నిజామాబాద్ జిల్లాలో అర్బన్ నియోజకవర్గ కాంగ్రెస్ అతలాకుతులమవుతున్నది. నేనంటే నేనే నాయకుడిని అని.. నాకంటే నాకే టికెట్ అని నేతలు పోటాపోటీలో మునిగితేలుతుంటే అర్బన్ కాంగ్రెస్ అనాధలా మారిపోయింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన, పాదయాత్ర కార్యక్రమం ఖరారయ్యాక కూడా క్యాన్సిల్ కావడం వెనుక అర్బన్ లో నెలకొన్న కాంగ్రెస్ కుమ్ములాటలు కారణమని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీ లాంటి నేత వస్తే అర్బన్ లో ఎన్నికలకు ఉపయోగపడే మైలేజీ అందేదని.. నేతల కారణంగా పాదయాత్ర లాంటి మంచి అవకాశాన్ని పార్టీ మిస్ అయ్యిందని మండిపడుతున్నారు.
అర్బన్ నియోజకవర్గంలో మొదట మహేష్ కుమార్ గౌడ్, ధర్మపురి సంజయ్ మధ్య టిక్కెట్ పోరు నెలకొన్నది. అటు తర్వాత మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఆకుల లలిత కాంగ్రెస్ లో చేరి టికెట్టు తెచ్చుకునేందుకు బలమైన ప్రయత్నాలే చేయడంతో ఎన్నికలకు ముందే అర్బన్ కాంగ్రెస్‌లో టికెట్ కోసం త్రిముఖ పోరు మొదలైంది. ఓ మైనారిటీ నాయకుడు సైతం కార్బన్ టికెట్ కోసం ఆశపడి చేతి చమురు వదిలించుకున్నట్లు ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల మధ్య రేసులో ఉన్న నేతలు ఎవరికీ టికెట్టు ప్రకటించలేదు.
ఆకుల లలిత నిన్న నేడు దాదాపు అర్బన్ కాంగ్రెస్ టికెట్ సాధించినంత పని జరిగింది. ఆమె ప్రయత్నాలు కూడా టికెట్ వస్తుందేమో అని రేంజ్ లో సాగాయి. కానీ గురువారం రాత్రి పొద్దుపోయే వరకు సైతం ఆకుల లలితకు టికెట్ సంగతి పక్కన పెడితే కాంగ్రెస్‌లో చేరిక చాన్స్ కూడా దొరకలేదు. దీంతో అర్బన్ టికెట్ ఆస్పిరెంట్లందరూ డీలా పడిపోయారు. టికెట్ భరోసా కనిపించకపోవడంతో రాహుల్ పర్యటనను వ్యయానికి ఓర్చి విజయవంతం చేసే వారు లేకుండా పోయారు.
టికెట్ తో సంబంధం లేకుండా రాహుల్ పర్యటనను నెత్తిన వేసుకొనే నాయకుడు లేడు. వెరసి రాహుల్ పర్యటన రద్దు కాక తప్పలేదని అర్బన్ కార్యకర్తలు నారాజ్ లో పడిపోయారు . నాయకులు, టికెట్ ఆశావాహులు అర్బన్ కాంగ్రెస్ ను ఆగం చేశారని ..రాహుల్ పర్యటన రద్దయ్యేదాకా తీసుకెళ్లారని గుర్రు గుర్రు గా ఉన్నారు. అభ్యర్థిని ఖరారు చేయడంలో అధిష్టానం ఆలస్య వైఖరి కూడా అర్బన్ కాంగ్రెస్‌ను డీలా పడగొట్టిందని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. శుక్రవారం ఆర్మూర్ లో, బాల్కొండ నియోజకవర్గం లోని మోర్తాడ్ లో రాహుల్ పర్యటన జరగనుండడం అక్కడ ఇదివరకే అభ్యర్థుల ఎంపిక పూర్తవ్వడమే కారణమని వారు పేర్కొంటున్నారు.