అన్నారు.

You missed