కాంగ్రెస్‌లో ఒకప్పుడు పోటీ చేసేందుకు ఎవరా అని ఎదురుచూసే పరిస్థితి నుంచి నేనంటే నేను పోటీకి సై అనే స్టేజ్‌కి వచ్చిందా పార్టీ. ఒక్కో నియోజకవర్గం నుంచి ఆరు నుంచి పది మందికి తగ్గకుండా దరఖాస్తులు చేసుకున్నారు. ఇటీవల గాంధీ భవన్‌లో ఎన్నికల కమిటీ వీటిని స్క్రూటినీ చేసి ప్రతీ నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున లిస్ట్‌ అవుట్ చేసి ఈనెల 4న ఏఐసీసీకి పంపనుంది. ఢిల్లీకి వెళ్లిన తర్వాత అక్కడ ఎక్కువ రోజులు ఆపరు. నాలుగైదు రోజుల్లో సర్వే ఆధారంగా మార్కులననుసరించి ఫైనల్ లిస్టును టీపీసీసీకి పంపుతుంది.

ఇక ప్రకటించడమే తరువాయి. అంతా సరిగానే కొనసాగుతున్న సమయంలో ఇప్పుడు కొత్త వివాదం వచ్చి పడింది. కొన్ని జిల్లాల్లో సర్వే టీములతో ఏఐసీసీతో, టీపీసీసీతో సత్సంబంధాలున్న జిల్లా నేతలు తమకు అనుకూలంగా ఉన్నవారికి మంచి మార్కులేసే విధంగా గోల్‌మాల్‌ చేశారనేది ప్రధాన ఆరోపణ. ఇది గాంధీ భవన్‌లో కొత్త చిచ్చును రేపింది. ఇందూరులో కూడా ఈ తరహాలోనే జరిగిందని గగ్గోలు పెడుతున్నారు వివిధ నియోజకవర్గాలకు సంబంధించి దరఖాస్తు చేసుకోని పోటీకి కత్తులు దూస్తున్న అభ్యర్థులు. దీంతో టీపీసీసీకే కాదు ఏఐసీసీకి కూడా ఫిర్యాదులు మొదలు పెట్టారు. మళ్లీ రెండో వ్యక్తి తెలియకుండా సీక్రెట్ సర్వే చేయాలని ఆ సర్వే రిపోర్టు ఆధారంగానే టికెట్లు ఫైనల్ చేయాలని కోరుతున్నారు. ఈ లెక్కన ఏఐసీసీ ఫైనల్‌ లిస్టు ప్రకటించినా… జంపింగ్‌లు, లొల్లి, వివాదాలు కొనసాగనున్నాయనే సంకేతాలు ఇప్పట్నుంచే ఆ పార్టీ నేతల వ్యవహారం చూస్తే తెలుస్తోంది.

You missed