వారసుడు రెడీ…

సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నలే తరువాయి…..

బాజిరెడ్డి వారసుడిగా జగన్‌ బరిలోకి…?

గోవన్న కోరిక మేరకు గతంలో సూత్రప్రాయంగా ఓకే చెప్పిన అధినేత

ఇప్పటికే నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు అహర్నిషలు కృషి చేస్తున్న యువనేత..

బాజిరెడ్డి అందుబాటులో లేని సమయంలో నేనున్నానంటూ అందరికీ చేరువలో…

ఆత్మీయ సమ్మేళనాల్లో తనదైన ముద్ర… ప్రసంగంలో పరిపక్వత.. అందరినీ కలుపుకుని.. సమన్వయం చేసుకుని…

కేసీఆర్‌ నిర్ణయమే ఫైనల్‌.. రెట్టించిన ఉత్సాహంతో నియోజకవర్గంలో ప్రజాసేవలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకునే పనిలో జగన్‌ బిజీబిజీ..

ఈనెల ౩౦న జగన్‌ బర్త్‌డే సందర్బంగా వాస్తవం ప్రత్యేక కథనం…

వాస్తవం ప్రతినిది, నిజామాబాద్‌:

బాజిరెడ్డి గోవర్దన్. సీనియర్ మాస్‌ లీడర్‌. ఓటమెరుగని బీసీ నేత. జిల్లాలో ఏకైక తిరుగులేని బీసీ నాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న బాజిరెడ్డికి వాస్తవంగా లేటుగానే ఉన్నత పదవి వరించింది. నాలుగో సారి ఎమ్మెల్యే అయిన తర్వాత .. ఎదురుచూపుల అనంతరం ఆయనకు ఆర్టీసీ చైర్మన్‌ పదవి వరించింది. నిజామాబాద్‌ రూరల్‌ పెద్ద నియోజకవర్గం. పొద్దున లేవగానే ఆయన ఇంటి ముందు జన జాతర ఉంటుంది. ఎవరినీ నొప్పింపక తానొవ్వక.. అన్న చందంగా అందరి సమస్యలు ఆలకిస్తారాయన. పరిష్కార మార్గం చూపెట్టి పంపుతారు. సాధ్యంకాని పనైతే దానికి కారణం చెప్పి పంపుతారు. అలా ఆయన పలకరిస్తే చాలు తమ సమస్య పరిష్కారమయిపోయినట్టేనని భావిస్తారు అంతా. అలాంటి బీసీ నేత .. ఇప్పుడు తన తనయుడు బాజిరెడ్డి జగన్‌ రాజకీయ భవిష్యత్ పై దృష్టి పెట్టారు.

జగన్‌ ఉన్నత విద్యను అభ్యసించినవాడు. అమెరికాలో మాస్టర్స్‌ చేసి తండ్రి రాజకీయాల్లో కూడా దాదాపు చాలా ఏండ్ల పాటు చేదోడు వాదోడుగా నిలిచాడు. తండ్రి అడుగు జాడల్లో నడిచినవాడు. మాస్‌ పల్స్‌ పట్టుకునే విషయంలో తండ్రిని ఆదర్శంగా తీసుకున్నవాడు. అటు ఉన్నత విద్య, ఇటు ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లో కావాల్సిన అనుభవం, ఓపిక, పరిపక్వత అన్నీ తండ్రి నడవడిక, వ్యవహార శైలి ద్వారా ఆయన వెంటే నిరంతరం తిరుగుతూ నేర్చుకున్నవాడు. అందుకే బాజిరెడ్డి గోవర్దన్‌ ఇక వారసుడిగా తన కుమారుడిని ఎమ్మెల్యేగా పోటీ చేపించాలని పరితపించాడు. తనకు ఆరోగ్యం పూర్తిగా సహకరించకపోవడం ఒక ప్రధాన కారణమైతే.. కొడుకు జగన్‌ రాజకీయంగా ప్రజాసేవలో తనదైన ముద్రను వేసుకునేందుకు చేసే ప్రయత్నంలో పరిపక్వత సాధించడం మరో ముఖ్య కారణం. ఇదే విషయాన్ని పలుమార్లు సీకెం దృష్టికి తీసుకువచ్చారు బాజిరెడ్డి గోవర్దన్‌.

