దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

సీఎం రేవంత్‌ ఇందూరు లోక్‌సభను గెలుచుకునేందుకు ఓ ఒక్క అంశాన్నీ వదలడం లేదు. చిన్న పామును పెద్ద కర్రతో కొట్టాలంటారు. కానీ అర్వింద్‌ అనే ఆనకొండను తలదన్నేందుకు అన్ని శక్తులతో పాటు సొంత అన్నని కూడా రంగంలోకి దింపుతున్నాడు. అర్వింద్‌కు, సంజయ్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత గ్యాప్‌ ఉంది. సంజయ్‌కు పూర్తి స్వేచ్చ ఇచ్చి రంగంలోకి దింపితే అర్వింద్‌ను పూర్తి కట్టడి చేయమడే కాక.. పార్టీకి మరిన్ని ఓట్లను తీసుకురావచ్చనే యోచనలో సీఎం రేవంత్‌ ఉన్నాడు. అందుకే సంజయ్‌ను ప్రత్యేకంగా పిలిపించుకుని ఇదే అంశంపై చర్చించినట్టు తెలిసింది.

సంజయ్‌ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్‌ టికెట్ ఆశించి భంగపడ్డాడు. తండ్రి డీఎస్‌ కూడా సంజయ్‌ కోసం ప్రయత్నం చేసినా రాజకీయ సమీకరణలో అది సాధ్యం కాలేదు. డీఎస్‌ కోరిక సంజయ్‌కు ఏదైనా పదవి దక్కాలని. దీని కోసం రేవంత్‌ కూడా సానుకూలంగా ఉన్నట్టు తెలిసింది. కానీ సమయం పట్టేలా ఉంది. ఈ లోపు వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో సంజయ్‌ సేవలను వినియోగించుకోవాలని రేవంత్‌ డిసైడ్‌ చేసుకున్నాడు.

ఇటీవల కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి సంజయ్‌ను ప్రత్యేకంగా కలిసి చర్చించాడు. మైనార్టీలతో పాటు మున్నూరుకాపుల్లో సంజయ్‌కు పట్టుంది. కీలకమైన ఈ ఓటు బ్యాంకును కాంగ్రెస్‌ ఖాతాలో వేసుకునేందుకు సంజయ్‌ ద్వారా మార్గం సుగమం చేసుకోవడంతో పాటు తమ్ముడు అర్వింద్‌ నోటికికళ్లెం వేసి.. రాజకీయంగా కట్టడి చేసేందుకు సంజయ్‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు తెలిసింది.

 

You missed