హుజురాబాద్ ఉప ఎన్నిక చివ‌రి ఘ‌ట్టానికి వ‌చ్చింది. రేపొక్క రోజే పోల్ మేనేజ్మెంట్‌. ఆ త‌ర్వాత ఎల్లుండి పొద్దున్నుంచే పోలింగ్‌. ఈనాడు పేప‌ర్‌కు మూడు ప్ర‌ధాన పార్టీల నాయ‌కులు ఇంట‌ర్యూలు ఇచ్చార‌ని అచ్చేసింది. వారేమ‌న్నారో ముగ్గురికీ స‌మాన ప్ర‌యార్టీ ఇచ్చింది. ఈ ముగ్గురు మాట్లాడిన దాంట్లో ఎవ‌రికి వారే త‌మ త‌మ ప‌రిధిలో నిజాలే మాట్లాడారు. గెలుపోట‌ముల త‌ల‌రాత‌లు మారితే మారుతుండొచ్చు గాక‌, చెప్ప‌లేం. అదే జ‌రిగినా ఆశ్చ‌ర్య‌మూ లేదు. ఇదొదిలేసి.. వారేమ‌న్నారో ఓ సారి చూద్దాం..

హ‌రీశ్‌..
– టీఆరెస్‌తో అభివృద్ది సాధ్య‌మ‌ని ప్ర‌జ‌లు న‌మ్ముతున్నారు. అవును.. అధికారంలో ఉంది. ఇంకా స‌మ‌యం ఉంది. అభివృద్ధి చేయాల్సిన బాధ్య‌త‌, క‌ర్త‌వ్య‌మూ ఉంది. కాద‌న్న‌దెవ‌రు..? క‌రెక్టే క‌దా. సెంటిమెంట్ డైలాగుల‌తో బీజేపీకి ఓట్లు ప‌డ‌వు అన్నాడు. అక్క‌డ సెంటిమెంటు క‌న్నా ఈట‌ల పై అభిమాన‌మే బీజేపీకి జీవం పోస్తున్న‌ట్టుంది.ఇది హ‌రీశ్‌కూ తెలుసు. ఇక సీఎం స‌భ‌ను కేంద్ర‌మే అడ్డుకున్న‌ది అన్నాడు. క‌రెక్టే. ఇంత దుర్వినియోగాన్ని అడ్డుకోని కేంద్రం ఆ ఒక్క‌టీ అడ్డుకున్న‌ది. అంతే. ఎగిరేది గులాబీ జెండానే అనేది హెడ్డింగ్‌. ఇంచుమించు అలాగే అనిపిస్తుంది. అలా కాక‌పోతే మీరంతా ఇన్ని రోజులు ఇక్క‌డుండి.. కోట్లు గుమ్మ‌రించి, అల‌వ‌మాలిన హామీలు గుప్పించి.. ఇంతా చేసి కూడా ఓడిపోతే బాగుండ‌దు హ‌రీశ్‌.. గెల‌వాలి. మ‌నం. గెలుస్తున్నాం. అంతే..!

బండి సంజ‌య్…

టీఆరెస్‌కు భ‌విష్య‌త్తు లేదు అనేది హెడ్డింగ్‌. ఈ ఎన్నిక‌లో ఓడిపోతే టీఆరెస్‌కు వ్య‌తిరేక ప‌వ‌నాలు త‌ప్పువు. పార్టీ భ‌విష్య‌త్తుపై త‌ప్ప‌క ప్ర‌భావం ఉంటుంది. అందుకే దీన్ని ఇజ్జ‌త్ కా స‌వాల్‌గా తీసుకున్న‌ది అధిష్టానం. ద‌ళిత‌బంధు 2023 వ‌ర‌కు అమ‌లు చేయ‌కుండా సీఎం కుట్ర అన్నాడు. అస‌లు పైస‌లుంటే క‌దా అమ‌లు చేసేందుకు. ఇలా మాట‌లు చెప్పుకుంటూ సాగ‌దీస్తారు. ప‌నిలో ప‌ని మ‌మ్మ‌ల్నే గెలిపించండి బీసీల‌కు, ఓసీల‌కు అంద‌రికీ బంధు ఇస్తామ‌ని చెప్తూ పోతాడు. ప్ర‌జ‌లు గొర్రెల్లా త‌ల‌లూపుతూ ఉంటారు. రెండేండ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న పింఛ‌న్లు మాత్రం రావు. వాటికి డ‌బ్బులు లేవు. ద‌ళిత బంధు మాత్రం కోట్లు వ‌స్తాయి. ఓట్ల కోసం కాదంటే న‌మ్మ‌రు. హుజురాబాద్‌లో ఓట‌మే ఆ పార్టీ ప‌త‌నానికి తొలిమెట్టు అని కూడా అన్నాడు సంజ‌య్‌. ఇదీ నిజ‌మే అనిపిస్తుంది. ఇన్ని రోజులూ ఒక లెక్కా.. ఇప్పుడో లెక్క‌. కేసీఆర్‌కూ తెలుసు ఇదీ.మ‌రీ అంత దిగ‌జారిపోయేలా చేస్తాడా..? సంజ‌య్‌. మీ ఆశ‌లు కాక‌పోతే.

రేవంత్‌..
అంత‌టా అధికార దుర్వినియోగం.. ఇదీ హెడ్డింగ్‌. కాద‌నేదేముంది. అంద‌రూ చూస్త‌న్న‌దే క‌దా. అధికారంలో ఏ పార్టీ ఉన్నా చేస్తున్న‌దిదే క‌దా. కానీ ఈ హుజురాబాద్‌లో మాత్రం ఇది హ‌ద్దు మీరింద‌నేద మాత్రం నిజం. అంత‌గా భ‌య‌ప‌డ్డారు మ‌రి సీఎం గారు. అందుకే ఇదంతా. ఎన్నిక‌ల సంఘం, పోలీస్ యంత్రాంగం ప‌ట్టించుకోలేదు.. అన్నాడు. ఇదీ రొటీన్ డైలాగే. అంతే ఉంటుంది. ఎక్క‌డైనా. కాంగ్రెస్‌కు ఇంటికో ఓటేయాల‌ని అభ్య‌ర్థించాం.. అన్నాడు. వేస్తే వేయండి లేదంటే మానండి అన్న‌ట్టుగానే అభ్య‌ర్థించారు… ప్ర‌జ‌లు కూడా చూద్దాం లే అన్న‌ట్టుగానే ముబావంగానే ఉన్నారు. ఓడిపోయే సీటుకు ఖ‌ర్చెందుక‌ని కాంగ్రెస్ క‌ట్ట‌ల పాములు వ‌ద‌ల్లేదంట‌. ఈ పార్టీ క‌ట్ట‌ల పాముల క‌వ‌ర్లు రాక‌పోవడం మాత్రం ఓట‌ర్ల‌కు న‌ష్ట‌మే. క‌నీసం పోరాటం చేయ‌కుండా యుద్దంలో చ‌తికిల‌బ‌డి సాగిల‌బ‌డ్డ‌ది మాత్రం రేవంత్ ద‌ర్శ‌క‌త్వంలోని తొలి సినిమా హుజురాబాద్‌

 

You missed