తన వెంట తిప్పుకోవాల్సిందిగా కూడా సీఎం సూత్రప్రాయంగా రెండు పర్యాయాలు ఇదే మాటను బాజిరెడ్డికి హామీ రూపంలో ఇచ్చారు కేసీఆర్‌. దీంతో అహర్నిషలు నియోజకవర్గ ప్రజల కోసం వారికి అందుబాటులో ఉండేందుకు తనవంతు శక్తి వంచనలేకుండా కృషి చేస్తున్నారు జగన్‌. నిజానికి పోయిన జనరల్‌ ఎలక్షన్‌లలోనే ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్‌ను బరిలోకి దింపాలనుకున్నారు. కానీ కేసీఆర్‌ సిట్టింగులకు తప్ప ఎవరికీ చాన్స్‌ ఇవ్వలేదు. ఈసారైనా తన తనయుడికి అవకాశం లభిస్తుందని బాజిరెడ్డి ఆశిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ఆశీస్సులు కూడా మెండుగా ఉన్నాయని భావిస్తున్నారు. ఈ విషయంలో కేసీఆర్‌ నిర్ణయమే శిరోధార్యమని ఆయనకు తెలుసు. తన కుమారుడి ప్రతిభ, ప్రజాక్షేత్రంలో అతని నడవడిక, ప్రజలతో సత్సంబంధాలు, సర్వేలో మంచి రిజల్టు ఇవన్నీ కూడా తమకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో.. తన కోరిక తీరుతుందనే గోవన్న ఓ అభిప్రాయంతో ఉన్నారు.

అయితే బాజిరెడ్డి ఈ ఆలోచన ఇప్పటికిప్పుడు తీసుకున్నది కాదు. తన తనయుడు తనలాగే కింది స్థాయి నుంచి ప్రజల నాడి తెలుసుకుని ఎదిగి రావాలని కోరుకున్నాడు. అప్పటికే ఉన్నత చదవులు పూర్తి చేసుకుని.. ప్రపంచాన్ని తన కళ్లతో చూసిన జగన్‌ను…. జనం ముంగిట ఉంచారు. జడ్పీటీసీ సభ్యుడిగా తన రాజకీయ ఆరంగేట్రం చేయించారు బాజిరెడ్డి. ఆ తర్వాత జిల్లా పరిషత్‌ ఆర్థిక, ప్రణాళికా సంఘం సభ్యునిగా .. ఒలంపిక్‌ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా పదవులు వరుసగా అతన్ని వరిస్తూ అతన్ని మరింత రాటుదేలేలా చేశాయి. సమావేశాల్లో ప్రసంగం తనదైన శైలిలో మెరుగుపర్చుకుంటూ ప్రత్యేకత చాటుకుంటూ వస్తున్నారు జగన్‌. ఇటీవల జరిగిన ఆత్మీయ సమ్మేళనాల్లో కూడా అంతా తానై వ్యహరిస్తూ అందరితో కలివిడిగా ఉంటూ వస్తున్నారు. కార్యకర్తలు, నాయకులతో అందుబాటులో ఉంటున్నారు.

బాజిరెడ్డి గోవర్దన్‌ ఆర్టీసీ చైర్మన్‌గా బిజీగా ఉన్న సమయంలో తను ఇక్కడ ప్రజలకు నేనున్నానంటూ అందుబాటులో ఉంటున్నారు. సమస్యను తండ్రి దృష్టికి తీసుకువచ్చి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. అందరితో కలివిడిగా ఉండటం, సీనియర్లకు రెస్పెక్ట్ ఇవ్వడం.. అందరినీ కలుపుకుపోవడం జగన్‌లో మరో ప్రత్యేకత. ఇవి అతనికి అదనపు క్వాలిఫికేషన్లుగా పనిచేస్తున్నాయి. కేటీఆర్‌ నజర్‌లో కూడా జగన్‌కు ప్రత్యేక స్థానం లభించడం వెనుక అతని వ్యక్తిత్వం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. కేసీఆర్‌ సైతం తన కొడుకు విషయంలో తనకు అభయమిచ్చారనే బాజిరెడ్డి పలుమార్లు కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తనవెంట తిప్పుకోవాల్సిందిగా ఆయన సూచించారని కూడా ఆయన పలు సందర్భాల్లో వెల్లడించారు.

దీంతో ఈసారి రూరల్ నియోజకవర్గం నుంచి బాజిరెడ్డి కాకుండా ఆయన తనయుడు బాజిరెడ్డి జగన్‌ బరిలో నిలుస్తారా..? అనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడమే తరువాయి.. అన్నట్టుగా ఇటు బాజిరెడ్డి గోవర్దన్ తన తనయుడిని అన్ని విధాల సర్వం సిద్దం చేసి ఉంచారు. జగన్‌ సైతం ప్రజల మనుసులు గెలుచుకునేందుకు, కార్యకర్తలు, నాయకుల ప్రేమను, అభిమానాన్ని చూరగొనేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. రూరల్‌లో తిరుగులేని బీసీనేతగా బాజిరెడ్డికి మంచి పేరు ఉంది. తనకు కాకుండా తనయుడికి టికెట్‌ వస్తే వెనుకుండి తనయుడి గెలుపును నల్లేరు మీద నడకలా మార్చుకునే సీనియారిటీ, ప్రజల ప్రేమాభిమానాలు కర్ణుడికి కవచ కుండలాల్లా రక్షణగా నిలిచి విజయతీరాలకు చేర్చుతాయనే ధీమా అందరిలోనూ ఉంది…

You missed