దాదాపుగా ఒకతరం
చదువు పరంగా నిర్వీర్యమైపోయింది..

రెండేళ్లనుండీ పిల్లలు పిల్లల్లా పెరగట్లేదు.

వీడియో‌గేమ్స్ వాళ్లని రకరకాల మానసిక రుగ్మతల బారిన పడేస్తున్నాయ్.

‘స్వేచ్చలేదు.’

కార్పొరేట్ జైలుపక్షులు
తమ బట్టీ రెక్కల్ని కూల్చుకుని, చేతివేళ్లలోకి తమనుతాము కూర్చుకుని,
ఆన్లైన్ గేముల్తో మేధోఅవిటితనాన్ని
సంపాదిస్తున్నయ్.

చాలా దిగులుగా ఉంది.
ఈ పిల్లలు ఎలా బాగుపడాలి?

మళ్ళీ బడికొస్తే మొగ్గతొడుగుతారా!!?
ఈ గిడసబారినతనపు గుల్లలు పగులగొట్టడానికి కుదుర్తుందా!!?

ఆన్లైన్ పాఠపు వీడియో‌ఓపన్ చేసి
ఏ గేములోనో‌ మునిగితేల్తున్న శిష్యుడి
అసలు సంగతి‌
బోర్డుముందు నిలబడి
పిల్లలున్నారనే భ్రమలో‌
పాఠం చెప్పుకుపోతున్న
పంతులుగారికి తెలిసేదెలా!!??

పిల్లాడికి ఫోనో,లాపీయో‌ఇచ్చాం చదివేస్తాడిక
అని పనికిపోయిన తల్లిదండ్రులకు ఇక్కడ జరిగే తంతు
అర్ధమయేదెలా!!?

కాలం మీద
చాలా…చెప్పలేనంత..గుండె‌లవిసేంత..
కోపంగా ఉంది.

ఎవడో అన్నోన్ పర్సనొకడు
మీద కూచోని
బడి మాగాళ్లని,
బీళ్లుగా, ఎడార్లుగా మార్చి
‘సావండి నా కొడకల్లారా’ అని తిడతన్నట్టు కలలొస్తాఉన్నై.

తెల్లార్తానే కారేజీగట్టుకుని బడికి లగెత్తే బతుకు
ఇట్టా రోజుమార్చి రోజు
బడిగదిలో ఖైదు కు పాకి,కునికి, కాయితాలమీద కలలు కుప్పబోసి
పైకి పంపాలంటే

చెప్పలేనంత ఏడుపుగా ఉంటోంది.

పాఠం కెమరాలో పడి చచ్చూర్కుంది.
పరీక్ష పాస్..పాస్..అని అరుస్తూ
బతుకుల్ని పీస్ పీస్ కింద తుక్కుజేసింది.

గొంతెత్తి “రేయ్ లైన్లో నిలబడండీ..
గోల చెయబాకండ్రా సామీ..
ఎదవల్లారా ….ఎగబడమాకండీ..” అని ప్రేమగా వాళ్లను కసిరి కూర్చోబెట్టి గద్దొచ్చె కోడిపిల్ల కియ్యాం..కియ్యాం అని ఆడిచ్చి ఎన్రోజులైంది!!?

ఛీ దీనెయ్య బతుకు.. అకౌంట్లూ,డ్రైరేషనూ,ఆన్లైన్ పూనకాలూ తప్ప..
ఆనందంగా పాఠం చెప్పిందేలేకపాయె.

భయం..భయం..భయం..
బతికుంటామో…లేదోననే భయం.
పిల్లా,పెద్దా అందరూ బడెప్పుడు సారూ!!?
అని అడగతా ఉంటే…

మాస్కులో ముఖం సగం దాపెట్టి,
శానిటైజరుతో చేతులకు సంకెళ్ళేసుకుని..

ఏదీ..కేసులుతగ్గలేదుగా అని చెప్పుకుంటా గడపాలంటే
మహా మనేదగా ఉంది.

ఓపన్ ఏడవడానిక్కూడా ‘స్వేచ్చలేదు’
అన్నీ..మాస్కులోనే…😢

 

Lolaa Ravikumar Kosuri

You missed