మాల, మాదిగ

మధ్యలో ఎమ్మెల్సీ…?

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవి కోసం రెండుగా విడిపోయిన వర్గాలు…

టీఎస్‌ఎమ్మార్పీఎస్‌ దళిత రత్న అవార్డుల ప్రధానంలో బయటపడ్డ లుకలుకలు…

రాజేశ్వర్‌కు రెన్యూవల్‌ చేయాలని ఈ వేదికగా తమ వాయిస్‌ వినిపించిన మాదిగలు….

మధుశేఖర్‌కు ఇస్తే బాగుంటుందనే సంకేతమిచ్చిన మాలలు…..

 

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవి మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టింది. ఖాళీ అయిన ఈ ఎమ్మెల్సీ స్థానానికి మళ్లీ రాజేశ్వర్‌నే నియమించాలని ఆయన సామాజికవర్గమైన మాదిగలు బలంగా కోరుతున్నారు. దీనికి దళితరత్న అవార్డుల ప్రధానం కార్యక్రమాన్ని వేదికగా చేసుకున్నారు. ఈ సమావేశానికి మాలలు దూరంగా ఉన్నారు. వీరికి సమాచారం అందలేదని తెలిసింది. మరోవైపు మాలలు డాక్టర్‌ మధుశేఖర్‌కు ఎమ్మెల్సీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి యాక్టివ్‌గా ఉండటంతో పాటు బీఆరెస్‌పార్టీలో చేరడం , ఇచ్చిన హామీని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ భవన్‌లో టీఎస్‌ ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో జరిగిన దళిత రత్న అవార్డుల ప్రధానం కార్యక్రమాన్ని వేదికగా చేసుకున్నారు.

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రిని ఈ కార్యక్రమంలో సన్మానించారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి, నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా పాల్గొన్నారు. అయితే ఈ వేదికగా మాదిగలు రాజేశ్వర్‌ను ఎమ్మెల్సీ పదవికి రెన్యూవల్‌ చేయాలనే తమ వాయిస్‌ను వినిపించారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు పర్యాయాలు రాజేశ్వర్‌ ఎమ్మెల్సీగా ఉన్నారు. మూడో సారి ఇవ్వడం పట్ల చాలా మందికి ఇష్టం లేదు. మరోవైపు మధుశేఖర్‌ కూడా దీనిపై ఆశలు పెట్టుకున్నాడు. ఇద్దరూ మంత్రికి సన్నిహితులే కావడం గమనార్హం. ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. ఇప్పుడు ఇది జిల్లాలో మాల, మాదిగల పదవి పంచాయతీకి తెర లేపినట్టయింది. మాదిగల్లో ఎమ్మెల్సీ పదవిలో ఎవరూ లేరని, ఉన్న ఒక్కడు మాజీ అవుతున్నారనే ఆవేదన మాదిగలది.

 

 

You missed