అలాగే ఆకాశానికేసి చూస్తూ నిలబడ్డాడు. ముఖం మీద గడ్డ కట్టిన రక్తం మరకలను అది కడిగేస్తున్నది. గుండె భగభగ ఇంకా పూర్తిగా చల్లారలేదు. ఒక్కసారిగా రాజారెడ్డికి పరమేశ్ గుర్తొచ్చాడు. “నా దుస్థితికి వాడే కారణం… వాడ్నీ చంపేస్తా…”
అలా అనుకున్నాడో లేదో… పిచ్చిపట్టిన వాడిలా అటూ ఇటూ చూస్తున్నాడు. దారి కోసం వెతుకుతున్నాయి ఆ కళ్లు.
కళ్లు పొడుచుకున్నా ఏమీ కనబడని దట్టమైన చీకటి ఆవరించి ఉంది.
ఓవైపునకు కాళ్లు కదిలాయి. నాలుగడుగులు వేశాడో లేదో… ఎదురుగా ఉన్న ముళ్ల కంపపై పట్టుతప్పి పడిపోయాడు.
శరీరాన్ని జల్లెడ చేసినట్లుగా అవి కసకసమని గుచ్చాయి.
“అమ్మా ..” అని మూలిగాడు బాధగా. లేద్దామంటే సాధ్యం కావడం లేదు. ముళ్ల కంప బట్టలను చీల్చేసి లోపల శరీరాన్ని తూట్లు పొడిచినట్లుగా చేసింది. రక్తం కారుతున్నది. బలవంతంగా లేచాడు. పరపరమని బట్టలు చినిగాయి. అవి పీలికలు పీలికలుగా అయ్యా యి.
లేచి నిలబడ్డాడు. పడుతూ లేస్తూ ముందుకు నడుస్తున్నాడు. గుంతలలో అదుపు తప్పి కింద పడిపోతున్నాడు. ముఖం, మోచేతులు చెక్కలు లేస్తున్నాయి. అతని అవతారం పిచ్చోడిని తలపిస్తున్నది.
భయంకరంగా కనిపిస్తున్నాడు. ముఖం రూపురేఖలు కోల్పోయింది. గాయాలతో అది గుర్తు పట్టరాకుండా అయిపోయింది.
పది నిమిషాలు పడుతూ లేస్తూ మెయిన్ రోడ్డుకు చేరుకున్నాడు. వాహనాలు ఏవీ రావడం లేదు. ఎటు వెళ్లాలో తెలియడం లేదు. మళ్లీ ఆ గుండె రగులుతున్నది.
ఎటో ఓ వైపు నడవాలె అనుకున్నాడు. కాళ్లు ఓ చోట నిలకడగా ఉండడం లేదు. రోడ్డుకు కుడివైపుగా నడక మొదలుపెట్టాడు.
నాలుగడుగులు వేశాడో లేదో..
ఎదరుగా స్పీడ్ గా వచ్చిన ఓ బైక్ రాజారెడ్డికి గుద్దేసింది. క్షణకాలంలో జరిగిపోయిందది.
ఏమి జరిగిందో తెలుసుకునే లోపే … ఎగిరి ఐదడుగుల దూరంలో పడ్డాడు రాజారెడ్డి. ముఖం రోడ్డుకు బలంగా గుద్దుకున్నది. ముక్కు పగిలింది. మూతిపండ్లు ఊడి కిందపడినట్లుగా భరించలేని నొప్పి.
కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. స్పృహ కోల్పోతానేమోనన్న ఫీలింగ్ కలుగుతోంది రాజారెడ్డికి. అప్పటి వరకు పలుచబడ్డ వాన చినుకులు మళ్లీ జోరందుకున్నాయి. టపటపా మని ముఖం మీద సూదుల్లా గుచ్చుతున్నాయి. చిమ్మ చీకటి. చుట్టూ కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించని గాఢాంధకారం. తనను బలంగా గుద్దిన బైక్ కూడా కనిపించడం లేదు. “అది గుద్దేసి వెళ్లిపోయిందా?” బలవంతంగా లేచేందుకు ప్రయత్నిస్తున్నాడు. నోట్లో నుంచి, ముక్కులో నుంచి రక్తం కారుతున్నది. డాంబర్ రోడ్డు మీద పారుతున్న వాన నీటిలో ఆ కారుతున్న రక్తం కలిసిపోతున్నది. బలవంతంగా మోచేతులు నేలకు ఆనించి లేవబోయాడు… కొద్దిగా లేచాడో లేదో మళ్లీ దబ్బున కిందపడ్డాడు. అలాగే వానలో నానుతూ ఉన్నాడు. బాడీలో మెల్లగా చలనం వస్తున్నది. మత్తు దిగుతున్నది. అంతలోనే అతనికి కొద్ది దూరంలో ఓ బైక్ స్టార్ట్ అయిన సౌండ్ వినిపించింది.
“గుర్రు గుర్రు ” మంటుందది. ఎక్కడి నుంచో తెలియడం లేదు. సౌండ్ మాత్రం వినిపిస్తున్నది.
గుంటనక్క దాడి చేసే ముందు పళ్లన్నీ బయట పెట్టి భయంకరంగా శబ్దం చేసినట్లు ఆ బైక్ సౌండ్ ఆగుతూ ఆగుతూ ఒక్కసారిగా సౌండ్ పెరుగుతూ వస్తున్నది.
ఆబైక్ పై ఉన్న వ్యక్తి దాన్ని రేప్ చేస్తున్నాడు. యాక్సిలేటర్ ను చివరి వరకు లాగుతున్నాడు. బాణం లక్ష్యం దిశగా గురిపెట్టినట్లు ఆ బైక్ రాజారెడ్డి మీదకు లంఘించేందుకు సిద్ధంగా ఉందని అర్థమవుతున్నది.
మనసు ఏదో కీడును శంకించింది రాజారెడ్డికి. ” ఎవరతను? అంటే కావాలనే తనను ఢీ కొట్టాడా?” “ఇంత దూరం తను వచ్చినట్లు ఎవరికీ తెలియదే?” “అంటే మమ్మల్ని ఫాలో చేస్తూ వస్తున్నాడా?” “అతని టార్గెట్ ఇద్దరం కాదు.. ఒక్కరమే.” “అది నేనే. ఎందుకు?” “ఎందుకు?? ఎవరతను???” వర్షం మరింత పెరిగింది. బైక్ రేస్ కూడా పెరిగింది. గుంటనక్క గాండ్రింపు భయంకరంగా వినిపిస్తున్నది. ఇంతలో హెడ్ లైట్ వెలిగింది. దట్టమైన చీకటిని చీలుస్తూ ఒక్కసారిగా అక్కడ గాఢమైన వెలుగు పరుచుకున్నది.
ఆ లైట్ వెలుతురులో వాన కుండపోతలా దారగా పడుతున్నట్లు కనిపిస్తున్నది. బైక్ పై ఎవరో కూర్చొని రేస్ చేస్తున్నట్లు గుర్తించాడు రాజారెడ్డి. లేచి కూర్చున్నాడు. అటువైపే చూస్తున్నాడు.
“ఎవడు వీడు??” “నన్నెందుకు వలపన్ని చంపాలనుకున్నాడు.” ఒక్కసారిగా ఉరుము ఉరిమింది. దాంతో పాటు మెరుపులు చమక్ మని వచ్చి పోతున్నాయి.
లైట్లు వేస్తూ ఆర్పుతున్నట్లుగా వస్తున్న మెరుపుల వెలుతురుకు బైక్ పై ఉన్న వ్యక్తి కొద్ది కొద్దిగా కనిపిస్తున్నాడు రాజారెడ్డికి.
“ఎవరతను?? ” పట్టి పట్టి చూస్తున్నాడు. కండ్లలో వాన చినుకలు చివుక్కు చివుక్కుమని పొడుస్తున్నాయి. చూడనీయడం లేదు. మొత్తానికి అతన్ని పసిగట్టాడు రాజారెడ్డి. అవే డేగ చూపులు. జింకను వేటాడే వేటగాడి చూపులు.
