నాడు చంద్ర‌బాబు రేవంత్‌ను ప్ర‌యోగించాడు. కేసీఆర్ తిప్పికొట్టాడు. పట్ట‌ప‌గ‌లు ఓటుకు నోటుకేసులో నోట్ల క‌ట్ట‌ల‌తో ప‌ట్టుబ‌డ్డారు. తెలంగాణ‌ను విచ్చిన్నం చేసే కుట్ర ఆ రోజు అలా విచ్చిన్న‌మైంది. ఇన్నాళ్ల‌కు ఇప్పుడు మ‌ళ్లా మునుగోడు ఉప ఎన్నిక వేదిక ఎమ్మెల్యేల బేర సారాల‌కు తెర తీసింది. బీజేపీ ఈ వ్య‌వ‌హారంలో తెలివిగా వ్య‌వ‌హ‌రించింది. స్టేట్ లీడ‌ర్ల ప్ర‌మేయం లేకుండా నేరుగా ఢిల్లీ నుంచి ఆప‌రేష‌న్ కొన‌సాగింది. న‌లుగురు ఎమ్మెల్యేలను ఒక్కొక్క‌రికి వంద కోట్లు ఇచ్చి కొనుగోలు చేయాల‌ని , ప‌ద‌వులు, కాంట్రాక్టులు ఇవ్వాల‌నుకున్నారు. కానీ ఇక్క‌డే క‌థ అడ్డం తిరిగింది. ఎమ్మెల్యేలు బీజేపీ ఆప‌రేష‌న్‌కు లొంగిన‌ట్టే లొంగారు. కేసీఆర్‌కు స‌మాచారం ఇచ్చారు. కేసీఆర్ మ‌ళ్లీ రేవంత్‌పై ప్ర‌యోగించిన విధంగానే పోలీసును రంగంలోకి దింపాడు. పోలీసులు ఆప‌రేష‌న్‌కు ముందుగానే మొయినాబాద్ ఫాం హౌజ్‌కు చేరుకుని ముగ్గురు బీజేపీకి సంబంధం ఉన్న‌వారిని అరెస్టు చేశారు.

న‌లుగురు ఎమ్మెల్యేల స‌మాచారంతోనే పోలీస్ ఆప‌రేష‌న్ జ‌రిగింద‌ని పోలీసు ఉన్న‌తాధికారులు చెబుతున్నారు. సీఎం దీనిపై స్పందించే అవ‌కాశం ఉంది. మొన్న బీజేపీ నుంచి స్వామిగౌడ్‌, శ్ర‌వ‌ణ్‌ల‌ను కేసీఆర్ పార్టీలోకి మ‌ళ్లీ తీసుకున్నారు. బూర న‌ర‌య్య గౌడ్‌కు తొల‌త బీజేపీ ఎర వేసింది.దీంతో నేరుగా కేసీఆర్ రంగంలోకి దిగాడు. ఒక్క బూర న‌ర్స‌య్య గౌడ్ పోతే ఇద్ద‌రిని లాగుతా అన్న‌ట్టు … కేసీఆర్ , స్వామిగౌడ్‌, దాసోజు శ్ర‌వ‌ణ్‌ల‌ను పార్టీలోకి తీసుకున్నాడు. ఇవాళ రాపోలు భాస్క‌ర్‌ను కూడా బీజేపీ నుంచి లాగారు. ఇదంతా మునుగోడు ఉప ఎన్నిక కేంద్రంగానే సాగుతున్న రాజ‌కీయం. ఏ పార్టీ గెలుస్తుంద‌నేది కీల‌కంగా మారింది. రానున్న ముంద‌స్తు, సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ఇది సెమీ ఫైన‌ల్‌గా మారింది.

మునుగోడులో గెలిచిన వాడే మొన‌గాడు అనే విధంగా హోరా హోరీగా పోరు సాగుతుంది. ప్ర‌లోభాలు సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో పార్టీ ఫిరాయింపులు, ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశ‌మూ తోడైంది. ఇప్పుడు రాజ‌కీయం మ‌రింత వేడెక్కింది. కాగా కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి దీన్ని ఖండించాడు. ఆ ఎమ్మెల్యేల‌కు అంత సీన్ ఉందా..? అని వెట‌కారం చేశాడు. అంటే అంత‌సీన్ ఉంటే వంద కోట్లు ఇచ్చేందుకు ఓకే అని ప‌రోక్షంగా ఒప్పుకున్న‌ట్టే ఉంది ఆయ‌న వాద‌న‌. మొత్తానికి ఇదిప్పుడే తెగేలా లేదు. ఉప ఎన్నిక ముగిసే లోపు మ‌రిన్ని చిత్ర విచిత్రాలు చూడాల్సి వ‌చ్చేలా ఉంది.

You missed