దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:
ప్రభుత్వం పోయింది. లీడర్లు పారారయ్యారు. పట్టింపులేదు. మీ చావు మీరు చావండని గాలికొదిలేశారు. అధికారంలో ఉన్న పదేళ్లు పట్టించుకోలే. అధికారం కోల్పోయాక మరింత దారుణంగా తయారయ్యారు. తలోదిక్కు తలదాచుకున్నారు. పార్టీనే నమ్ముకున్న నాయకులు, ఉద్యమకారుల పరిస్థితి మరీ దారుణం. ఇలాంటి పరిస్థితుల్లో కవిత అరెస్టయ్యింది. రేపు మాపు అంటూ భయపడుతూ సాగదీస్తూ ఎట్టకేలకు అరెస్టు చేసింది కేంద్రం. కానీ అనూహ్యంగా ఈ అరెస్టుపై ఎవరూ పెద్దగా స్పందించలేదు. అదే.. బీఆరెస్ పార్టీ నాయకులు. కొందరైతే ఎప్పుడు అరెస్టు చేస్తర్రా బై.. ఇంకా ఎన్ని రోజులు ఈ కతలు చెబుతరు అనే రేంజ్‌లో ఎదురుచూశారు ఆ పార్టీ నాయకులు. మరి అంతలా విసిగివేసారి పోయారు పార్టీ నాయకత్వంపై. అధిష్టానంపై.
శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది అధిష్టానం. అయినా డోంట్ కేర్ అంటున్నారు క్యాడర్. ఇప్పుడు మీ అవసరం వచ్చింది కదా అని మేము గుర్తొచ్చామా..? అప్పుడు పదవులిచ్చి సంకనెక్కించుకున్నవాళ్లను పిలవండి అని ఓపెన్‌గానే చెప్పుకుంటున్నారు. జిల్లా అధ్యక్షులెదిక్కులేని దివాళకోరు పరిస్థితిని తెచ్చిపెట్టుకున్నది బీఆరెస్ అధిష్టానం. ఇప్పుడు పిలుపిస్తే ఎవడెస్తడు..? అంటున్నారు బాజాప్తా కసితో ఉద్యమకారులు. ఎందుకు రద్దు చేసిందో తెల్వదు కానీ కవిత మొన్ననే జాగృతి శాఖలన్నింటినీ రద్దు చేసేసింది. ఇప్పుడు వాళ్లు కూడా చల్లగా ఇంట్లో కూసుని టీవీలు చూస్తున్నారు. ఇలా తయారు చేసుకున్నారు పరిస్థితి. ఇది స్వయంకృతం కాదా..?