నిజామాబాద్:

జిల్లా కేంద్రమైన నిజామాబాద్ నగర అభివృద్ధి కోసం ప్రభుత్వం మునుపెన్నడూ లేనివిధంగా పెద్దఎత్తున నిధులను వెచ్చిస్తోందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. గడిచిన యాభై సంవత్సరాలలో మంజూరైన నిధులకంటే, ఎనిమిదేళ్ల వ్యవధిలోనే మూడింతలు ఎక్కువ నిధులు ఖర్చు చేశామని మంత్రి వివరించారు. నిజామాబాద్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులను ఆదేశించిన విషయం తెలిసిందే.
ఈ నేపధ్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోమవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, మేయర్ నీతూ కిరణ్, కలెక్టర్ సి.నారాయణరెడ్డి లతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పురోగతిలో ఉన్న ఆయా పనుల ప్రగతిని, చేపట్టాల్సిన పనులకు స్థల సేకరణ, బిల్లుల చెల్లింపుల పరిస్థితి, నిధుల లభ్యత తదితర వాటి గురించి ఒక్కో అంశం వారీగా మంత్రి వేముల క్షుణ్ణంగా సమీక్ష నిర్వహించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు. రెండు నెలల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి పనుల పరిశీలన కోసం నిజామాబాద్ నగర పర్యటనకు హాజరుకానున్నారని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని సీఎం పర్యటనకు ముందే అన్ని పనులు పూర్తయ్యేలా చూడాలని, పనులను వేగవంతంగా జరిపిస్తూ, నిరంతరం పర్యవేక్షించాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రగతి పనులకు నిధుల కొరత లేదని, పనులు జరిపించిన వెంటనే నిధులు మంజూరు చేయిస్తామని అన్నారు. వెజ్, నాన్ వెజ్ సమీకృత మార్కెట్ యార్డులు, వైకుంఠధామాలు, మినీ ట్యాంక్ బండ్, పట్టణ ప్రగతి కింద చేపడుతున్న పనులు, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలకు సంబంధించిన పనులు, దోబీఘాట్లు తదితర నిర్మాణాలను నిర్ణీత గడువు లోపు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అలాగే, ఆర్మూర్, బోధన్, భీంగల్ మున్సిపల్ పట్టణాల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతి పైనా మంత్రి అధికారులతో సమీక్షించారు. నిర్ణీత సమయంలోగా నాణ్యతతో పనులు పూర్తి చేయించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, గత ఎనిమిదేళ్ల వ్యవధిలో ఒక్క నిజామాబాద్ నగరానికే అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ. 936.69 కోట్ల మంజూరీ తెలిపిందన్నారు. ఇందులో రూ. 884 కోట్ల నిధులకు సాంకేతిక అనుమతి లభించగా, ఇప్పటికే 658.91 కోట్ల రూపాయలను వివిధ పనుల కోసం ఖర్చు చేయడం జరిగిందని వివరించారు. టీయూఎఫ్ఐడీసీ కింద రూ.190 కోట్లు, ముఖ్యమంత్రి హామీలకు సంబంధించి రూ. 170.82 కోట్లు, పట్టణ ప్రగతి కింద రూ. 76.05 కోట్లు, మిషన్ భగీరథ పనుల కోసం రూ. 116 కోట్లు, 14వ ఆర్థిక సంఘం ద్వారా రూ. 75.37 కోట్ల నిధులను ఖర్చు చేశామని తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (న్యూ కలెక్టరేట్) ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు నిజామాబాద్ నగరానికి రూ.100 కోట్లను మంజూరు చేశారని మంత్రి వెల్లడించారు. అభివృద్ధి పనులకు మరో రూ. 50 కోట్ల నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆర్థిక శాఖను ఆదేశించారని, వెంటనే ఆ నిధులు కూడా అందుబాటులోకి రానున్నాయని అన్నారు.
నిజామాబాద్ నగరం అంటే ప్రత్యేక అభిమానం ఉండడం వల్ల ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంత పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. తాము అడగకముందే నిజామాబాద్ నగర ప్రగతిపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారని, అభివృద్ధి పనులకు మరిన్ని నిధులు కేటాయించేందుకు సంసిద్ధత తెలిపారని అన్నారు. ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు నిజామాబాద్ ను ఆదర్శ నగరంగా తీర్చిదిద్ధేందుకు శాయశక్తులా కృషి చేస్తామన్నారు. అన్ని అధునాతన వసతులతో ఆడిటోరియం, స్పోర్ట్స్ స్టేడియం, వెజ్, నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డులు నాలుగు, తిలక్ గార్డెన్ ఉద్యానవనం సుందరీకరణ, వైకుంఠ ధామాలు, హజ్ బిల్డింగ్ తదితర అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కలిసికట్టుగా కృషి చేస్తామని, నిజామాబాద్ నగరాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామని మంత్రి పేర్కొన్నారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

You missed