మొన్న‌టిదాకా స్త‌బ్ధుగా ఉన్న కాంగ్రెస్.. రేవంత్‌రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ త‌రువాత కొత్త జోష్‌లో ఉంది. బీజేపీని ఓవ‌ర్‌టేక్ చేసి ముందుకెళ్లేందుకు కార్యాచ‌ర‌ణ సిద్ధం చేసుకుంటున్న‌ది. ఈ ప‌రిణామం ఆ పార్టీ క్యాడ‌ర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్న‌ది. నిజామాబాద్ జిల్లా రాజ‌కీయాల్లో సైతం గ‌ణ‌నీయ‌మైన మార్పుకు అంకురం ప‌డింది. కీల‌క‌మైన రెండు ప‌ద‌వులు జిల్లా వాసుల‌కే ద‌క్క‌డంతో జిల్లా పార్టీ బ‌లోపేతం కోసం వీరిద్ద‌రూ ప్ర‌త్యేక దృష్టి కేంద్రీక‌రించారు.

ఇప్ప‌టికే టీఆరెస్‌కు కంచుకోట‌లా ఇందూరు ఉన్న‌ది. ఇటీవ‌ల కాలంలో అర్వింద్ ఎంపీగా గెలిచిన త‌ర్వాత బీజేపీ సైతం ఇక్క‌డ పుంజుకుంటు వ‌స్తున్న‌ది. తాజాగా కాంగ్రెస్ కూడా జ‌వ‌స‌త్వాలు అందిపుచ్చుకునేందుకు తండ్లాడుతున్న‌ది. ఇందూరులో బుధ‌వారం జ‌రిగిన బ‌హిరంగ స‌భ ద్వారా కాంగ్రెస్ త‌న ఉనికిని చాటుకునే ప్ర‌య‌త్నం చేసింది. పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మ‌హేశ్ కుమార్ గౌడ్‌, ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్ మ‌ధుయాష్కీ గౌడ్‌ల‌ను ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికాయి ఆ పార్టీ శ్రేణులు.

ఎంపీగా క‌విత ఓడిన త‌రువాత టీఆరెస్‌లో కొంత నిస్తేజం అలుముకున్న‌ది. ఆమె కొంత కాలం పాటు రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న‌ది. ఆ త‌రువాత ఎమ్మెల్సీ ఇవ్వ‌డంతో మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని అంద‌రూ భావించారు. ఈ మ‌ధ్య కాలంలోనే ఎమ్మెల్సీ ఎన్నిక త‌రువాత క‌విత ప‌దుల సంఖ్య‌లో కార్ల ర్యాలీ ద్వారా హైద‌రాబాద్ నుంచి నిజామాబాద్ కు వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా ఆ పార్టీ శ్రేణులు ఘ‌నంగా ఆమెకు స్వాగ‌తం ప‌లికారు. ఒక ద‌శ‌లో నిస్తేజంగా ఉన్న క్యాడ‌ర్‌కు బూస్టింగ్ ఇవ్వ‌డంతో పాటు బీజేపీకి ఓ స‌వాలు విసిరిన‌ట్టుగా ఈ ర్యాలీ ద్వారా సంకేతం వ‌చ్చింది. నువ్వా నేనా అని ఈ రెండు పార్టీ బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌నకు పూనుకుంటున్న స‌మ‌యంలో తాజాగా ఇప్పుడు కాంగ్రెస్ త‌న ఉనికిని చాటుకునేందుకు బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌కు సిద్ధ ప‌డుతున్న‌ది. కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకు ఉన్న‌ప్ప‌టికీ మొన్న‌టి వ‌ర‌కు చేవ‌లేక చ‌చ్చుబ‌డిపోయిన చందంగా ఉండిపోయింది. ఇప్ప‌డు ప‌రిస్థితులు మార‌డంతో మ‌ళ్లీ త‌న క్యాడ‌ర్‌ను నిలుపుకునే ప్ర‌య‌త్నంలో ఉంది. ఈ క్ర‌మంలో ఇందూరు ఇప్పుడు ఈ మూడు పార్టీల ఆధిప‌త్య రాజ‌కీయాల‌కు కేంద్ర బిందువుగా మార‌నుంది.

You missed