అతను స…………లీ……… “సలీం….నన్నెందుకు చంపాలనుకుంటున్నాడు??” లక్ష్మి గుర్తొచ్చింది. “రాక్షసి నన్ను మట్టుబెట్టేందుకు రంకు మొగుణ్ని పంపింది.” “అసలప్పుడే ఇద్దరినీ చంపి పాతరేయాల్సింది.” అంత నీరసంలోనూ రాజారెడ్డికి పట్టరాని కోపం వస్తున్నది. నోట్లో నుంచి రక్తం కారుతూనే ఉంది.
మదించిన ఆంబోతులా బైక్ ముందుకు రయ్యి రయ్యిన ఉరికొస్తున్నది. అలర్టయ్యాడు రాజారెడ్డి. అది రాగానే బైక్ ను ఒడిసిపట్టుకుందామనుకున్నాడు. దాన్ని కింద పడేసి సలీమ్ పై లఘించి కలబడదామనుకున్నాడు. కానీ అతనికి సాధ్యం కాలేదు. ముందు టైరు వచ్చి డొక్కలో గుద్దింది.
రెండు మీటర్ల మేర రోడ్డుపై సర్రున రాక్కుంటు ముందుకు పోయాడు. కానీ కుడిచేత్తో ముందు టైరును, ఎడమ చేత్తో బండి నెంబర్ ప్లేటును పట్టుకోగలిగాడు. ఉడుము పట్టులా దాన్ని వదల్లేదు.
సలీం బైక్ ను రేప్ చేస్తూ రాజారెడ్డి మీదకు ఎక్కించేందుకు శక్తినంతా ఉపయోగిస్తున్నాడు. ముందు టైరు రాజారెడ్డి తొడ మీదకు ఎక్కింది. అది ప్యాంటును పీలికలు చేసి తొడ కండరాలను చెక్కేస్తున్నది.
అయినా పట్టువీడలేదు రాజారెడ్డి. బాధతో ప్రాణం పోతున్నట్లు ఉన్న తెచ్చి పెట్టుకున్న బలంతో బండిని ముందుకు రాకుండా కంట్రోల్ చేస్తున్నాడు. దాన్ని కింద పడేసేందుకు విఫలయత్నం చేస్తున్నాడు.
సలీం నవ్వుతున్నాడు. ఆ మెరుపుల వెలుతురులో గార పట్టిన ఆ పళ్లు భయంకరంగా కనిపిస్తున్నాయి.
డేగ కళ్లు గునపంతో గుచ్చేస్తున్నట్టుగా తీక్షణంగా చూస్తున్నాయి. వేటకు చిక్కిన జింకపిల్ల గిలగిలా తన్నుకుంటుంటే వేటగాడి కళ్లలో నాట్యమాడే ఆనందం సలీం కళ్లలో కనిపిస్తున్నది.
‘ఇంకా ఎంత దూరమో పోలేవు. నీ ప్రాణాలు ఇక్కడే నాచేతిలో పోబోతున్నాయి.” అన్నట్టుగా వికట్టహాసం చేస్తున్నట్టుగా ఉందా నవ్వు.
“వద్దు సలీం… రాజారెడ్డిని ఏం చెయ్యొద్దు. అతడు అమాయకుడు.” బతిమాలుతున్న లక్ష్మి మాటలు వినిపిస్తున్నాయి సలీంకు.
“నీకు తెలియదు. మగాడికి ఒక్కసారి నువ్వు లోకువగా కనిపించావంటే. నీ జీవితంతో ఆడుకుంటాడు. మనిద్దరికీ అది ప్రమాదమే.”
“అతను అలాంటి వాడు కాదు. నేను వార్నింగ్ ఇచ్చాను. ఇక మనజోలికి రాడు.” “నీకు తెలియదు నువ్వు నోర్మూసుకుంటావా? జీవితాంతం వాడు నిన్నూ నన్నూ బ్లాక్ మెయిల్ చేస్తూ బతుకుతాడు.” “ఇలాంటివాళ్ల క్రిమినల్ మైండ్ నాకు తెలుసు…..” “సలీం ప్లీజ్…. ప్లీజ్…….”
“చంపేస్తున్నా లక్ష్మి …. వీడి పీడ విరగడకాబోతుంది.” అప్పటి వరకు పైశాచికానందంతో నవ్విన ఆ ముఖం కర్కశంగా, భయంకరంగా మారింది.
బండిని వెనక్కి లాగుతున్నాడు. ఇద్దరు పెనుగులాడుతున్నారు. కింద రోడ్డుపై పడుకొని రాజారెడ్డి బైక్ ను పట్టుకొని గబ్బిలంలా వేలాడుతున్నాడు. వెనక్కి గుంజుకునేందుకు సలీం శక్తినంత ఉపయోగిస్తున్నాడు.
పెనుగులాటకు హెడ్ లైట్ కాంతి ఆ చుట్టు పక్కల పొలాల్లో అటూ ఇటూ కలియ తిరుగుతున్నది. అప్పుడప్పుడు రాజారెడ్డి ముఖం మీద పడుతున్నది.
బలవంతుడి ముందు బలహీనుడు ఓడిపోయాడు. బైక్ ను అతని హస్తాల్లోంచి లాక్కున్నాడు సలీం.
చేతికి నెంబర్ ప్లేట్ ఊడి వచ్చింది. రాజారెడ్డి దాన్నే ఆయుధంగా తలచి గట్టిగా పట్టుకున్నాడు. సలీంపై పోరాటానికి సిద్ధమయ్యాడు.
వెనక్కి బైక్ తీసుకుని మళ్లీ వేగంతో రాజారెడ్డి మీదకు వస్తున్నాడు సలీం.
అది దగ్గరకు రాగానే రెప్పపాటులో పక్కకు తప్పుకున్నాడు. ఇది ఊహించలేదు సలీం. బైక్ కంట్రోల్ తప్పింది. రోడ్డు దిగి పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లి పక్కకు ఒరిగింది.
“రుయ్ …… రుయ్…..” అని బైక్ రేసు సౌండ్ వస్తున్నది. పొలాల్లో హెడ్ లైట్ కాంతి పరుచుకున్నది. తేరుకున్న సలీం…. ఇగ్నీషియన్ ఆఫ్ చేశాడు.
మోత ఆగింది. వెలుతురు మాయమయ్యింది. మళ్లీ కారు చీకట్లు కమ్ముకున్నాయి. వర్షం మరింత జోరందుకున్నది. అంతా నిశ్శబ్దం. సలీం ఎక్కడున్నాడు?? చేతి వేళ్లు నెంబర్ ప్లేట్ పై మరింత బలంగా బిగుసుకున్నాయి. చుట్టూ ఏమీ కనిపించడం లేదు. చిమ్మ చీకటి తప్ప. కొద్ది క్షణాల తర్వాత తనకు కొద్ది దూరంలో ఒక్కసారిగా తళుక్కుమని ఓ మెరుపులాంటిది కనిపించింది. ఆ మెరుపు అలాగే ఉంది మసక చీకటిలో.
అది
క………. తళతళమెరుస్తున్నది. సలీం దాన్ని పట్టుకొని తనవైపు వస్తున్నట్టుగా అది సంకేతమిస్తున్నది. తన చిలుముపట్టిన కత్తికన్నా అది వందరెట్లు వాడిగా ఉన్నట్లు భావించాడు రాజారెడ్డి. “ఎలాగైనా తప్పించుకోవాలి. ఎలా? ఎలా??” “వీడిని చంపాలి. ఇంటికి వెళ్లి ఆ లక్ష్మిని చంపాలి.” “పరమేషునూ చంపాలి.” “వీళ్లందరినీ చంపాలంటే… నేను బతికుండాలి.” అతని ఆలోచనలు పూర్తి కాకముందే… మెల్లగా కదులుతున్న కత్తి హఠాత్తుగా శరవేగంగా వచ్చి రాజారెడ్డి కడుపులో కసుక్కున దిగబడింది.
“అమ్మా ….!” అన్నాడు… ఆ అరుపు కూడా పెద్దగా రాలేదు. ఊపిరి లోపలే ఆగిపోతున్నది. అంతబలంగా దిగబడ్డదా కత్తి.
దాన్ని మరింత లోపలకు గుచ్చి మెలి పెట్టి తిప్పుతున్నాడు. ఆ కత్తికి పేగులు చుట్టుకొని ఒడి తిరుగుతున్నాయి. తిరిగి తిరిగి ఫట్ ఫట్ మని కడుపులోనే తెగిపోతున్నాయవి.
“అమ్మా… !” మళ్లీ అరిచాడు. అరుస్తూనే ఉన్నాడు. బాధ భరించలేకుండా ఉన్నాడు. చేతిలోని నెంబర్ ప్లేట్ తో బలమంతా కూడదీసుకొని సలీం తలపై మోదాడు.
‘ఫట్’మని తాకింది. తలపై అలాగే ఫట్ ఫట్ మని కొడుతూనే ఉన్నాడు. ఆ దెబ్బలకు తాళలేక సలీం “అబ్బా ..” అని కత్తిని పైకి లాగేశాడు. వెనక్కి విరుచుకుపడ్డాడు.
రాజారెడ్డి అలాగే నేలమీద పడిపోయాడు.
ఆ కళ్లు ఆకాశం వైపు చూస్తున్నాయి. వర్షం ధారలుగా పడుతూనే ఉంది. రక్తం ప్రవాహంలా రోడ్డుపై పారుతూ వెళ్లి పక్కనే వరి పొలాల్లోని నీటిలో కలిసిపోతున్నది.
కొద్దిసేపటికి…. సలీం బైక్ సౌండ్ వినిపించింది. ఆ శబ్దం క్రమంగా అంతర్థానమయిపోయింది. చావు కోరల్లో తనను బందీ చేసేసి అతను వెళ్లిపోయాడు. “ఇక నాకు చావు తప్పదు.” అది అతనికి తెలుస్తూనే ఉంది. మృత్యువు వచ్చి కౌగిట్లో కూర్చున్నది. గట్టిగా ఆలింగనం చేసుకుంటున్నది. తనను ఇక వదిలే ప్రసక్తే లేదన్నట్లుగా దాని కౌగిలి బిగుసుకుంటున్నది. ఊపిరి ఆడనీయకుండా చేస్తున్నది. ఆకాశం బోరున ఏడుస్తున్నదన్నట్లుగా వర్షపు దారలు ప్రవహిస్తున్నాయి. కన్న కలలన్నీ కల్లలై పోయినట్లు… ఆ వరదప్రవాహంలో కొట్టుకుపోతున్నట్లుగా అనిపిస్తోందనికి. అధునాతన హంగులతో నిర్మించిన తన అద్దాల భవనం పేకమేడలా కూలిపోతున్నది. తాను కొన్న కొత్త కారు శిఖరం అంచు నుంచి జారి కిందకు లోయలో పడిపోతున్నది. కళ్ల ముందే ఆశల సౌధాలు కుప్పకూలుతున్నాయి. అది చూసి సమాజం అతన్ని హేళన చేస్తూ పకపకా నవ్వుతున్నది. పట్టరాని కోపం వస్తున్నది రాజారెడ్డికి. “ నన్ను చూసి నవ్విన వాళ్లందరినీ చంపెయ్యాలి.” “అప్పుడు గానీ నాకు ప్రశాంతత లేదు.” ” చంపేస్తారరేయ్… మీ అందరినీ చంపి పాతరేస్తాను.”
గుండె బలహీనంగా కొట్టుకుంటున్నది. ఒంట్లోని రక్తమంతా చెరుకుమరలో పెట్టి చెరుకు రసం తీసినట్లుగా శరీరంలో నుంచి రక్తం ధారలు ధారలుగా… బొట్లు బొట్లుగా కారిపోతూనే ఉంది.
ఆటోలో అతని పిల్లలు వనజతో కలిసి ఎటో వెళ్తున్నారు. రవి ఆటో నడుపుతున్నాడు. “ రవిని చంపేశాను కదా? మళ్లీ ఆటోలో తన కుటుంబ సభ్యులను తీసుకొని……” జాగ్రత్తగా గమనించాడు. “ఆటో నడుపుతున్నదెవరు?” “రవి కాదు. అతను మరెవరో..? అంటే వేరొకడు మళ్లీ తన కుటుంబానికి దగ్గరయ్యాడా?” “అయితే వాడ్నీ
చం..పా..ల్సిం…దే.” ” చంపుతాను. వాడి చావూ నా చేతిలోనే రాసి పెట్టి ఉంది. ” “ఎవ్వడినీ వదలను.” చావుకు ఇంకా మరికొన్ని క్షణాలే మిగిలి ఉన్నాయి. అది తెలుస్తూనే ఉంది అతనికి. కానీ బతకాలని ఉంది. “ఎలా…?” “బతికి సాధించాలి… ” “బతికి ఏం సాధించాలి?”
“చం…పా…లి..” “ఎవరిని చంపాలి..? నన్ను చూసి హేళన చేసిన అందరినీ చంపాలి. ?” కానీ ఇపుడు నేను బతకాలి. “ఎవరైనా వస్తే బాగుండు.” బతుకు పై ఆశ చిగురిస్తున్నది. దురదృష్టం వెంటాడుతూనే ఉంది. అదృష్టం ఎప్పుడో తలుపులు గట్టిగా వేసేసుకున్నది. మృత్యు కౌగిలి బిగుసుకుంటున్నది. ఏదో జలపాతంలా ఉంది.
భార్య, పిల్లలు… ఓ ఆటో డ్రైవరు… ఆనందంగా గడుపుతున్నారు. నవ్వుతూ తళుతూ ఆడుకుంటున్నారు. ఫోటోలు దిగుతున్నారు. సెల్ఫీలకు ఫోజులిస్తున్నారు. “ఒరేయ్ డ్రైవర్ గా … నీకెంత ధైర్యం?” “నిన్ను చంపేస్తానురా గాడిద కొడకా…” ఊపిరి ఆగిపోతున్నది. “చావు తప్పదా…?” “హ….హ…హ…హ” ఎవరో పకపకా నవ్వుతున్నారు. “ఎవరు? ఎవర్రా అది??” నరసింహం. కడుపు పట్టుకొని పకపకా నవ్వుతున్నాడు. తనవైపు వేలు చూపుకుంటూ నవ్వుతున్నాడు. “ఒరేయ్ నిన్ను చంపుతానురా….” “అవునూ …! వాడు చచ్చాడు కదా…” ” నరకంలోకి వెళ్లి మరీ చంపుతాను.” “అంటే నేనూ నరకానికేనా??” మళ్లీ పగలబడి నవ్వుతున్నాడు నరసింహం. “అరేయ్ నేను నరకానికి రాను…” పడి పడీ నవ్వుతున్నాడు మళ్లీ నరసింహం. ఇంకా క్షణాలే మిగిలి ఉన్నాయి. ” నా లోకానికి ఇక శాశ్వత సెలవా?” “ నా ఊహాలోకంలో ఇక నేను స్వేచ్చగా విహరించలేనా??” “అవునూ..! నా చావు వార్త విని నా భార్య ఎలా స్పందిస్తుంది?” “నాపై పడి ఏడుస్తుందా??” “పీడవిరగడైందని లోలోన సంతోషపడుతుందా?”
“నా పిల్లలు ఏడుస్తారా?” “అయ్యో వారి భవిష్యత్తు కోసం ఎంతో తపించానే…?” “ఇపుడెలా??” మనసు తల్లడిల్లుతున్నది. ప్రాణంపై ఆశలు పెరుగుతున్నాయి. కానీ…
అంతలోనే.. ఊపిరి తీసుకోవడం ఆగిపోయింది. గుండె చలనం లేకుండా పోయింది. చావు కళ్ల ముందే నాట్యమాడుతున్నది. ఆ గాజు కళ్లు ఆకాశానికేసి చూస్తున్నాయి. “రాజారెడా?? మజాకా??” అన్నట్లుగా గర్వంతో తొణికిసలాడుతున్నట్లుగానే ఉన్నాయా కళ్లు. రాజారెడ్డి పిడికిలిలో సలీం బైక్ నెంబర్ ప్లేట్ అలాగే బిగుసుకుపోయి ఉంది. అది వంపు తిరిగిపోయి ఉన్నా… నెంబర్ మాత్రం కనిపిస్తున్నది.
6…0…5…0

(సమాప్తం)

 

 

You missed