కర్ణాటక సీఎం సిద్దరామయ్య..? ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌..

అధిష్టానం సమాలోచనలు… సిద్దరామయ్యకు కలిసొచ్చిన సీనియారిటీ.. విధేయత

వాస్తవం- హైదరాబాద్ ప్రతినిధి:

కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఇద్దరు ప్రధానంగా ఉన్నారు. ఒకరు డీకే శివకుమార్‌, మరో వ్యక్తి సిద్దరామయ్య. ఈ ఇద్దరు కానట్టయితే మధ్యే మార్గంగా కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడైన ఖర్గేను కూడా చేయవచ్చనే అభిప్రాయమూ వినవస్తుంది. కానీ అధిష్టానవర్గం సిద్దరామయ్య వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తున్నది. సిద్దరామయ్య చాలా సీనియర్‌ నాయకుడు. బీసీలను, దళితులను, ఆదివాసీలను, మైనార్టీలను .. అన్ని వర్గాలను ఏకం చేసి కాంగ్రెస్‌ను బలమైన శక్తిగా నిలిబెట్టాడు. కర్ణాటకలో లింగాయత్‌లు, ఒక్కాళిగలు బలమైన సామాజికవర్గాలు. పశ్చిమ, తూర్పు ప్రాంతంలో, మధ్య ప్రాంతంలో లింగాయత్‌లు బలంగా ఉన్నారు. వీళ్లు గతంలో బీజేపీ వైపు మొగ్గు చూపడంతో బీజేపీ అధికారంలోకి రాగలిగింది.

ఒక్కాళిగ సామాజికవర్గాలు పాత మైసూరు ప్రాంతంలో బలంగా ఉన్నారు. ఇక్కడ జనతాదళ్‌ ఎస్‌ నాయకత్వంలో వాళ్లు ఇంతకాలం బలమైన శక్తిగా రూపొందారు. దాదాపు అన్ని వర్గాలూ కాంగ్రెస్‌ ఛత్రం కింద ఉంటాయి. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఈ రెండు వర్గాలకు భిన్నంగా బలహీన వర్గాలన్నింటినీ ఏకం చేసి ఒక శక్తిగా సిద్దరామయ్య నాయకత్వంలో రూపొందింది. ఇతను మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉన్న వ్యక్తి కాదు. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్‌ లౌకిక, బలహీనవర్గాలకు అనుకూలమైన పాత్ర ద్వారా పార్టీని బలోపేతం చేశారు. ఈ సారి కూడా కాంగ్రెస్‌ పెద్ద పార్టీగా అవతరిస్తుందని చాలా మంది గ్రహించారు. ముందే ఊహించారు. 113 మెజారిటీ సాధించడమే కాకుండా..137 వరకు ఎగబాకింది. దీనికి కారణం పాత మైసూరు ప్రాంతంలోని ఒక్కాళిగలు కాంగ్రెస్‌కు ఓటు వేయడం. ఒక్కాళిగ నాయకుడైన డీకే శివకుమార్‌ మొదటి నుంచి కాంగ్రెస్‌ వాది. సిద్దరామయ్యతో పోలిస్తే యువకుడు. అతనికి ముందు రాజకీయ భవిష్యత్తు చాలా ఉంది. పార్టీని బలోపేతం చేసి గెలిపించడంలో ఆయన పాత్ర సిద్దరామయ్యతో పాటు ప్రధానమైంది. ప్రత్యేకించి డీకే శివకుమార్‌ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయని తెలిసిన తర్వాత పాత మైసూరులోని ఒక్కాళిగలు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపించారు. కర్ణాటక మొత్తంగా బీజేపీ వ్యతిరేక ప్రభంజనం వీచింది. ఇది కాంగ్రెస్‌ అనుకూల అంశం. దీంతో పాటు ఒక్కాళిగలు మద్దతివ్వడం కూడా ఒక అనుకూలాంశం. లింగాయత్‌లు బలంగా ఉన్న చోట బీజేపీ పట్ల అసంతృప్తి పెరిగింది. వీళ్లు కూడా కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతారనే అభిప్రాయం ఎన్నికల ముందు ఏర్పడ్డది. బీజేపీ ఓట్ల శాతం తగ్గకపోయినా.. కాంగ్రెస్‌కు పెద్ద ఎత్తున ఓట్ల మోహరింపు జరిగింది. 2018 ఎన్నికల్లో బీజేపీ తరపున 34 మంది లింగాయత్‌ ఎమ్మెల్యేలు గెలిస్తే.. 18 మంది కాంగ్రెస్‌ నుంచి గెలిచారు. 2023 ఇప్పటి ఎన్నికల్లో బీజేపీ నుంచి లింగాయత్‌ ఎమ్మెల్యేలు 11 మంది మాత్రమే గెలిచారు. కాంగ్రెస్‌ నుంచి 38 మంది గెలిచారు.

ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరనేది కాంగ్రెస్‌ ముందుకు పెద్ద సమస్యగా మారింది.కురు వృద్దుడు, అన్ని రకాలుగా సీరియర్‌ అయిన సిద్దరామయ్యకు ఇవ్వకుంటే కాంగ్రెస్‌ అప్రదిష్ట పాలవుతుందనే భయం అధిష్టాన వర్గానికి ఉన్నది. ప్రస్తుతానికి సిద్దరామయ్యవైపే మొగ్గు చూపించి డీకే శివకుమార్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అధిష్టాన వర్గం యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. డీకే శివకుమార్‌ మరీ ఒత్తిడి తెచ్చినట్టయితే కనీసం రెండు మూడేళ్లైనా సిద్దరామయ్యను సీఎంగా కొనసాగించాలని యోచిస్తున్నారు. ఆ తర్వాత డీకే శివకుమార్‌కు ఇవ్వాలని సర్దుబాటుకు ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్తు శివకుమార్‌దే అని అనిపించడం అధిష్టానం ముందున్న కర్తవ్యాల్లో ఒక్కటిగా ఉంది. లింగాయత్‌లు కూడా బీజేపీ పట్ల వ్యతిరేకతతో ఉన్నందు వల్ల దూరదృష్టితో ఆలోచించి సిద్దరామయ్యను చేయడమే సరైనది అని అధిష్టానం భావిస్తున్నది. లోక్‌సభ ఎన్నికలు కూడా సమీపంలోనే ఉన్నాయి. ఒక దశలో ఖర్గేకు సీఎం ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని డీకే శివకుమార్‌ చెప్పాడు. పరోక్షంగా తన పరిస్థితి బలహీనతను తనే చెప్పుకున్నాడు. ఇది కూడా అధిష్టానం ముందు సిద్దరామయ్యకు అనుకూల అంశంగా ఉంది. బొటాబొటి మోజారిటీ గెలిస్తే ఏ శిబిరమైన బ్లాక్‌మెయిల్‌ చేసే అవకాశం ఉంటుంది. కానీ భారీ మోజారిటీతో కాంగ్రెస్‌ గెలిచింది. 25 మందికి పైగా ఎమ్మెల్యేలను చీలగొట్టడమనేది ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పని కాదు. బీజేపీ కూడా సాహసించలేని పరిస్థితి. అందువల్ల సిద్దరామయ్య వైపు మొగ్గు చూపి, డీకే శివకుమార్‌కు తగిన ప్రాధన్యతా స్థానం కల్పించాలనే అభిప్రాయంతో అధిష్టాన వర్గం ఉన్నట్టు తెలుస్తున్నది.

You missed