ఎవరైనా సరే, ఎపుడూ ఉత్తుత్తి నిర్ణయాలు తీసికో కూడదు..‌ ! మనం ఓ నిర్ణయమంటూ తీసుకుంటే దాన్ని వెంటనే మొదలుపెట్టి, చివరకంటా కొనసాగించాలి.. !!
“””””””””””””””””””””””””””””‘”””””””””””””””””””
(మంచి పనులు చేయడానికి మనం నూతన సంవత్సరపు తొలిరోజు లేదా ఇతర ప్రత్యేక రోజు ముహూర్తాలంటూ చూడకూడదు. ఓ మంచి పని స్టార్ట్ చేద్దాం అని అనుకుంటే, అలా అనుకున్న వెంటనే దాన్ని అమలు చేయడం స్టార్ట్ చేయాలి అంతే..)

“ఈ రోజు న్యూ ఇయర్ కదా.. మరి మీరేమైనా ఈ ఈ విషయాలలో ఇలా ఉండాలనో, ఫలానా విషయాలలో అలా ఉండకూడదనో ఏమైనా అనుకున్నారా? న్యూ ఇయర్ సందర్భంగా మీ లైఫ్లో, మీరు ప్రత్యేకించి తీసుకున్న డెసిషన్స్ ఏమైనా ఉన్నాయా ? ” అని నన్నొకావిడ అడిగారు..

అందుకు సమాదానంగా “అలా ఒక్కటి కూడా లేవండీ” అన్నాను నేను..

“అదేంటండీ ? ఎందుకలా ?” అని ఆమె మళ్లీ అడిగారు.. !

నా సమాధానం ఇలా ఉంది:
“రేపటి నుంచీ ఓ వారం పదిరోజులు పార్కులలో ఉదయాన్నే వాకింగ్ చేసేవాళ్ళ సంఖ్య పెరుగుతుందట..

అలాగే మద్యం, సిగరెట్ల అమ్మకాలు కూడా బాగా తగ్గి పోతాయట..

పేకాట క్లబ్బులు వెల – వెలబోయే అవకాశాలు ఉంటాయట..

గుట్కా, పాన్లు నమిలి ఎక్కడంటే అక్కడ ఉమ్మి వేయడాలు జరగవట..

వైన్స్ షాపుల ముందు అడ్డ – దిడ్డమైన పార్కింగులతో ట్రాఫిక్ జాంలు చేయడం ఉండవట..

తాగి రోడ్డుమీద బేవోష్ గా పడిపోయే దేవదాసులు కనపడరట..”

దీనికి గల కారణం ఏంటంటే..
“చాలామంది జనాలు న్యూ ఇయర్ నుంచీ ఇలా ఉండాలీ, అలా ఉండకూడదూ అని అనుకోవడం వల్లనే జరుగుతుందట..”

కానీ చిత్రం ఏమిటంటే..
ఓ వారం పది రోజుల తర్వాత, మళ్ళీ పరిస్థితులన్నీ యధా ప్రకారంగా మామూలు, రోజువారి పరిస్థితికి వచ్చేస్తాయి.. !

అందుకు పెద్దగా కారణం కూడా ప్రత్యేకించి ఏమీ ఉండదు..

అసలు విషయం ఏంటంటే, ఆయా వ్యక్తుల తాలూకు, నూతన సంవత్సరపు నిర్ణయాలు, లేదా నూతన సంవత్సరపు నూతన ప్రతిజ్ఞల వేడి, ఆ న్యూ ఇయర్ డే (సంతోషం)తో పాటు, ఓ వారం పది రోజుల్లోనే లేదా ఇంకా అతి త్వరలోనే చప్పున చల్లారి పోవడం. అందుకే అలా జరుగుతుంది.. !!

నిజంగా ‘ఓ పనిని పరిపూర్ణంగా చేద్దాం..’ అనుకున్న వ్యక్తులెవరూ ఆ పనిని రేపు చేస్తాననో, ఎల్లుండి నుంచీ మొదలెడదామనో ఏవేవో ముహూర్తాలు చూసుకోరు..

వారికి నిజంగా అవసరముండి, లేదా మనస్పూర్తిగా ఇష్టపడి, ‘ఆ పనిని’ చేయడానికి ఖచ్చితమైన నిర్ణయం తీసుకుని ఉంటే.. తక్షణమే ఆ నిర్ణయాన్ని అమలుచేయడం మొదలెట్టేస్తారు కదా..

తమ ‘ఆ (నూతన) నిర్ణయాన్ని’, అలా కాకుండా ఇలా, ఇపుడుగాక పోతే అపుడు అంటూ “ఆ పని”ని మొదలు పెట్టే ముహూర్తం గురించి నసుగుతూ ఉన్నారంటే., వారికి ఆ పనిని మనస్పూర్తిగా చెయ్యాలనే లేదా కొన సాగించాలనే ఉద్దేశ్యం లేదన్నమాటే..’

ఐతే మనం ఆ మాటంటె, ఒప్పు కోడానికి వారికి ఇష్టం లేక, దానికి సాకుగా ఇలా వాయిదా పద్ధతిలో పని చేస్తామని అంటారు..

నేనైతే అలాంటి వ్యక్తిని కాదు మరి..
“అందుకే నాకు ఈ న్యూ ఇయర్ ప్రారంభం రోజు, జనవరి ఒకటో తేదీ సందర్భంగా.. అలాంటి ఏ ప్రత్యేక డెసిషన్సూ లేవు.,

ఒక వేళ అలాంటి వేవైనా ఉంటే.. (ఆ డెసిషన్) ఏదైనా సరే.. ఈ న్యూ ఇయర్ తోపాటు, ఏ ఇతర ముహూర్తంతో సంబంధం లేకుండానే, నేను ఎపుడనుకుంటే అప్పుడు.. అనుకున్నదే తడువుగా, వెను వెంటనే ఆ నిర్ణయాన్ని అమలు చేయడం మొదలు పెట్టి దాన్ని (ఆ నిర్ణయాన్ని) మధ్యలో బ్రేక్ చేయకుండా చివరకంటా కొన సాగించడమే చేస్తాను.. ఇట్స్ వెరీ సింపుల్”

— Rajeshwer Chelimela

You missed