ఆకుల లలిత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అందరూ అనుకున్నట్టు భిన్నంగా ఆమె పార్టీలో చేరారు. శుక్రవారం జిల్లా రోడ్ షోలో ఆర్మూర్‌లో పాల్గొననున్న రాహుల్ సమక్షంలో పార్టీలో చేరతారని అనుకున్నారంతా. అయితే ఆమె రాకను ఇందూరు జిల్లా కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించారు. జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డితో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్, రత్నాకర్ తదితరుల అధిష్టానానికి ఆమె పై ఫిర్యాదులు చేశారు.
గత ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి పోటీ చేసి చివరి నిమిషంలో జీవన్‌రెడ్డితో మిలాఖతై పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చిన ఆకుల లలితను మళ్లీ ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. అయితే రేవంత్‌రెడ్డి వీరి మాటలెవరివీ పట్టించుకోలేదు. సర్వే ఆధారంగా ఆకుల లలితకు ఇస్తే ఇక్కడ సీటు గెలిచనట్టేనని వారి అంచనా. దీంతో సూత్ర ప్రాయంగా టికెట్ ఆమెకేననే సిగ్నల్ ఇవ్వడంతో ఆమె బీఆరెస్‌కు రాజీనామా చేసేశారు. అంతా అనుకున్నట్టు జిల్లాలో రాహుల్ టూర్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని భావించారు.
కానీ అందరికీ షాక్ ఇస్తూ ఆమె పెద్దపల్లిలో రాహుల్ సభలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమెతో పాటు గడీల రాములు, తదితర ముఖ్య నేతలంతా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరోవైపు జిల్లా కాంగ్రెస్ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మహేశ్‌కుమార్ గౌడ్ తనకు టికెట్ రావడం లేదని పరోక్షంగా ఒప్పుకున్నాడు. ఒక నియోజకవర్గానికే పరిమితం కావొద్దని అధిష్టానం ఆదేశించిందంటూ ఏవో సాకులు చెప్పాడు. మొత్తానికి అర్బన్ నుంచి ఆకుల లలితకు టికెట్ ఖాయంగా కనిపిస్తోంది.