వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్:
మొన్న నిజామాబాద్ రూరల్ మండల ఆత్మీయ సమ్మేళనంలో గోవన్న ఇచ్చిన వార్నింగ్ పనిచేసింది. రూరల్ మండల బీఆరెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాన్ని లీడర్లు లైట్‌గా తీసుకున్నారు. ఈ నిర్లక్ష్యం,అసలత్వం ఆ మీటింగులో కొట్టొచ్చినట్టు కనిపించింది బాజిరెడ్డి గోవర్దన్‌కు. దీంతో ఆ వేదికగా నిర్లక్ష్యం వహించే లీడర్‌ను క్షమించేది లేదన్న ఆయన… పార్టీ పటిష్టత కోసం తనదైన శైలిలో ఉపదేశం చేశారు. ఈ ఉపదేశ మంత్రం ఫలించింది.
అది ఆదివారం జరిగిన మోపాల్ మండల ఆత్మీయ సమ్మేళనంలో ప్రతిఫలించింది. పెద్ద ఎత్తున మోపాల్ మండలం నుంచి లీడర్లు కార్యకర్తలను తరలించారు. ప్రతీగ్రామం నుంచి కార్యకర్తలు రావడంతో సమావేశ మందిరం కిక్కిరిసిపోయింది. కన్నుల పండువగా వేడుకలా ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. దీనిపై బాజిరెడ్డి కూడా ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా ఐకమత్యంగా ఉండాలని, అంతా కలిసి కష్టపడాలని, మరోసారి మనమే అధికారంలోకి రాబోతున్నామని, రాష్ట్రంలోనే నెంబర్ పొజిషన్‌లో రూరల్ నియోజకవర్గం ఉన్నట్టు సర్వేలు వెల్లడిస్తున్నాయని ఆయన వారిని మరింత ఉత్సాహపరిచారు. రేపు ధర్పల్లిలో, మండళవారం జక్రాన్‌పల్లిలో ఆత్మీయ సమ్మేళనాలు ఉంటాయని ప్రకటించారు. మొత్తానికి రూరల్ మండల ఆత్మీయ సమ్మేళనంలో గోవన్న చేసిన ఆత్మవలోకం, హితబోధ నియోజకవర్గ లీడర్లందరినీ అలర్ట్ చేసింది.
ఎవరికి వారే తమ ప్రాంతాల్లో మరింత అలర్టయ్యారు. పిలుపేదిచ్చినా దాన్ని రెట్టించిన ఉత్సాహం చేసి సక్సెస్ చేసి బాస్ వద్ద మంచి మార్కులు కొట్టేయాలనే తహతహతో ఉన్నారు.
నేను లేకుంటే జగన్.. అర్థరాత్రైనా .. ఎవరికి ఫోన్ చేసినా స్పందిస్తాం…
ఉదయం ఏడు గంటల నుంచి నా ఇంటికి జనం జాతర కడతారు… ఓపిగ్గా అందరినీ చేరదీస్తాను. అన్ని సమస్యలూ వింటాను. పరిష్కరిస్తాను. అందరినీ నా వారిగా భావిస్తాను… ఒక్కోసారి యాష్టకు తెప్పిస్తరు.. కానీ ఓపిక తెచ్చుకుని మరీ అందరి సమస్యలు పరిష్కరిస్తాను….. నేనే కాదు.. రూరల్ నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించడంతో నా కొడుకు జగన్ పాత్ర కూడా ఉంది… నేను లేనప్పుడు జగన్ అందుబాటులో ఉంటున్నాడు.. ప్రజలకు సత్వర సేవలు చేయడంలో ఇద్దరమూ పాటుపడుతున్నాము.. అని అన్నారు ఆర్టసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్.
