హుజురాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రాకముందే రాజకీయ వాతావరణం రోజురోజుకూ హీటెక్కుతుంది. ఈటల రాజేందర్ తనపై హత్యకు కుట్ర జరుగుతున్నదని పరోక్షంగా మంత్రి గంగుల కమలాకర్‌ను ఉద్దేశించి మాట్లాడటం దుమారం రేపింది. దీనిపై కౌంటర్‌గా మంత్రి గంగుల కూడా తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. దీనిపై విచారణ జరిపి నిజమని తేలితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని లేదంటే రాజేందర్ తప్పు ఒప్పుకుని రాజకీయాలకు దూరంగా ఉండాలని సవాలు విసిరాడు. హత్య రాజకీయాల్లో ఈటల ఆరితేరి ఉన్నాడంటూ ఆరోపించాడు. రాజేందర్ అనుచరులే అతన్ని హత్య చేస్తారంటూ మాట్లాడడం కొత్త వివాదానికి తెర తీసింది. మరో వైపు కాంగ్రెస్ బహిష్క్రుత నేత కౌశిక్‌రెడ్డి సైతం ఈటల పై విరుచుకుపడ్డాడు. మాజీ ఎంపీటీసీని ఈటల రాజేందర్ హత్య చేయించాడని, 2014లో ఎన్నికల్లో తన పై హత్య ప్రయత్నం చేశాడని అన్నాడు. ఈటల రాజేందర్ లేవనెత్తిన మర్డర్ పాలిటిక్స్ కు కౌంటర్, ఎన్ కౌంటర్లతో ఒకరిపై మరొకరు పరస్పర మాటల దాడులు చేసుకుంటున్నారు. దీనికి కొనసాగింపుగా మళ్లీ ఈటల స్పందించాడు. మంత్రుల ఫోన్లను ట్యాప్ చేస్తున్న ప్రభుత్వం తనపై హత్యకు కుట్ర జరుగుతుందన్న విషయాన్ని తెలుసుకోలేదా అని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశాడు.