మెట్రోరైల్‌లో ఓ ప‌సిబిడ్డ‌తో ఉన్న త‌ల్లికి సీటు ఇవ్వ‌కుండా .. కాలేజీ అమ్మాయిలు సీట్ల‌లో కూర్చున్నారు. ఆమె మాత్రం ప‌సిబిడ్డ‌తో కింద కూర్చుని ఉంది. ఎవ‌రూ చూడ‌టం లేదు. ఆమెను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఎవ‌రో నిలుచున్న అత‌ను వీడియో తీశాడు. సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది వైర‌ల్ అయ్యింది. దీనిపై ఒక్కొక్క‌రు ఒక‌లా కామెంట్లు చేస్తూ వ‌స్తున్నారు. ఇదేనా మ‌న‌కు చ‌దువు నేర్పిన సంస్కారం..? అనే రీతిలో హిత‌బోధ‌లు చేస్తున్నారు. నీతి సూక్తులు చెప్తున్నారు.

కానీ వీట‌న్నింటిక‌న్నా కొంపెల్లి వెంక‌ట్ గౌడ్ దీనిపై స్పందించిన తీరు బాగ‌నిపించింది. సెల్‌ఫోన్‌లో త‌లకాయ ఇరికినంక మెద‌డు ప‌నిచేయ‌దు.. అని దీనికి క్యాప్ష‌న్ పెట్టి త‌న ఎఫ్ బీ వాల్‌పై పోస్ట్ చేశాడు. నిజ‌మే అనిపించింది. ఎన్ని చ‌ద‌వులు చ‌దివితే ఏందీ.? ఎంత విజ్ఞానం మెద‌డులో ప్రోదీ చేస్తే ఏందీ..? దాన్ని ప‌నిచేయ‌కుండా.. క‌నీసం బ‌య‌ట‌కు చూడ‌కుండా.. క‌ళ్ల‌ను, మ‌స్తిష్కాన్ని త‌న చేతిలో బందీ చేసుకున్న సెల్‌ఫోన్ ఉండ‌గా.. మ‌న‌మంతా చ‌దువుకున్న వింత‌జీవులమే. ప‌క్క‌నే ఏదైనా ప్ర‌మాదం, ఘోరం జ‌రిగినా.. అదే సెల్‌ఫోన్‌తో చిత్రీక‌రించి వెంట‌నే సోష‌ల్ మీడియాకు ఎక్కిస్తాం… ప‌నిలో ప‌ని ఓ సెల్ఫీ దిగి స్వీట్ మెమ‌రీగా భ‌ద్ర‌ప‌ర్చుకుంటాం.. దాన్నీ మీడియాకెక్కించి లైక్‌ల కోసం పాకులాడుతాం.. అదే క‌దా మ‌నం నేర్చుకుంటున్న‌ది.

 

You missed