న్యాయ వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకొని దశాబ్దాల పాటు ఆధిపత్యాన్ని ప్రదర్శించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవడం సాధారణ విషయం కాదు. ఎందుకంటే స్థానిక న్యాయస్థానాల నుంచి దేశ అత్యున్నత న్యాయస్థానం దాకా తన వాళ్ళను చొప్పించేసుకుని బలంగా ఉన్నాడు. ఎంతటి వాళ్ళైనా మేనేజ్ చేసే శక్తియుక్తులు ఉన్న వ్యక్తి కావడం వల్లే అందరూ బాబు అరెస్ట్ అసాధ్యం అనుకున్నారు. అరెస్ట్ అయినా జైలుకు వెళ్లడం అసాధ్యం అని, రిమాండ్ పిటీషన్ తిరకరిస్తారని .. జగన్ సర్కార్ కు దిమ్మతిరిగే షాక్ తగులుతుందని విశ్లేషణలు చేశారు. అందరి ఊహలు తలకిందులయ్యాయి. 14 రోజుల రిమాండ్ అన్న తీర్పు వెలువడటంతో చంద్రబాబుకు బెయిల్ కాదు జైలు తేలిపోయింది.
చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టు జగన్ సర్కార్ చంద్రబాబు అక్రమాలపై తొలి రోజు నుంచే తవ్వడం మొదలుపెట్టింది. చురుకైన అధికారులకు బాధ్యతలు అప్పగించింది. పక్కా ఆధారాలు సేకరించి స్కెచ్ వేశారు. ఇంకేముంది చంద్రబాబు చక్రబందంలో చిక్కుకున్నాడు.
బడా వకీళ్లని తీసుకువచ్చి ఎంత ఆర్భాటం చేసినా ఇరు పక్షాల వాదనలు విన్న మహిళా న్యాయమూర్తి ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా తీర్పును వెలువరించి న్యాయ వ్యవస్థపై నమ్మకం పెంచిందని భావించాలి.
….చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఏళ్ల తరబడిగా తెలంగాణ పల్లెలు చిగురుటాకులా వనికిపోయేవి. తెలవారకముందే ఖాకీ బూట్ల చప్పుళ్ళు పల్లెల్ని వణికించేవి.
నూనూగు మీసాల నవ యువకులను అన్నలతో సంబంధాలంటూ పట్టుకెళ్ళి చిత్రహింసలకు గురి చేసి చంపి ఎన్కౌంటర్ కథలు అల్లిన రోజుల్ని తెలంగాణ సమాజం మరిచిపోదు.
నాకు తెలిసి పశువులు మేపుతున్న గుర్జాల నర్సింలు అనే పద్దెనిమిది ఏళ్ల యువకుడు రోడ్డు పక్కన పశువులు మేపుతుంటే కాల్చిచంపి ఎన్కౌంటర్ కథ అల్లిన సంఘటన నా కళ్ళెదుట తిరుగుతూనే ఉంది.
ఆ యువకుడు అజ్ఞాత నక్సలైట్ కాదు. పొద్దున లేస్తే పశువులను మేతకు తీసుకువెళ్ళి సాయంత్రానికి ఇంటికి చేరే పశువుల కాపరి. నిజంగా నక్షలైట్లతో సంబంధాలు ఉంటే పట్టుకెళ్ళి కేసులు పెట్టి జైలుకు పంపొచ్చు. కానీ
ఎన్కౌంటర్ లు చేస్తే యాగ్జిలరీ ప్రమోషన్ల ఆశాజూపి మన కళ్ళతో మననే పొడిపించిన ఘనత చంద్రబాబుది.
తెలంగాణ అన్న పదం ఉచ్చరించడమే నేరంగా చూసిన రోజుల్లో బెల్లి లలిత నీళ్ళ గోస మీద గళమెత్తి తెలంగాణ అంతటా తిరిగితే సహించని చంద్రబాబు సర్కార్ నరహంతక నయీం ముఠాతో ముక్కలు ముక్కలుగా నరికి చంపించిన విషయాన్ని తెలంగాణ ప్రజలు మరిచిపోరు.
ఎందరో పౌరహక్కుల నేతలు, ప్రజాస్వామిక వాదులనీ నల్లదండు ముఠాలు, బ్లాక్ టైగర్స్, గ్రీన్ టైగర్స్ పేరుతో ప్రాణాలు తీసిన చరిత్ర అందరి కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. 73 ఏళ్ల వయసులో జైలుకు పంపుతారా అంటూ కొందరు పెడుతున్న గగ్గోలు చూస్తుంటే నేరం చేయని ఎందరో మేధావులు నల్ల చట్టాలతో ఏళ్ల తరబడి జైళ్ళలో మగ్గుతున్నారు. ఎనబై ఏళ్లు దాటిన వాళ్ళు, తొంబై శాతం వైకల్యం ఉన్నవాళ్లు చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నపుడు బాబు జైలుకు వెళ్లడం నేరమేమి కాదు ! ఇంకా ఎన్ని కుంభకోణాలు వెలికి తీస్తారో.. ఇంకెంతమంది జైలుకు వెళతారో వేచిచూడాలి !!

– వేణుగోపాల్ చారి, జర్నలిస్ట్

 

You missed