దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి!

ఇందూరు బీఆరెస్‌లో కవిత కనుమరుగైపోయింది. మాజీ ఎంపీ, మాజీ సీఎం కూతురు, జిల్లా బీఆరెస్‌కు ఆమే పెద్ద దిక్కు. అది నిన్నటి వరకు. కానీ ఆమె జైలుపాలయిన తరువాత పార్టీ వ్యూహం మార్చుకున్నది. ఆమె ఫోటో కూడా లేకుండా బీఆరెస్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్‌ ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టింది. శుక్రవారం ఆయన నామినేషన్‌ వేసిన తరువాత పాత కలెక్టరేట్‌ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు పెద్ద యాడ్లు ఇచ్చాడు బాజిరెడ్డి.

కానీ ఆ పేద్ద యాడ్లలో ఎక్కడా కవితది చిన్న ఫోటో కూడా లేకపోవడం ఇక్కడ చర్చకు తెర తీసింది. ఆమె జైలు పాలు కావడానికి బీజేపీ, మోడీ , కేంద్రం అంటూ కేసీఆర్‌ నుంచి మొదలుకొని ఆ పార్టీ నేతలంతా ఖండిస్తున్న వేళ.. ఇక్కడ ప్రచారంలో మాత్రం ఎందుకు ఆమె ఫోటో లేదు. వద్దన్నారా.? వద్దనుకున్నారా..? వద్దనే ఉంటారు. కేటీఆర్‌, కేసీఆర్‌ మాట ప్రకారమే కదా పార్టీ నాయకులు ముందుకు నడిచేది.

కవిత ఫోటో వాడితే, ఆమె ప్రస్తావన తీస్తే అంతా నెగిటివిటీ మూటగట్టుకుంటారా..? అంతలా వ్యతిరేకత ఉందా ఆమె పట్ల జనంలో. ఎందుకు ఆమెను ప్రజలకు మరింత దూరం చేస్తున్నారు. ఇలాంటి చర్యలతో ఆమె ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కాకతప్పదని అనుకోవాలా..? హేమిటో … కేసీఆర్‌ ఆలోచన. ఏమీ అర్థం కావడం లేదు ఆ పార్టీ నేతలకే.

You missed