దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

బోధన్‌ బీఆరెస్‌ నేత గిర్దావర్‌ గంగారెడ్డికి బీజేపీ ఆఫర్‌ ఇస్తోంది. ఏకంగా ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తాం రారమ్మంటోంది. బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ అజ్ఞాతంలో ఉండటంతో చాలా రోజులుగా ఈ నియోజకవర్గంలో బీఆరెస్‌ పార్టీ ఉనికి కోల్పోతూ వస్తోంది. నేతలు, కార్యకర్తలు పార్టీని వీడుతున్నారు. ఇన్చార్జి ఎవరూ లేకపోవడం.. పార్టీ పెద్దలు ఎవరూ ఈ నియోజకవర్గంపై ఫోకస్‌ పెట్టకపోవడంతో మరింత దారుణంగా పార్టీ పరిస్థితి తయారయ్యింది. ఇదే సమయంలో పార్లమెంటు ఎన్నికలు రావడంతో బీఆరెస్‌కు ఇదో పెద్ద తలనొప్పి వ్యవహారంలా మారింది. అయితే అక్కడ అంతో ఇంతో సీనియర్‌ నేతగా చెప్పుకునే లీడర్లలో గిర్దావర్‌ గంగారెడ్డి ఒకడు.

ఈ పార్లమెంటు ఎన్నికల్లో పార్టీకి గట్టిగా నిలబడి పనిచేస్తే ఇన్చార్జి బాధ్యతలు ఇస్తామనే సూత్రప్రాయమైన సంకేతాలు గంగారెడ్డికి వచ్చాయి. కానీ మళ్లీ మాట మార్చుకున్నారు. బోధన్‌లో మైనార్టీల ఓట్లు ఎక్కువ. ఎంత షకీల్‌పై వ్యతిరేకత ఉన్నా.. అతన్ని కాదని ఎవరికీ అక్కడ ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చే ధైర్యం పార్టీ అధిష్టానం చేయలేదు. ఇంకా షకీల్‌ అజ్ఞాతం వీడకపోవడంతో అతని భార్య ఆయేషా ఫాతిమాకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు.

దీంతో గిర్దావర్ గంగారెడ్డి మరింత అసంతృప్తికి లోనయ్యాడు. ఆలోపే అతనికి బీజేపీ నుంచి ఆఫర్‌ వచ్చింది. ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి .. గంగారెడ్డికి సమీప బంధువు. అతని ద్వారా పార్టీలోకి రావాలని ఆహ్వానం అందింది. ఎమ్మెల్యే టికెట్‌ కూడా ఇస్తామనే హామీ పరోక్షంగా ఇచ్చినట్టు తెలిసింది. అయితే ఇక్కడ ఇన్చార్జిగా వడ్డీ మోహన్‌రెడ్డి ఉన్నాడు. ఇటీవల ఇక్కడి నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయాడు.

పెద్దగా ప్రభావం చూపని నేతగా అధిష్టానం భావిస్తోంది. గంగారెడ్డి ఇటు కాంగ్రెస్‌లోకి వెళ్లాలో, బీజేపీ ఆఫర్‌ స్వీకరించాలో తెలియని సందిగ్దంలో ఉన్నాడు. కానీ బీఆరెస్‌కు మాత్రం పనిచేసే పరిస్థితి కనిపించడం లేదు.

You missed