దండుగుల శ్రీనివాస్- వాస్తవం ప్రతినిధి:
బీసీ నేత, సీనియర్ కాంగ్రెస్ లీడర్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్‌కు వరుసగా అవకాశాలు కలిసి వస్తున్నాయి. ఇప్పటికే ఆయనకు కీలకమైన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కగా.. మొన్న చివరి నిమిషంలో ఆయనకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ వరించింది. పార్లమెంటు ఎన్నికల తరువాత ఆయనను పీసీసీ చీఫ్ కూడా చేసే యోచనలో ఏఐసీసీ వర్గాలు ఇప్పటికే సంకేతాలిచ్చిన విషయం తెలిసిందే. పార్టీ విధేయుడిగా, సీనియర్ నేతగా, బీసీ నేతగా అధిష్టానం ఆశీస్సులు పుష్కలంగా ఉన్న మహేశ్‌కుమార్ గౌడ్‌కు ఇప్పుడు మంత్రి పదవి కూడా వరించనుంది. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో బీసీ నేతగా మహేశ్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే జిల్లా నుంచి సీనియర్ నేత, మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి మంత్రి పదవి ఖాయమని తేలిపోయింది. ఆయనకు హోం మినిస్టర్ పదవి ఇస్తారని విస్తృత ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలో జిల్లాకు మహేశ్ రూపంలో మరో మంత్రి పదవి వచ్చి చేరనుంది. దీంతో ఇందూరుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక గుర్తింపునిచ్చినట్టయ్యింది. ఈ వారంలోగా మంత్రివర్గ విస్తరణలో మహేశ్ కూడా కేబినెట్‌లో చేరనున్నాడు. బీసీ నేతగా ఆయనకు మొదటి నుంచి అధిష్టానం, సీఎం రేవంత్ రెడ్డి మంచి ప్రయార్టీ ఇస్తూ వస్తున్నాడు. చివరి నిమిషంలో ఎమ్మెల్సీ వరించడం, మంత్రివర్గంలో చోటుదక్కడం జిల్లా కాంగ్రెస్‌లో కొత్త ఊపును తెచ్చిపెట్టనుంది. జిల్లా నుంచి ఇద్దరికి మంత్రి పదవులు వరించడం చిన్న విషయం కాదు. ఇది జిల్లా అభివృద్ధికి, పార్టీ పటిష్టతకు కూడా ఇతోధికంగా ఉపయోగపడనుంది. పార్లమెంటు ఎన్నికల తరువాత మహేశ్‌కుమార్ గౌడ్‌కు పీసీసీ పగ్గాలు కూడా అందిచనుంది. దీంతో మహేశ్ జిల్లాలో కీలక నేత కానున్నారు. రాష్ట్ర స్థాయిలో జిల్లా పేరు ప్రతిష్టలను మరింత ఇనుమడింపజేసేలా ఆయనకు కీలక అవకాశాలు వరుసగా చేజిక్కుతున్నాయి.