ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ను బీఎస్పీకి సీఎం అభ్యర్థిగా మాయవతి ప్రకటించింది. ఆ పార్టీ నేతలు, అభిమానులు తెగ సంబరపడ్డారు. అప్పుడే ప్రవీణ్‌ కుమార్‌ సీఎం అయిపోయినంత సంతోషం. ఆర్‌ కృష్ణయ్యను చంద్రబాబు సీఎం ప్రకటించినట్టే ఉంది. పార్టీ ఉనికే లేనప్పుడు సీఎం అభ్యర్థి ఎవరైతే ఏంటీ..? అది కాదు ఇక్కడ విషయం. తెలంగాణలో జరగబోయేది పైసల ఎన్నికలు. మామూలుగా ఉండదు అది. దాన్ని తట్టుకోవడం ఈ బీఎస్పీ వళ్లో, ప్రవీణ్‌ వళ్లో సాధ్యం కాదు.

డెబ్బై శాతం మంది బీసీ, ఎస్పీ, ఎస్టీలకు టికెట్లిస్తామన్నాడు ప్రవీణ్‌. కానీ గెలిచేవాళ్లెంత మంది..? మేమూ ఎమ్మెల్యేగా నిలబడ్డాం… పోటీ చేశామని చెప్పుకోవడానికే పనికొచ్చే ముచ్చట అంతే. ప్రస్తుత రాజకీయాలకు, మారిన పరిస్థితులకు తగ్గట్టుగా ఎత్తులకు పైఎత్తు, ఆర్థిక, అంగబలం, అధికార బలం అంతా ఉండాలి. ఇవేవీ లేవంటే ప్రజల నాడి మారాలి. మార్పు కోరుకోవాలి. మీరొస్తే ఏం తెస్తారు..? మీకిస్తే ఏమిస్తారు..? అని ఆలోచించాలి. అంత ఆలోచన చేపించే స్థితిలో బీఎస్పీ లేదు. ప్రవీణ్‌ సీఎం కాడు.

కాంగ్రెస్సే ఈ విషయంలో చతికిలబడి పోయింది. అందుకే బీజేపీకి చాలా చోట్ల ప్రత్యామ్నాయంగా చేసి కూర్చున్నది కాంగ్రెస్‌. ఇక బీఎస్పీ తన ఖాతాలో ఎస్సీల ఓట్లను వేసుకుని ఏదో ఒక పార్టీకి మేలు చేయడం తప్పితే .. వేళ్ల మీద లెక్కపెట్టే సీట్లు కూడా రావు. వచ్చినా అవి నిలబడవు. అధికారంలోకి వచ్చిన పార్టీలోకి జంప్ అయిపోతాయి. ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాలు ఇవే. ఇది మారాలంటే చాలా సమయమే పడుతుంది. కానీ మార్పు వస్తుంది. అప్పటి దాకా పోరాడుతూనే ఉండాలి. కాడి కింద పడేస్తే … మళ్లీ కానరాకుండా కనుమరుగవ్వడమే…

You missed