ఇండియాలో చాప‌కింద నీరులా ఇది విస్త‌రిస్తున్న‌ది. ఇంత‌కు ఎల్‌.ఎం. ఎం అంటే ఏమిటి? ఇంగ్లీష్‌లో మ‌ల్టీ లెవ‌ల్ మార్కెటింగ్. దీన్నే చైన్ బిజినెస్ (గొలుసుక‌ట్టు వ్యాపారం) అని కూడా అంటున్నారు. ఒక ఇంట‌ర్నేష‌న‌ల్ కంపెనీ త‌న అవ‌స‌ర‌మైన ప్రొడ‌క్ట్స్‌ని సుల‌భంగా అమ్ముకోవ‌డానికి ఉప‌యోగించే ప్లాన్ ఈ గొలుసుక‌ట్టు వ్యాపారం. ఒక‌రి చేత త‌న ప్రొడ‌క్ట్స్‌ను కొనిపించి అవి కొన్న వాళ్ల‌తో ఇంకా మ‌రో ఇద్ద‌రికి అమ్మ‌డానికి ప్రోత్స‌హించే విధానం ఇది. ఈ ఉత్ప‌త్తుల్లో బ్యూటీ ప్రొడ‌క్ట్స్‌, హాలిడే ప్యాకేజెస్‌, వాచీలు లాంటివి ఏమైనా ఉండొచ్చు. ( కానీ ప‌ప్పులు, ఉప్పులు, నూనెలు, బియ్యం లాంటి నిత్య‌వ‌స‌ర స‌ర‌కులు మాత్రం వారి జాబితాలో ఉండ‌వు.)
ఇది ఎలా సాగుతుందంటే.. ఒక‌రు కొన్ని వేలు లేదా ల‌క్ష‌లు కొన్ని కంపెనీల‌కు క‌డితే , ఆ డ‌బ్బుకు బ‌దులుగా , డ‌బ్బు క‌ట్టిన వాళ్ల‌కు కంపెనీ కొన్ని ప్రొడ‌క్ట్స్‌ను పంపుతుంది. అలా కొన్న ప్రొడక్ట్స్‌ని బిజినెస్ చేసి సంపాదించిన డ‌బ్బుల‌తో కొన్న‌ట్టుగా చెప్ప‌డం, ఆ ఒక్క‌రు కొన్నాక‌, అలా కొన్న వ్య‌క్తి వేరే ఇద్ద‌రి చేత అదే విధంగా కొనిపించ‌డానికి ప్ర‌య‌త్నించాలి. ఇంకొక‌రితో డ‌బ్బులు పెట్టిస్తే, ఆ డ‌బ్బుల్లోంచి వాళ్ల‌కి కొంత ప‌ర్సెంటేజీ ఇస్తారు. అలా కొన్న ప్ర‌తి ఒక్కరూ మ‌రో ఇద్ద‌రితో కొనిపించాలి. లేదంటే వాళ్ల‌కి ఒక్క రూపాయి కూడా రాదు. అలా సంపాదించిన కొంచెం డ‌బ్బుల‌తో పాటు, అప్పు చేసి ల‌గ్జ‌రీ బైక్ లేదా కార్ కొని, బిజినెస్‌లో వ‌చ్చిన డ‌బ్బులుగా చూపిస్తారు.