ఆదివారం మోపాల్ మండల బీఆరెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో తన అంతరంగాన్ని ఇలా ఆవిష్కరించారాయన. పగలు, రాత్రి తేడాలేదు.. ఎప్పుడైనా తమకు ఫోన్లు వస్తూనే ఉంటాయన్నారాయన. అర్దరాత్రి ఫోన్లు వచ్చినా మేం స్పందిస్తామని, సమస్య విని పరిష్కరించే గుణం మాకుందని ఆయన వివరించారు. మళ్లీ మూడోసారి కూడా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో విజయం తమదేనన్నారు. రాష్ట్రంలో గెలిచే అన్ని స్థానాల్లోకెల్లా నెంబర్‌వన్ స్థానంలో రూరల్ నియోజకవర్గం ఉందని, సర్వే గణంకాలన్నీ ఇవే చెప్పాయని ఆయన రూరల్ ప్రజలకు ఈ వేదికగా వివరించారు. అంతా కలిసికట్టుగా పనిచేయాలని, గ్రూపులు కట్టి ప్రతిపక్షాలకు సందివ్వొదని సూచన చేశారు. బాజిరెడ్డితో పెట్టుకుంటే తమకు పుట్టగతులుండవనే విషయం ప్రతిపక్ష పార్టీలు ఏనాడో గ్రహించాయని, అందుకే పనికి రాని ఆరోపణలు, అభివృద్దికి అడ్డుపడేలా అడ్డుపుల్లలు వేయడం చేస్తున్నారని, ప్రజలు అవేమీ పట్టించుకోవద్దని కోరారు.
సీఎం కుర్సీ కోసం కాంగ్రెస్, బీజేపీల కొట్లాట…. ప్రజల బాగు కోసం కేసీఆర్ తండ్లాట…
బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులిద్దరూ పొద్దున లేస్తే సీఎం కుర్చీ దిగాలే, మేము ఎక్కాలే అనే యావే తప్ప, ప్రజల కోసం ఏం చేస్తామో, ఇప్పటి ప్రభుత్వం కన్నా గొప్పగా ఏం చేసి చూపుతామో తెప్పే తెలివి, సత్తా లేవని, సీఎం కేసీఆర్‌కు మాత్రం పొద్దున లేచిన దగ్గర నుంచి అహర్నిశలు ప్రజల బాగుకోసం తండ్లాడతారని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ అన్నారు. పజలసీఎం కుర్చీ మీ తాత జాగీరా ? అని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు ఇన్ని పథకాలు ప్రవేశపెడుతూ వారి సంక్షేమం కోసం నిరంతరం ఆలోచిస్తూ పరితపిస్తున్న కేసీఆర్ వైపే ప్రజలున్నారని ఆయన అన్నారు. పొద్దున లేస్తే సీఎం సీటు కోసం పోరాడే ప్రతిపక్షాల పాలన ఎలా ఉందో గతంలో ప్రజలు చూసి ఉన్నారన్నాని గుర్తు చేశారు. బోర్గాం (పీ)లోని మెటాడి రెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఆదివారం జరిగిన మోపాల్ మండల బీఆరెస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
అప్పటి పాలనకు ఇప్పటి పాలనకు ప్రజలు తేడాను స్పష్టంగా తెలుసుకున్నారని, ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, రైతుబంధు, రైతుబీమా పథకాలు పేద, బడుగు, బలహీనవర్గాలకు ఎంతో మేలు చేస్తున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1101 రెసిడెన్షియల్ పాఠశాలల్లో లక్షలాది మంది పేద విద్యార్థులకు ఉచిత నాణ్యమైన విద్య దొరుకుతున్నదన్నారు.ఈ విద్యార్థుల పాలిట కేసీఆర్ తల్లీదండ్రీ, తాతా అన్నీ తానై కావాల్సిన వసతులు ఏర్పాటు చేయిస్తున్నారని అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి సంక్షేమం అమలు కావడం లేదన్నారు. ఇవాళ ఏం వారమన్నా..? రేపేం వారమన్నా..? అంటూ బండి సంజయ్ మాట్లాడతారని, సీఎం కేసీఆర్ మాత్రం ఇవాళ ప్రజలకు ఏం చేద్దాం…? రేపేం పథకం తెద్దాం అని ఆలోచిస్తారని అన్నారు. హిందువుల పేరు చెప్పుకుని పబ్బం గడుపుకుంటున్న బీజేపీ వల్ల హిందువులకే ప్రమాదం పొంచి ఉందని, ఇది ప్రజలు గమనించాలని ఆయన కోరారు. ఇక్కడ లోకల్‌గా బీజేపీ నేతలు హిందుత్వం గురించి చెబుతారని, కానీ గుళ్లకు ఒక్క పైసా చందా కూడా ఇవ్వరని బాజిరెడ్డి గోవర్దన్ ఎద్దేవా చేశారు.
