కామారెడ్డిలో అధికార పార్టీ నేతల వ్యవహారం సీఎం కేసీఆర్‌కు, కేటీఆర్‌కు తలనొప్పులే కాదు తలవంపులు కూడా తెచ్చిపెడుతున్నాయి. మంత్రి కేటీఆర్‌ అంతా తానై ఇక్కడి పరిస్థితిని చక్కదిద్దే పనిలో ఉండగా… నేతలు దీన్ని చెల్లాచెదురు చేస్తూ పార్టీని మరింత భ్రష్టు పట్టించే విధంగా, ఆధిపత్య పోరు రచ్చకెక్కే విధంగా వ్యవహరిస్తున్నారు. మాచారెడ్డి ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు, జడ్పీటీసీ సభ్యుడు రాంరెడ్డి మధ్యజరిగిన గలాటా రచ్చకెక్కింది. ఇదెంత వరకు పోయిదంటే రెడ్డి వర్సెస్‌ వెలమ అనుకునే దాక. మొన్న చంద్రశేఖర్‌రెడ్డిని సస్పెండ్ చేశారు కదా.. ఇప్పుడు రాంరెడ్డిపై చేయి చేసుకున్న నర్సింగరావును ఎందుకు సస్పెండ్‌ చేయరంటూ ఏకంగా రెడ్డి నేతలంగా రోడ్డుకెక్కారు. ప్రెస్‌మీట్‌ పెట్టారు. ఒకరి దిష్టిబొమ్మలు మరొకరు దహనం చేసుకున్నారు. ఆదివారం కామరెడ్డిలో జరప తలపెట్టిన రెడ్ల ఆత్మీయ సమ్మేళనం రద్దు చేసుకునేంత వరకూ వెళ్లిందీ వ్యవహారం.

దీనిపై పెద్దసారు సీరియస్‌ అయ్యారు. అసలు కామారెడ్డిలో ఏం జరుగుతోందని ఆరా తీసినట్టు తెలిసింది. కేటీఆర్‌ సైతం లోకల్‌ ఎమ్మెల్యేతో సీరియస్‌గా దీనిపై చర్చించి అసలు విషయం తెలుసుకున్నట్టు సమాచారం. లోకల్‌ ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ జడ్పీటీసీ రాంరెడ్డి నివాసానికి వెళ్లి పరామర్శించి వచ్చారు. దీంతో లోయపల్లి నర్సింగరావుదే తప్పంతా అనే విధంగా పార్టీలో సిగ్నల్స్‌ వెళ్లాయి. ఇది రెడ్లు, వెలమల మధ్య మరింత అంతరం పెంచినట్టయ్యింది. ఈ పరిణామం పార్టీకి మరింత ఇబ్బందికరంగా మారింది. ఇటీవలే రామన్న రెండ్రోజులు కామారెడ్డిలో పర్యటించి అన్ని వర్గాలను ఏకం చేసే పని చేశాడు. అందిరినీ కలుపుకుపోయేలా తారక మంత్రాన్ని ప్రయోగించాడు. కానీ లాభం లేకుండా పోయింది. కామారెడ్డి తోక వంకరే అన్నట్టు ఇక్కడి నేతలు రోజు రోజుకు పార్టీని మరింత బజారుకీడ్చే పని చేస్తున్నారు.

You missed