రంగనాయకమ్మ గారికి ప్రశ్న:

మీరు నాస్తికులు కదా? ఈ నాస్తిక వాదం మీరు పుస్తకాల ద్వారా తెలుసుకుని అవలంబించు చున్నారా?
లేక మీ జీవితంలో కొన్ని సన్నివేశ ముల ద్వారా నాస్తిక వాదులుగా మారినారా?

జవాబు:
పుస్తకాల ద్వారా తెలుసుకోవడమే. నాకు20 సంవత్సరాలు వచ్చే వరకూ దేవుడి మీద నమ్మకాలుండేవి.
అప్పటి వరకూ పెన్నుతో ఏం రాయాలన్నా కాయితం మీద మొదట ‘శ్రీరామ’ అని రాస్తూ వు వుండేదాన్ని. కొన్ని సార్లు అరిచేతిలో ‘శ్రీరామ రాసి కళ్ళకి అద్దుకుంటూ వుండేదాన్ని.
రోజూ సూర్య వా నమస్కారాలు చేస్తూ వుండేదాన్ని.

అంత ‘మంచి’ దాన్నయిన నేను, ఒక రోజు నుంచి వీరేశలింగం గారి పుస్తకాలు చదవడం ప్రారంభించాను. ఆ పుస్తకాల్లో సాంప్రదాయాల్నీ, దేవుడి మహత్యాల్నీ ప్రశ్నించడం వుంటుంది.
అవన్నీ చదువుతోంటే, ‘ఇదేమిటీ, ఇంత చిన్న చిన్న విషయాలు ఇప్పటి దాకా తెలీలేదే! ఎవరూ చెప్పలేదే!’ అని ఆశ్చర్యం ప్రారంభమైంది.
ఇంకే ముంది? ‘ ఆలోచనలు’ ప్రారంభమయ్యాయి. వీరేశ లింగం గారు పూర్తిగా నాస్తికుడు కాడు.
ఆ సంగతి నాకు అప్పుడు సరిగా తెలీదు.
తర్వాత చలం గారి పుస్తకాలు! వాటిలో కూడా చాలా తర్కం! చాలా రకాల ప్రశ్నలు! చలం గారు కూడా నాస్తికుడు కాడు!
ఆ సంగతీ అప్పట్లో సరిగా తెలీదు.
వారి తర్కంతో వారు పూర్తిగా నాస్తికులు కాలేకపోయినా, ఆ తర్కమే లే నాకు పూర్తిగా నాస్తిక దృష్టి కలిగించడానికి ఉపయోగ పడింది.
నాస్తికత్వానికి సంబంధించి, ఆ ఇద్దరూ నా మొదటి గురువులు!
ఇంకా వుండిపోయిన ప్రశ్నలకు నా తర్కంతో నేను జవాబులు వెతుక్కున్నాను.

‘మార్క్సిజం’ అనేది భౌతిక వాదమే అయినా, ( మార్క్సిజంలో నాస్తికత్వం వున్నా), మార్క్సిజం చదవడం ప్రారంభించే నాటికే నేను నాస్తిక భావాలతో వున్నాను.
నాస్తిక తర్కానికి ఇంకా ఇంకా తోడ్పడ్డవి
డాక్టర్ కోవూర్ వ్యాసాలు.
కోవూర్ వ్యాసాలు చదివితే చిన్న పిల్లలైనా నాస్తికులై పోతారు. వీరేశలింగమూ, చలమూ లాంటి రచయితల తర్కంలో వున్న లోపాలేవీ కోపూర్ తర్కంలో వుండవు. కోవూర్ పూర్తిగా నాస్తి కుడు. ఆయనకి ‘ప్రకృతి శాస్త్రాలు’ బాగా తెలుసు. ( కానీ, ఆయనకు ‘ మార్క్సిజం’ తెలియదు. )
సాధారణంగా అందరూ చిన్నతనంలో ‘భక్తులు’ వుంటారు.
నాస్తిక కుటుంబాల్లో పెరిగే పిల్లలు కూడా చిన్నతనంలో నాస్తికత్వాన్ని సరిగా అర్ధం చేసుకోలేరు.
చిన్నప్పుడు ఇళ్ళల్లో తల్లిదండ్రులు నాస్తికత్వం నేర్పరు. ఆ విషయాలు ఆ తల్లిదండ్రులకే తెలీవు. కాబట్టి, తల్లిదండ్రుల ద్వారా నాస్తికులవడం ఎక్కువగా జరగదు.
చదువుకుంటూ వున్న వయస్సులో కొందరూ,
ఇంకా తర్వాత కొందరూ, నాస్తి కత్వం మీద వున్న పుస్తకాలేవో చదివి నాస్తికులవుతూ వుంటారు. ఆ పుస్తకాల్లో వున్న దాన్ని బట్టి, దాన్ని గ్రహించడంలో ఆ వ్యక్తుల శక్తి సామర్ధ్యాల్ని బట్టి, వాళ్ళు పూర్తిగా నాస్తికులుగా గానీ, అర కార నాస్తికులుగా గానీ, వుంటారు.
జీవితంలో జరిగే ఏవో సంఘటనల వల్ల (విషాద సంఘటనలని మీ అభి ప్రాయం అనుకుంటాను) నాస్తికులుగా మారడం ఎక్కడా జరగదు.
ఎందుకంటే, స్వంత ‘ కష్టాల’ వల్ల, _ప్రకృతికి సంబంధించిన జ్ఞానం రాదు.