వీరు త‌మ లాభాల కోసం తెలిసిన వాళ్లంద‌రి వ‌ద్ద‌కూ వెళ్లి ఇక్క‌డ మీరు ఒక‌టి, రెండు సంవ‌త్స‌రాల‌లో సంపాదించే అవ‌కాశం ఉంది. దాని కోసం జీవితం అంతా ఎందుకు క‌ష్ట‌ప‌డ‌తావ్ అని ఆశ చూప‌డం కూడా జ‌రుగుతుంది. ఇంత‌కు ముందు మాట్లాడ‌ని వాళ్ల‌తో కూడా మాట్లాడ‌టం, ఎల్ల‌ప్పుడూ ఆన్‌లైన్‌లో ఉండ‌టం ( సొంత‌/ అప్పు చేసిన డ‌బ్బుల‌తోనే) ఏదో సాధించాను అని చూపించుకోవ‌డం లాంటివ‌న్నీ ఇంకొక‌రితో డ‌బ్బులు పెట్టించ‌డానికి అట్రాక్ట్ చేయ‌డం కోస‌మే చేస్తారు. అలా చేయ‌క‌పోతే వారికి ఎవ‌రూ అట్రాక్ట్ అవ‌రు. సంపాద‌న ఆగిపోతుంది. అప్పు చేసిన దానికి వ‌డ్డీ క‌డుతూనే ఉండాలి. ఎంత మందిని అట్రాక్ట్ చేస్తే అంత అమ్మొచ్చు. అంత సొమ్ము చేసుకోవ‌చ్చు. పెట్టిన పెట్టుబ‌డి ఎన్నేళ్ల‌కు వ‌స్తుందో పెట్టిన వాళ్ల‌కు కూడా తెలియ‌దు. ఒక్కొక్క‌సారి పెట్టింది తిరిగిరాక‌పోవ‌చ్చు కూడా. ప్రొడ‌క్ట్స్ కొన్న‌వాళ్ల‌ని మోటివేట్ చేయ‌డానికి ఇంట‌ర్నేష‌ల్ కాన్ఫ‌రెన్సులు ఉంటాయి. కొన్న‌వాళ్లు సొంత డ‌బ్బులు ఉప‌యోగించి ఆ కాన్ఫ‌రెన్సుల‌కు వెళ్లి రావాలి. అవి సింగాపూర్‌, దుబాయ్‌, మ‌లేషియా లాంటి టూరిస్టు ప్ర‌యార్టీ ఉన్న కంట్రీల‌లోనే ఉంటాయి త‌ప్ప యూఎస్‌, యూకే లాంటి దేశాల్లో ఇలాంటివి కుద‌ర‌వు. అక్క‌డ వాటికి ప‌ర్మిష‌న్ కూడా దొర‌క‌దు. ఇలాంటివి లీగ‌ల్ కాదు కాబ‌ట్టి. ఇండియాలోనే వీటిపై చాలా చీటింగ్ కేసులు ఉన్నాయి. డ‌బ్బు క‌ట్టిన వారు కొన్ని రోజుల త‌ర్వాత అంత సులువుగా ఇక్క‌డ సంపాదించ‌లేరు. ఎందుకంటే చెప్పిన మాట‌లు విని మోస‌పోయాము అని తెలుసుకొని, ఇంకొక‌రికి అదే విధంగా చెప్పిమోసం చేస్తేనే వాళ్లు పెట్టిన డ‌బ్బులు వెన‌క్కి వ‌స్తాయి.దీంతో కొంద‌రు ఇదంతా ఇష్టం లేకున్నా దీన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఒక ప్రొడ‌క్ట్‌ను కొన‌మ‌ని చెప్ప‌డం సేల్స్ మెన్ జాబ్ అవుతుంది. కానీ బిజినెస్ ఎంట్ర‌ప్యూన‌ర్‌షిప్ ఎలా అవుతుంది? ఇలా అని కొంద‌రు వాదిస్తున్నారు. కానీ అది నిజం కాదు. ఏది ఏమైనా ఇల్లీగ‌ల్ అని తెలిసిన‌ప్పుడు దాని జోలికి వెళ్ల‌క‌పోవ‌డం మంచిది. గాలిలో మేడ‌లు చూపించి , మ‌న‌ల్ని న‌మ్మిన వాళ్ల‌నే మోసం చేసే ఇలాంటి వాటికి దూరంగా ఉండ‌టం శ్రేయ‌స్క‌రం.

రాజేశ్వ‌ర్ చెలిమెల‌,
జ‌న విజ్ఞాన వేదిక, తెలంగాణ‌

You missed