దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

అర్వింద్‌ ఈసారి గెలిస్తే కేంద్ర మంత్రి పదవి వస్తుందట! ఈ ముచ్చట గత కొన్నాళ్లుగా చెప్పుకుంటూనే ఉన్నారు. మళ్లీ ఈ ఎన్నికల వేళ ఇదే రాగం అందుకుంటున్నారు. లోలోన మస్తు ప్రచారం చేసుకుంటున్నారు. అర్వింద్‌కు ఈసారి పక్కా కేంద్రమంత్రి పదవి వొస్తుందని. ఈ లొల్లి ఇట్లుంటే.. తాజాగా సీఎం రేవంత్‌ వచ్చి ఇదే చిలుక పలుకు పలికి పోయాడు.

కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థి జీవన్‌రెడ్డి గెలిస్తే తానే దగ్గరుండి అందరితో మాట్లాడి.. ఒప్పించి మరీ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పదవి ఇప్పించి ఇందూరు జనాల రుణం తీర్చుకుంటానని ప్రకటించేశాడు ఇందూరు వేదికగా. గెలిచేదెవ్వరు..? ఓడెదెవ్వరు..? ఇప్పటి వరకు గెలిచిన వారు పట్టించుకున్నదెన్నడు..? ఉద్దరించిందెప్పుడు..? అభివృద్ధి చేసిందెప్పుడు..? కవిత ఉన్నా, అర్వింద్‌ ఉన్నా.. రేపు ఇంకెవరున్నా జిల్లాకు ఒరిగేదేమీ లేదు. అక్కడ ప్రధాని ఎవరనేది ఇప్పుడు డిస్కషన్‌. అంతే దాని కోసమే తండ్లాటంతా.

ఇది జనాలకు ఏదో మేలు చేసే ఎన్నికలని చెప్పినా వారే నమ్మేలా లేరు. షుగర్‌ ఫ్యాక్టరీ తెరిపిస్తామంటారు. పసుపు బోర్డు ఏదీ అని ప్రశ్నిస్తారు. పాడిందే పాటరా.. పాసుపండ్ల దాసరి అన్నట్టుగా.. పాత హామీలను మళ్లీ మళ్లీ తిరగదోడి.. ఈసారి మేము పక్కా.. ఇది మేము చేసి చూపిస్తామంటూ ఏవేవో జనాల చెవిలో పువ్వులు పెట్టే ప్రయత్నం చేస్తారు. వారు నమ్మే పరిస్థితి లేదు. అందుకే కేంద్ర మంత్రి పదవి ఇస్తే ఇక మీ బతుకులు బంగారుమయమే అనే కలరింగ్‌ ఇచ్చే ప్రయత్నమూ చేస్తున్నారు.

ఇదీ ఇప్పుడు నడస్తన్న ట్రెండ్‌. అంటే ఇప్పుడు ఎంపీగా ఎవరిని గెలిపించుకోవాలని కాదు ముచ్చట.. ఎవరికి కేంద్ర మంత్రి పదవిని ఇప్పియ్యాలో ఆలోచించి ఓటు వేయాలన్న మాట ఓటర్లు..!

You missed