ప్రైవేటు ఆస్ప‌త్రుల‌లో ఎడాపెడా ఆప‌రేష‌న్లు చేసేస్తున్నారు. ప్ర‌స‌వం కోసం వ‌చ్చిన వారికి ఇక్క‌డ సిజేరియ‌నే దిక్క‌వుతుంది. నిజామాబాద్ న‌గ‌రంలోని ప్రైవేటు ఆస్ప‌త్రుల‌లో జ‌రిగిన ప్ర‌స‌వాల లెక్క‌లు తీస్తే 90 శాతం సిజేరియ‌న్ ఆప‌రేష‌న్లే చేశారు. ఓ ప‌ది శాతం నార్మ‌ల్ డెలివ‌రీలు అయ్యాయి. ప్ర‌భుత్వ ఆసుప్ర‌తుల్లోనే నార్మ‌ల్ డెలివ‌రీలు ఎక్క‌వ‌వుతున్నాయి. ప్రైవేటులో అంత ఓపిక లేదు. క‌డుపు కోయాల్సిందే .. బిడ్డ బ‌య‌ట‌కు తీయాల్సిందే .. పైస‌లు గుంజాల్సిందే. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే కాదు.. దాదాపు అంత‌టా ఇలాగే ఉంది ప‌రిస్థితి. దీనిపై జిల్లా క‌లెక్ట‌ర్ సీ నారాయ‌ణ‌రెడ్డి రివ్యూ చేశారు.

జిల్లాలో గల అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో గత ఆగస్టు మాసంలో జరిగిన కాన్పుల వివరాలను సమగ్ర పరిశీలనతో సేకరించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో లెక్కకు మించి జరుగుతున్న సీజీరియన్ల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు జిల్లా కలెక్టర్ గత కొన్ని నెలల నుండి క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తూ ప్రత్యేక చర్యలు చేపడుతున్న విషయం విదితమే. ఇందులో భాగంగానే ఆయా ఆసుపత్రుల్లో జరిగిన సీజీరియన్ ప్రసవాలు, మౌలిక సదుపాయాల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వీలుగా జిల్లా అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలను నియమించారు.
ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ప్రత్యేక పరిశీలక బృందాల అధికారులతో కలెక్టర్ సెల్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇదివరకటితో పోలిస్తే ఈసారి మరింత పకడ్బందీగా, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. స్థానికంగా జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సగటున 55శాతం సిజీరియన్లు జరుగుతుంటే, ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఏకంగా 88 శాతం సిజీరియన్లు జరుగుతుండడం ఒకింత ఆందోళన కలిగించే పరిణామంగా మారిందన్నారు. ఇది మహిళా సమాజానికి, వారి ఆరోగ్యాలకు ఎంతో చేటు చేస్తుందని అన్నారు.

Private Hospi. Delevaries- Agusut-22 (1)
దీనిని దృష్టిలో పెట్టుకుని గడిచిన ఆగస్టు నెలలో ఆయా ఆసుపత్రుల్లో జరిగిన అన్ని ప్రసవాల వివరాలను నిశితంగా పరిశీలన జరపాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. సిజీరియన్లు జరిగితే అందుకు గల కారణాలను పరిశీలించాలని, ప్రత్యేకించి మొదటి కాన్పులోనే సీజీరియన్ అయిన కేసులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అన్నారు. సమగ్ర పరిశీలన జరిపి అన్ని వివరాలతో వారం రోజుల్లోపు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. మహిళల ఆరోగ్యాలతో ముడిపడి ఉన్న అంశమైనందున, పరిశీలక బృందాల అధికారులు అంకిత భావం, చిత్తశుద్ధితో తమ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్ ఉద్బోధించారు.
అవసరం లేకపోయినా సిజీరియన్లు చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని, బాధ్యులైన వారిని ప్రజల్లో దోషులుగా నిలబెడతామని కలెక్టర్ స్పష్టం చేశారు. సమగ్ర పరిశీలన జరుపుతూ నిబంధనలను అతిక్రమించే ఆస్పత్రులపై చర్యలు చేపట్టాలని, అధికారులకు పూర్తి మద్దతుగా ఉంటామని కలెక్టర్ భరోసా కల్పించారు.

You missed