ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత కోరుట్ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయ‌నున్నారా..? అందుకే ఆమె ఆ నియోజ‌క‌వ‌ర్గంపై ప్ర‌త్యేక దృష్టి పెడుతున్నారా? ఇప్పుడు ఇదే చ‌ర్చ టీఆరెస్ వ‌ర్గాల్లో జోరుగా సాగుతోంది. నిన్న కోరుట్ల నియోజ‌క‌వ‌ర్గ కార్య‌క‌ర్త‌ల విస్తృత స్థాయి స‌మావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఆ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే విద్యాసాగ‌ర్‌రావు, ఎమ్మెల్సీ ఎల్ ర‌మ‌ణ త‌దిత‌రులు న‌ర్మ‌గ‌ర్బంగా క‌విత అక్క‌డి నుంచి పోటీ చేయ‌నున్న‌ద‌నే విధంగా ప‌రోక్షంగా మాట్లాడారు. ఎంపీ మొన్న ఓడ‌గొట్టుకున్నామ‌ని, మ‌రోసారి ఇలా జ‌ర‌గ‌నివ్వొద్ద‌ని, ఈసారి ఇక్క‌డి నుంచి భారీ మెజార్టీ ఇద్దామ‌ని అన్నారు.

చివ‌ర‌గా క‌విత మాట్లాడినప్పుడు… విద్యాసాగ‌ర్ రావును కొనియాడుతూ… అక్క‌డి ప్ర‌జ‌లు ఆయ‌న వెన్నంటి ఎప్పుడూ ఉన్నార‌ని, ఆయ‌న‌ను ప‌లుమార్లు ఎమ్మెల్యేగా గెలిపించుకుని… ఇక్క‌డ టీఆరెస్ పెట్ట‌ని కోటఅని నిరూపించార‌ని అన్నారు. మ‌రోసారి ఇక్క‌డ గులాబీ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాల‌ని కోరిన ఆమె.. మ‌ళ్లీ విద్యాసాగ‌ర్ రావుకు భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించాల‌ని మాత్రం అనలేదు. ప‌రోక్షంగా ఆమె ఇక్క‌డి నుంచి ఎవ‌రు పోటీ చేసిన ఘ‌న విజ‌యాన్ని అందించాల‌ని కోరారు. ఇక్క‌డి నుంచి త‌ను పోటీ చేయ‌నున్న‌ట్టు ఆమె మాట‌లే ప‌రోక్ష సంకేతాలిచ్చాయి పార్టీ వ‌ర్గాల‌కు. గ‌తంలో కూడా ఆమె ఇక్క‌డ ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. ఇక్కడి కార్య‌క్ర‌మాల‌పై ప్రత్యేక శ్ర‌ద్ద తీసుకుంటున్నారు. ఈసారి ఆమె పార్ల‌మెంటుకు కాకుండా.. ఎమ్మెల్యేగా పోటీ చేస్తార‌ని అనుకుంటున్నారు.

మొన్న నిజామాబాద్ ఉమ్మ‌డి జిల్లా స్థానిక సంస్థ‌ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందిన త‌ర్వాత కేబినెట్‌లో చోటు ద‌క్కుతుంద‌ని, మంత్రిగా ఆమె జిల్లాకు వ‌స్తార‌ని ఇక్క‌డి నేత‌లు భావించారు. కానీ రాజ‌కీయ ప‌రిణామాలు మారి ఆమెకు మంత్రి ప‌ద‌వి వ‌రించ‌లేదు. ఇప్ప‌ట్లో ఇక కేబినెట్ విస్త‌ర‌ణ ఉండ‌దు. దీంతో మంత్రి ప‌ద‌వి పై ఇక్క‌డి ప్ర‌జ‌లు ఆశ‌లు వ‌దులుకున్నారు. అయితే భ‌విష్య‌త్తు రాజ‌కీయంలో భాగంగా ఆమె ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని భావిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. నిజామాబాద్ అర్బ‌న్ లేదా బోధ‌న్ నుంచి పోటీ చేస్తార‌నే ప్ర‌చారం గ‌తంలో జ‌రిగింది. కానీ ఆమె త‌న రాజ‌కీయ వ్యూహంలో భాగంగా కోరుట్ల‌ను ఎంచుకున్నార‌ని ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను బ‌ట్టి పార్టీలో చ‌ర్చించుకుంటున్నారు.

అయితే, కేసీఆర్ ఇప్పుడే క‌విత ఎక్క‌డి నుంచి పోటీ చేయాలో క్లారిటీ ఇవ్వ‌ర‌ని, చివ‌రి వ‌ర‌కు స‌స్పెన్స్‌లోనే ఉంచుతార‌ని ఆ పార్టీ సీనియ‌ర్ నేత ఒక‌రు చెప్పారు. ఆయ‌న మ‌దిలో ఏముందో ఎవ‌రికీ తెలియ‌ద‌న్నారు. క‌విత కోరుట్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తార‌నేది ఓ ప్ర‌చార‌మేన‌ని, ముంద‌స్తుగా ఓ ప్లానింగ్ చేసుకుంటే చేసుకుంటుండొచ్చు.. కానీ.. అంతిమంగా బాస్ ఏదీ నిర్ణ‌యిస్తే అదే ఫాలో కావాల్సి ఉంటుంద‌ని, వ్య‌క్తిగ‌త ఇంట్ర‌స్టులు ఇక్క‌డ పెద్ద‌గా ప‌నిచేయ‌వని ఒక ప్ర‌శ్న‌కు స‌మాధానంగా ఆయ‌న చెప్పారు.

You missed