దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే అవిశ్వాస తీర్మానాలు కామన్ అయిపోయాయి. కానీ డీసీసీబీ అవిశ్వాసం మాత్రం డిఫరెంట్. మొదటి నుంచి వివాదాల మధ్య కొనసాగుతున్న ఈ తంతు మొన్న కుంట రమేశ్‌రెడ్డిని చైర్మన్ చేయడంతో ముగిసిందనుకున్నారు. కానీ అసలు కథ ఇప్పుడే మొదలయ్యింది. అవిశ్వాసంతో పదవీచ్యుతుడైన పోచారం భాస్కర్‌రెడ్డి ఏకంగా జిల్లా పార్టీపైనే నిలదీతల పర్వానికి తెరలేపాడు. కుంట రమేశ్‌రెడ్డి తనకు, పార్టీకి వెన్నుపోటు పొడిచినా ఇంత వరకు పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించలేదని ప్రశ్నిస్తున్నాడు.
ఏకంగా అతను జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డికే ఫిర్యాదు చేశాడు. కుంట రమేశ్‌రెడ్డిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని. కానీ ఇంత వరకు జీవన్‌రెడ్డి స్పందించలేదు. దీంతో ఇదిప్పుడు పొలిటికల్ సర్కిళ్లలో చర్చకు తెరదీసింది. తనకు వెన్నుపోటు పొడవడమంటే పార్టీకి, కేసీఆర్‌కు వెన్నుపోటు పొడవడమేనంటున్నాడు భాస్కర్‌రెడ్డి. ఇంత జరిగినా పార్టీ కీలక నేతలు మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డితో సహా జిల్లా అధ్యక్షుడు కూడా కిమ్మనకపోవడం అతన్ని మరింత వేదనకు గురిచేస్తున్న అంశంగా మారింది. ఇది ఆనోటా ఈనోటా అధిష్టానం దృష్టికీ పోయింది.
పార్లమెంటు ఎన్నికల వేళ ఇందూరు డీసీసీబీ చైర్మన్‌గిరీ పంచాయితీ రచ్చకెక్కితే మరింత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని అధిష్టానం ఈ విషయంలో సైలెంట్‌గా ఉంది.