నాస్తికత్వం అంటే ప్రకృతికి సంబంధించిన సత్యం.

ఇది భౌతిక ప్రపంచమని, పదార్థానికి పదార్థ ధర్మాలే గాని మహిమలు వుండవనీ, ఇంకా ఆ రకం విషయాలు తెలిస్తేనే, దేవుడు నిజం కాదని తెలిసి నాస్తిక భావాలు ఏర్పడతాయి.
ఇదంతా కష్టాల వల్ల రాదు.
చెప్పా అంటే, కష్టాల వల్ల భక్తి ఇంకా ఎక్కువవుతుంది. ఒక దేవుడి మీద నమ్మకం పోతే ఇంకో దేవుణ్ణి నమ్మడం ప్రారంభిస్తారు గానీ (దేవుళ్ళకి కరువా?) “దేవుడే లేడు’ అనే అర్థానికి రారు.
పైగా, కష్టాలు ఎక్కువైన కొద్దీ ‘దేవుడు పరీక్షిస్తున్నాడు. ఓర్చుకోవాలి’ అను కుంటారు గానీ దేవుళ్ళ మీద ఎవరూ కోపాలు తెచ్చు కోరు.
ఒక వేళ, నాలుగు రోజులు కోపం వున్నా, కోపం. పోగానే మళ్ళీ నమ్మకం ఎప్పటి లాగే వుంటుంది. (కష్టాల వల్ల నాస్తికులై పోయినట్టుగా సినిమాల్లో తప్పు తప్పుగా చూపిస్తారు.)

పాత దేవుళ్ళందరూ వుంటూ వుండగానే, కొత్త | కొత్త దేవుళ్ళు కూడా పుట్టుకొస్తూ వుంటారు. ఇందులో బోలెడు వ్యాపారం వుంది.
దేవుడి గుళ్ళన్నీ వ్యాపార కూడళ్లే.

అసలు చిన్నతనం నుంచీ ఇళ్ళల్లో తల్లిదం డ్రులూ, ఇతరులూ, స్కూళ్ళల్లో టీచర్లూ అందరూ, ప్రతి దాన్ని ప్రశ్నించడం నేర్పుతూ వుంటే, పాఠ్య పుస్తకాలు ఆ పద్ధతిలో వుంటే, చిన్నతనం నుంచీ పిల్లలు భక్తులు కాకుండానే వుంటారు.
ఇరవై ఏళ్ళో. పాతికేళ్ళో వచ్చాక, అప్పుడు ఏదో పుస్తకం దొరికి, అది కూడా సగం తెలిసి సగం తెలీకా, అప్పుడు ఆలోచిం చడం’ ప్రారంభించడం అంటే, అప్పటి దాకా అది ‘ఆలోచనే’ లేని జంతువు జీవితం’ కాదూ?
అయితే, జంతువుకీ, మనిషికీ ఒక తేడా వుంది. జంతువుకి, ‘భక్తి’ వుండదు, ‘ నాస్తికత్వమూ’ వుండదు. మనిషికి ఏదో ఒకటి ఉంటుంది.అందులో ఒకటి నిజం కానీ, రెండూ నిజం కాలేవు…

  • “శాస్త్రీయ దృక్పథం” పుస్తకం నుండి.
    రచయిత్రి – రంగనాయకమ్మ
    సేకరణ: పి జె సునీల్.

You missed