దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

మధుయాష్కీ. రాజకీయాలంటే అసలే తెలియదు. తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చాడు. డీఎస్‌ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. పక్కా సమైక్యవాదియైన రాజశేఖర్‌రెడ్డిని ఎదిరించి నిలిచాడు. మాచారెడ్డి మండలంలో రైతుల ఆత్మహత్యలపై చలించి తనవంతు సాయం చేసి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ప్రజలకు చేరువైన నేత. రాజకీయ అవకాశాలూ అలాగే కలిసి వచ్చాయి. ఎంపీగా చాన్స్‌ ఇచ్చింది కాంగ్రెస్‌. ఒకసారి కాదు… వరుసగా రెండు సార్లు గెలిపించుకున్నారు. గౌండ్ల బిడ్డగా అక్కున చేర్చుకున్నారు. ఢిల్లీకి పంపారు. బడుగు బలహీన వర్గాల నేతగా, తమ ప్రతినిధిగా పార్లమెంటులో గళం విప్పి తమకు అండగా నిలుస్తాడని భావించారు.

కానీ యాష్కీ తనకు వచ్చిన అవకాశాన్ని మిస్‌యూజ్‌ చేశాడు. మేథావిగా తనకు తనే ప్రకటించుకున్నాడు. తన కోసం ఖర్చుకు వెనకాడకుండా భుజానవేసుకుని గెలిపించుకున్న గౌండ్లను కాదనుకున్నాడు. దరి చేరచేరనీయలేదు. వచ్చిన అధికారం అతని ఆలోచనలను మార్చింది. క్రమంగా గౌండ్ల నుంచి తిరస్కరమే ఎదురవుతూ వచ్చింది. తీరా అతని రాజకీయం ఇప్పుడు జిల్లా నుంచి వెలివేయబడింది. అలా చేసుకుంది స్వయంగా ఆయనే. తన స్వయంకృతాపరాధమే. ఇప్పుడు జిల్లాకు వచ్చే ముఖం లేదు. ఢిల్లీలో కాస్తో కూస్తో పరిచయం ఉంది. కానీ, ఇంట గెలిచి రచ్చ గెలలవాలన్నట్టు.. ఇంట వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు తమకు గౌండ్ల నుంచి ఓ ఎంపీ అభ్యర్థి కావాలని అడిగే పరిస్థితిని కూడా మిగిల్చకుండా చేసి పాపం మూటగట్టుకున్నాడు యాష్కీ.

అంతా నువ్వే అని త్యాగం చేసి మరీ గెలిపించుకున్న గౌడ్లకు యాష్కీ ఇచ్చిన బహుమానం నయవంచన. నమ్మకద్రోహం. అవమానం. పుట్టగతులు లేకుండా చేయడం. ఇప్పుడు కాంగ్రెస్‌ ఇక్కడ బీసీ జపం చేస్తోంది. మున్నూరుకాపులు, పద్మశాలీల తరువాత బాగా ప్రభావితం చేసే, గణనీయమైన ఓట్లున్న సామాజికవర్గం గౌడ్లు. మధుయాష్కీ దీన్ని ఓన్ చేసుకున్నాడు ఆనాడు. అధికారం రాగానే విస్మరించాడు. మూలాలు మరిచాడు. ఇప్పుడు రాజకీయంగా తన ఆనవాళ్లు కోల్పోయే దీనస్థితికి వచ్చాడు. కానీ ఇందూరు గౌడ్స్‌ను అనాథ చేసిన పాపం మాత్రం యాష్కీని ఎక్కడున్న వెంటాడుతూనే ఉంటుంది.

You missed