దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

కేసీఆర్‌ మారలే. పరాభవం మూటగట్టుకున్నా.. పార్టీ నేతలు తలోదారి పట్టి చేజారిపోతున్నా తీరు మార్చుకోలే. ఆయన ఇప్పటికీ ఫామ్‌ హౌజ్‌ రాజకీయాలే చేస్తున్నాడు. పార్లమెంటు ఎన్నికల వేళ బీజేపీ, కాంగ్రెస్‌లో కదనరంగంలో దూకితే పార్టీని చక్కదిద్ది లోపాలను సరిచేసుకోవాల్సిన అధినేత .. మళ్లీ ఫామ్‌హౌజ్ బాట పట్టాడు. అక్కడి నుంచే రాజకీయాలు చేస్తున్నాడు షరా మామూలుగా. అది గతంలో చెల్లుబాటయ్యింది.

అధికారం చేతిలో ఉన్నప్పుడు ఇలా నియంత పాలన సాధ్యమయ్యింది. కిమ్మనకుండా భరించారు మంత్రులతో సహా. కానీ ఇప్పుడు.. ఒక్కసారిగా ఆపార్టీ అధఃపాతాళంలో పడిపోయింది. లేవడానికి చాలా కాలమే పట్టేట్టుంది. కనీసం ఒక్కసీటైనా గెలుస్తామా అనే అనుమానం నానాటికి బలపడుతున్న సమయంలో కూడా ఉద్యమనాయకుడు ఫామ్‌హౌజ్‌లో ఎవరినీ కలవకుండా గతంలో లాగే ప్రవర్తించడం పాపం మిగిలిన నేతలకు మింగుడుపడటం లేదు. కేటీఆర్‌ను కలవాలన్నా ఇప్పటికీ అపాయింట్‌మెంట్లు కావాలి. ఆయన ఎక్కడుంటాడో తెలియదు. ఎప్పుడు కలవాలో ఎవరికీ అర్థం కాదు.

గతంలో కవితను కలవాలన్నా ఆమె ఇంటి ముందు గేటు దగ్గర వెయిట్ చేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడామె జైలుపాలయ్యింది. ముగ్గురే మూలకేంద్రాలుగా నడిచిన పార్టీ.. ఇప్పుడు ఆ ముగ్గురూ తలోదిక్కున ఎవరికీ చేజిక్కకా, మునిగిన పార్టీని పైకి లేపే ప్రయత్నాలు జరగకపోగా.. అవే అహంకార పూరిత మాటలు, ప్రవర్తన మిగిలి ఉన్న నేతల్లో తీవ్ర అసంతృప్తిని, వైరాగ్యాన్ని మిగుల్చుతున్నాయి. ప్రమాదమంతా జరిగిన తరువాత,పార్టీ పరిస్థితి ఏమీ లేదు.. మూడో పొజిషన్‌లో కొట్టుకునుడే అని డిక్లేర్‌ అవుతున్న సందర్భంలో కూడా ఇంకా తేరుకోక.. నేనింకా సీయెంనేననే రీతిలో ఫామ్‌ హౌజ్‌ రాజకీయాలు చేస్తానంటే ఎలా బాసు..? అని ప్రశ్నిస్తున్నారు ఆ పార్టీ నేతలు.

ఓడిన సానుభూతి లేకుండా పోయింది. కాలు విరిగిన సానుభూతి ఎంతో కాలం నిలవలేదు. కాంగ్రెస్‌ వైఫల్యాలూ ఈ నేతల తీరుతో ప్రజలు సీరియస్‌గా తీసుకోలేకపోతున్నారు. కీలకమైన ఈ సమయంలో, పార్లమెంటు ఎన్నికల వేళ పడే దెబ్బ ఇక బీఆరెస్‌ను లేపుతుందా…? కోలుకోనిస్తుందా..? నిలబడనిస్తుందా..? బతికి బట్టకట్టనిస్తుందా..?? ఫామ్‌హౌజ్‌ నాయకుడు ఆలోచించాల్సిన అత్యవసర సమయమిది.

You missed