నిజామామాద్ రూరల్ నియోజకవర్గంలో 70 దేవాలయాలు కట్టించి ఇచ్చానని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ చొరవ వల్ల రూరల్ నియోజకవర్గానికి 750కేవీ సబ్ స్టేషన్ వచ్చిందన్నారు. కరెంటు విషయంలో రూరల్ నియోజకవర్గం అగ్రస్థానంలో ఉందన్నారు. ప్రధాని మోడీ నన్ను చూడు.. నా అందం చూడు అన్నట్టుగా రోజుకో వేషం కడుతూ విదేశాల్లో చక్కర్లు కొడతారని, సీఎం కేసీఆర్ ప్రజల బాగు కోసం ఇక్కడ రాత్రి, పగలు శ్రమిస్తారని అన్నారు. తెలంగాణ ఏర్పడి పదేళ్లలోకి అడుగిడుతున్న శుభసందర్భంగా జూన్ 2 నుంచి ఘనంగా 21 రోజుల పాటు వేడుకలు జరుపుకోబోతున్నామన్నారు.తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి గురించి అధికార యంత్రాంగంతో కలిసి పార్టీ క్యాడర్ అంతా ప్రచారం చేయాలని, ప్రజలకు వివరించాలని ఆయన కోరారు.
యూపీ మాజీ సీఎం అపఖిలేశ్ యాదవ్ యాదాద్రి వైభవ ప్రతిష్ఠను చూసి అచ్చెరువొందారని, కేసీఆర్ తను చేసిన పనుల గురించి ప్రచారం చాలా తక్కువ చేసుకుంటారని అన్నారని గుర్తు చేశారు. మంచిప్ప రిజార్వాయర్ పనులు 90 శాతం పూర్తయ్యాయని, ఏడాదిలో లక్ష ఎకరాలకు సాగునీరందనుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏం చేస్తామో చెప్పరని, చేసే వారికి అడ్డుపడి ప్రజలకు మేలు జరగకుండా చేయాలని చూస్తారని అన్నారు. ఇన్ని మంచి పనులు చేస్తే బాజిరెడ్డికి ఎక్కడ మంచి పేరువస్తుందోనని , ఎక్కడ తమకు పుట్టగతులుండవోనని వీరికి భయం వెంటాడుతున్నదని విమర్శించారు.
ఇక్కడ సీఎం కేసీఆర్ మదిలో ఓ పథకం రూపుదిద్దుకుందంటే.. దాన్ని అమలు చేయడం ఆయన చేతుల్లోనే ఉంటుందని, సాధ్యాసాధ్యాలు ఆలోచించి కేసీఆర్ పథకాలు రూపొందించి వెంటనే వాటిని అమలు పరుస్తారని, కానీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇచ్చే అలవిమాలిన హామీలు నెరవేరాలంటే ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదిక్షణలు చేసి వారి మెప్పుపొంది.. ఓకే అంటేనే అమలయ్యే పరిస్థితి ఉంటుందన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి గిరిజనులకు స్వయం పాలన అందించామన్నారు. ఈ సమావేశానికి మోపాల్ మండల పార్టీ అధ్యక్షుడు మొచ్చ శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఎంపీపీ లతాకన్నెరాం, జడ్పీటీసీ కమలనరేశ్, రైతు సమన్వయ అధ్యక్షుడు శ్రీనివాస రావు, సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు, నుడా డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.