ఎన్నిక‌ల వేళ ఎన్నో హామీలు. ఎంతో మంది నేత‌ల‌కు తాయిలాల ఎర‌. ప‌దవుల ఆశ‌. రండి మా పార్టీలో చేరి అభ్య‌ర్థ‌ల‌ను గెలిపించండి. అధికారంలోకి రాగానే మీకు ప‌ద‌వులిస్తాం. స‌ముచిత ప్రాధాన్య‌త‌నిస్తాం.. అని ఆశ చూపారు. పార్టీలోకి చేర్చుకున్నారు. ఆ త‌ర్వాత ఎవ‌రి దారి వారిది. వాళ్ల రాజ‌కీయం.. ప‌ద‌వుల కోసం పాకులాడ‌ట‌మే స‌రిపోయింది. ఇక వీరి గురించి ప‌ట్టించుకున్న‌వారు లేరు. చూశారు. వేచి చూశారు. ఎదురు చూసీ చూసీ విసిగి వేసారారు. ఇక త‌మ భ‌విష్య‌త్తు తాము చూసుకునేందుకు రెడీ అయ్యారు.

నిజామాబాద్ రాజ‌కీయాల నుంచే ఈ వ‌ల‌స‌లు ప్రారంభం కానున్నాయి. ఇక్క‌డి నుంచే పార్టీకి గుడ్ బై చెప్పే కార్య‌క్ర‌మానికి నాంది ప‌ల‌క‌నున్నారు. మొన్న‌టికి మొన్న మాజీ ఎమ్మెల్సీ అరికెల న‌ర్సారెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్దం కాగా.. క‌విత స‌ముదాయించ‌డంతో ఆగిపోయాడు. అయినా ఇంకా అత‌ను అసంతృప్తితోనే ఉన్నాడు. నేడో రేపో పార్టీ మారినా ఆశ్చ‌ర్యం లేదు.

మ‌రోవైపు ఆర్మూర్‌లో కీల‌క నేత‌, డాక్ట‌ర్ , చేయూత స్వ‌చ్చంధ సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు డాక్ట‌ర్ మ‌ధుశేఖ‌ర్ టీఆరెస్‌కు గుడ్‌బై చెప్పేందుకు రంగం రెడీ చేసుకుంటున్నాడు. పీఆర్పీ నుంచి ఓ సారి, ఇండిపెండెంట్ గా మ‌రోసారి ఆర్మూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు మ‌ధుశేఖ‌ర్‌. ఆ త‌ర్వాత క‌విత పిలుపుతో మొన్న‌టి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆశ‌న్న‌గారి జీవ‌న్‌రెడ్డిని గెలిపించేందుకు టీఆరెస్‌లో చేరాడు. జీవ‌న్‌రెడ్డి గెలుపు కోసం ప‌నిచేశాడు. జీవ‌న్ గెలిచాడు. ఎమ్మెల్సీ ఇస్తామ‌ని మాటిచ్చిన నేత‌లు ఇప్పుడు ఫోన్ కూడా లిఫ్ట్ చేయ‌డం లేదు.

దీంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న మ‌ధుశేఖ‌ర్‌కు బీఎస్పీ ఆశాకిర‌ణంలా క‌నిపించింది. ఆర్ ఎస్ ప్ర‌వీణ్‌కుమార్ రాక‌తో ఆయ‌న‌లో కొత్త ఆశ‌లు చిగురించాయి. ఇటీవ‌ల రెండు సార్లు త‌న అనుచ‌రులు, నియోజ‌క‌వ‌ర్గ నేత‌ల‌తో ర‌హ‌స్యంగా భేటీ అయ్యాడు. బీఎస్పీలో చేరే విష‌యంలో క్లారిటీ ఇచ్చి.. అంతా క‌లిసి ముందుకు సాగాల‌ని పిలుపునిచ్చాడు. ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా మ‌రోసారి త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు సిద్ద‌మ‌య్యాడు. ఎవ‌రి గెలుపు కోస‌మైతే పార్టీలో చేరాడో.. అత‌నిపైనే పోటీ చేసి గెలిచేందుకు పావులు క‌దుపుతున్నాడు.

మ‌ధుశేఖ‌ర్ బాట‌లో ఇంకెంత మంది ఉంటారో తెలియ‌దు. ఇది నాంది కానుంది. ఆ త‌ర్వాత ఎన్నిక‌ల రాజ‌కీయాలు వేడెక్కుతాయి. ఎవ‌రికి తోచిన పార్టీలోకి వారు జంప్ కాక‌త‌ప్పుదు. ఈ విష‌యం తెలిసినా .. టీఆరెస్ కూడా ఏమీ చేయ‌లేని ప‌రిస్థితిలో ఉంది. ఎంతో మందికి ఎన్నో హామీలిచ్చింది. అవ‌న్నీ నెర‌వేర్చాలంటే ఎలా కుదురుతుంది..? క‌ష్ట‌మే. అందుకే ఓపిక ఉన్న‌వాళ్లు ఉంటారు. అవ‌కాశాలొచ్చిన వాళ్లు మ‌ధుశేఖ‌ర్‌లా ఇత‌ర పార్టీలో భ‌విష్య‌త్తు చూసుకుంటారు.

You missed