ఎన్ని శ‌క్తుల‌ను మోహ‌రించినా.. ఇంకా ఏదో అనుమానం. ఎన్ని నిధులు గుమ్మ‌రించినా గెలుపు తీరాల‌కు చేర‌మేమో అనే భ‌యం. ప‌ద‌వుల పందేరాలు, ప‌థ‌కాల ప‌రుగులు గ‌ట్టెక్కిస్తాయి అని క‌చ్చితంగా చెప్ప‌లేని ప‌రిస్థితులు. చిన్న‌పామునైనా పెద్ద క‌ట్టెతో కొట్టాల‌నేది టీఆరెస్ వ్యూహం. కానీ ఇక్క‌డ ఈట‌ల రాజేంద‌ర్‌ను పెద్ద‌పాముగా చూస్తున్నాడు కేసీఆర్‌. ఈట‌ల ఒక అన‌కొండ కేసీఆర్‌కు. మ‌రి అన‌కొండ‌ను ఢీకొట్టాలంటే ఎంత‌శ‌క్తి కావాలె. ఆ శ‌క్తుల‌ను ప్రోది చేసుకునే ప‌ని దాదాపుగా పూర్త‌య్యింది.

కౌశిక్‌రెడ్డి, ఎల్ ర‌మ‌ణ‌, పెద్దిరెడ్డిల నుంచి మొద‌లుపెట్టి ఎంపీపీలు, జ‌డ్పీటీసీలు, ఎంపీటీసీలు, స‌ర్పంచుల వ‌ర‌కు. ఎస్సీ క‌మిషన్ చైర్మ‌న్ గా కూడా ఇక్క‌డ్నుంచే అవ‌కాశం ఇచ్చాడు కేసీఆర్‌. ఇంకా చోటామోటా లీడ‌ర్లు కూడా. అంతా వ‌చ్చేశారు. వీరితో పాటు ఇద్ద‌రు మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, గంగుల క‌మ‌లాక‌ర్‌.. నిద్రాహారాలు అహోరాత్రులు శ్ర‌మిస్తున్నారు. కేసీఆర్ కోసం కాదు. వారి కోస‌మే. ఈ ఎన్నికలో గెల‌వ‌క‌పోతే భ‌విష్య‌త్ అంధ‌కార‌మే అనే భ‌యం ప‌ట్టుకుంది వారికి. ప్ర‌ష్టేస‌న్‌లో ఏం మాట్లాడుతున్నారో..? ఏం చేస్తున్నారో కూడా తెలియ‌డం లేదు వారికి పాపం.

పార్టీ అభ్య‌ర్థిగా గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్‌ను బ‌రిలోకి దింప‌నున్నాడు కేసీఆర్‌. ఇక త్వ‌ర‌లోనే యుద్ద‌రంగం రెడీ కానుంది. నోటిఫికేష‌న్‌కు ఎక్కువ రోజులు ప‌ట్టేలా లేదు. వీరంతా ఉన్నా కేసీఆర్‌… హ‌రీశ్ కు హుజురాబాద్ ఇన్‌చార్జి బాధ్య‌త‌లిచ్చాడు. మామ చెప్పిన త‌ర్వాత అల్లుడు సాధించి తీరాలంతే. గ‌త కొద్ది రోజులుగా సిద్దిపేట నుంచే మంత్రాంగం న‌డిపిస్తున్నాడు హ‌రీశ్‌. దుబ్బాక గుణ‌పాఠాలు క‌ళ్ల‌ముందు ఉండ‌నే ఉన్న‌వి. అందుకే సోష‌ల్ మీడియా టీమ్‌ను ద‌గ్గ‌ర‌కు తీసుకున్నాడు. మీటింగు పెట్టాడు. కొంత‌మంది త‌ను పిల‌వ‌లేద‌ని గుర్రుగా ఉన్నారు. హ‌రీశ్ వారినీ ద‌గ్గ‌ర తీస్తాడు. అంద‌రి స‌పోర్టు తీసుకుంటాడు.

ఈ రోజు హుజురాబాద్ గ‌డ్డ మీద హ‌రీశ్ అన్న కాలు మోపుతున్నాడ‌ని కౌశిక్ రెడ్డి గొప్ప‌గా త‌న ఫేస్ బుక్కులో పెట్టుకున్నాడు. అత‌ను ఇంత‌కుముందు ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి. ఇప్పుడు టీఆరెస్‌లో చేరితే ఎమ్మెల్సీకి అవ‌కాశం ఇచ్చారు. ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థిగా ఉండి.. ఈట‌లతో పోటీ ప‌డిన కౌశిక్‌రెడ్డి ఇప్పుడు అక్క‌డ ఆఫ్ట్రాల్‌. ఎమ్మెల్సీకి అమ్ముడుపోయాడ‌నే ముద్ర‌తో త‌న స్థాయి త‌గ్గించుకుని ఇలా నాయ‌కుల కాళ్ల ద‌గ్గ‌ర పారాడుతూ ఉన్న నేత‌. అంతే. ఇక మిగిలిన వాళ్ల ప‌రిస్థితీ అంతే. ఎల్ ర‌మ‌ణ‌ను జ‌నాలు మ‌రిచిపోయారు. పెద్దిరెడ్డి ఔట్ డేటెడ్‌. ఇవ‌న్నీ కేసీఆర్ తెలుసు. అయినా వారికి అవ‌కాశం ఇచ్చాడు. ప‌ద‌వులు ఇస్తాన‌ని మాటిచ్చాడు. ఎందుకు? అప్ప‌టి త‌క్ష‌ణ అవ‌స‌రాల కోసం కేసీఆర్ ఏమైనా చేస్తాడు. ద‌ళిత‌బంధుకు 500 కోట్లు ఇచ్చిన‌ట్టుగా. అంతే రాజ‌కీయ అవ‌స‌రాల అలాగే ఉంటాయి. ఏదైనా కేసీఆర్ ఓపెన్‌గానే చేస్తాడు. కొన్నిసార్లు చెప్తాడు కూడా.

ఇప్పుడు హ‌రీశ్ మీదే ఈ గుంపంతా న‌మ్మ‌కం పెట్టుకున్న‌ది. ఒక్క‌డి మీద పోటీకి వంద శ‌క్తులున్నా… మ‌రొక్క‌డి కోసం ఎదురుచూస్తున్నాయి. అంత అప‌న‌మ్మ‌కం వారిపై. అంత న‌మ్మ‌కం హ‌రీశ్‌పై.

You missed