దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రధాన ప్రతినిధి:

రాజకీయమంటే రాజకీయమే. ఎవరి పార్టీ మైలేజీ వారు పెంచుకునేందుకు ఎలాంటి సందర్బం దొరికినా వదలరు. అదీ ఎన్నికల సమయంలో అయితే మరీ. కానీ ఇక్కడ ఓ వింత జరిగింది. ఇతర పార్టీ నేతపై ఉన్న అభిమానంతో అధికార పార్టీ నేతలు తమ నిరసనను రద్దు చేసుకున్నారు. ఆపార్టీ కాంగ్రెస్‌. ఆ అభిమాన నేత బాజిరెడ్డి గోవర్దన్‌. ఏందీ..? అర్థం కావడం లేదా..? బోధన్‌లో ఆదివారం బీఆరెస్‌ నిజామాబాద్‌ లోక్‌సభ అభ్యర్థితో కలిసి అక్కడ బీఆరెస్‌ శ్రేణులు పలు కార్యక్రమాలు ప్లాన్‌ చేశారు.

దీనికి జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి కూడా వచ్చాడు. బోధన్‌ కాంగ్రెస్‌ నేతలకు జీవన్‌రెడ్డి టార్గెట్‌. అతను బోధన్‌ వస్తున్నాడని తెలిసి కాన్వాయ్‌పై మెరుపుదాడికి ప్లాన్ చేశారు. నిలదీయాలనుకన్నారు. నిరసన తెలపాలనుకున్నారు. రచ్చ రచ్చ చేయాలనుకున్నారు. ఎందుకు..? అంటారా. అంతకు ముందు జీవన్‌రెడ్డి మాజీ మంత్రి, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిని ఇష్టమొచ్చినట్టు తిట్టాడు. ముసలోడు అంటూ ఏవేవో దుర్బాషాలాడాడు.

ఈ వీడియోలన్నీ వైరల్‌ అయ్యాయి. దీంతో అక్కడ కాంగ్రెస్‌ నేతలు కసిగా ఉన్నారు. బోధన్‌ వస్తున్నాడని తెలుసుకున్నారు. దాడికి దిగేందుకు సిద్దమయ్యారు. కానీ చివరి నిమిషంలో మానుకున్నారు. కారణం… ఆ కాన్వాయ్‌లో బాజిరెడ్డి ఉంటాడు.. అతనిపైనా దాడి చేసినట్టవుతుంది. నిరసన తెలిపినట్టవుతుంది. అది కాదు వారి ఉద్దేశ్యం. ఎందుకంటే బాజిరెడ్డి అంటే అక్కడి కాంగ్రెస్‌ యూత్‌ పోరగాళ్లకూ ఓ అభిమానం. మంచి అభిప్రాయం. అందుకే ఈ మెరుపుదాడిని విరమించుకున్నారు.

ఇదీ జరిగిన సంగతి. బాజిరెడ్డి అంటే పార్టీలకతీతంగా ఇష్టపడేవారున్నారని తెలపడానికి మచ్చుకు ఇదో ఉదాహరణ మాత్రమే.

 

You missed