అత‌నో పెద్ద వ్యాపారి. నిర్మాణ రంగంలో క‌ష్ట‌ప‌డి, శ్ర‌మ‌కోర్చి పైకొచ్చాడు. హైద‌రాబాద్‌లో స్థిర‌ప‌డ్డాడు. కానీ క‌న్న ఊరిపై మ‌మకారం పోలేదు. ఆ ఊరంటే అత‌నికి ప్రేమ‌. ఓనాడు త‌న‌కు పాఠాలు నేర్పి ఇంత‌టి వాడిని చేసిన స‌ర్కార్ బ‌డికి వెళ్లాడు. శిథిలావ‌స్థ‌లో ఉన్న ఆ బ‌డి ప‌రిస్థితి చూసి త‌ల్ల‌డిల్లాడు. చిన్న‌నాటి జ్ఞాప‌కాల‌తో విడ‌దీయ‌రాని బంధం ఆ బ‌డితో ఆయ‌న‌కున్న‌ది. వెంట‌నే ఓ నిర్ణ‌యానికి వ‌చ్చాడు. త‌న సొంత క‌ష్టార్జితంతో కొత్త‌గా బ‌డి నిర్మించాల‌నుకున్నాడు. బావిత‌రాల పిల్ల‌ల‌కు ఎంద‌రికో ఇది వేదిక‌గా విలసిల్లాల‌ని ఆకాంక్షించాడు. అనుకున్న‌దే త‌డువుగా ప‌ని మొద‌లుపెట్టాడు. అధునాత‌న హంగుల‌తో కార్పొరేట్ స్కూల్‌ను త‌ల‌ద‌న్నే విధంగా త‌నే ద‌గ్గ‌రుండి, త‌న అనుభ‌వాన్నంత ఉప‌యోగించి మూ

డున్న‌ర కోట్ల‌తో బ‌డి నిర్మాణం పూర్తి చేశాడు. ఇప్పుడా ఆ బ‌డి పాత స్థానంలోనే కొత్త రూపుదాల్చుకొని పూర్వ వైభ‌వంతో తొణికిస‌లాడుతున్న‌ది. ఎంద‌రో విద్యార్థుల‌ను త‌న ఒడిలో చేర్చుకొని విద్యా బుద్ధులు నేర్పి స‌మాజానికి అందించేందుకు ఆ బ‌డి రెడీ అయ్యింది. ఆయ‌న పేరు తిమ్మ‌య్య‌గారి సుభాష్ రెడ్డి. కామారెడ్డి జిల్లా బీబీపేట మండ‌ల కేంద్రంలోని జ‌డ్పీహెచ్ఎస్ (బాయ్స్‌) ను మూడున్న‌ర కోట్ల‌తో ఈ బిల్డ‌ర్ నిర్మించాడు. ప్ర‌భుత్వం స్పందించి ఆ పాఠ‌శాల‌కు సుభాష్ రెడ్డి పేరును పెడ‌తామ‌ని ప్ర‌తిపాదించింది. దీనిని తిర‌స్క‌రించిన ఆయ‌న త‌న త‌ల్లిదండ్రుల పేరును పెట్టాల‌ని కోరారు. దీనికి ప్ర‌భుత్వం స‌మ్మ‌తించింది. తాజాగా జీవో విడుద‌ల చేసింది. ఇప్పుడు ఆ స్కూల్ పేరు తిమ్మ‌య్య‌గారి సుశీల – నారాయ‌ణ రెడ్డి జ‌డ్పీహెచ్ఎస్‌. క‌న్న ఊరిని త‌ల‌చి చ‌దువుకున్న బ‌డిని అపురూపంగా రూపొందించి క‌న్న త‌ల్లిదండ్రుల పేరును సార్థ‌క‌త చేసిన సుభాష్‌రెడ్డిని ఇప్పుడ‌క్కడి వారంతా శ‌భాష్ సుభాష్ రెడ్డి అంటున్నారు.

You missed