నిజామాబాద్ జిల్లా:
కేంద్రంలోని మోడీ సర్కార్ తెలంగాణ మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని, మోడీ సర్కార్ తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నిస్తున్నదని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. ఇన్ని రోజులు కేసిఆర్ ఓపిక పట్టారు.ఇక కేంద్ర ప్రభుత్వ వివక్ష వైఖరినిసహించేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ కు ఒక్క రూపాయి ఇవ్వక పోగా..తెలంగాణ ప్రభుత్వాన్ని కూల దోయాలని ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ల మాటలు టివిల్లో ప్రజలే చూశారని గుర్తు చేశారు.
బీజేపీ అమిత్ షా కాంగ్రెస్ రాజ గోపాల్ రెడ్డి తో రాజీనామా చేయించి మునుగోడు ఉప ఎన్నిక తెచ్చాడన్నారు.అక్రమంగా సంపాదించిన 500 కోట్లు ఖర్చు పెట్టి ప్రజలను ప్రలోభ పెట్టాలని చూశారని, కానీ విజ్ఞులైన మునుగోడు ప్రజలు రాజ గోపాల్ రెడ్డికి,అమిత్ షాకు కర్రు కాల్చి వాత పెట్టారన్నారు.
ఒక రకంగా చూస్తే బీజేపీ సీటును టిఆర్ఎస్ గెలుచుకుందన్నారు.బీజేపీ వల్ల తెలంగాణ కు ఒరిగేది ఏమి లేదని,ప్రధాని మోడీ తెలంగాణ కు ఏమీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కులాలు,మతాలు పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చ గొడుతున్నారని,వారి మాయలో పడితే నష్ట పోయేది మనమే అని ప్రజలను ఉద్దేశించి అన్నారు. కేసిఆర్ ప్రభుత్వం ఓ వైపు అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుంటే..బీజేపీ నేతలు ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. మాయ మాటలు చెప్పే వారు ప్రజల అభివృద్ది కోసం ఒక్క రూపాయి తేరని అది ప్రజలు గుర్తించాలని కోరారు. మంచి చెడు పై ప్రజలే ఆలోచన చేయాలన్నారు. తాను నియోజకవర్గం అభివృద్ది కోసం తెస్తున్న నిధుల్లో కొంతైనా మాటలతో పబ్బం గడిపే నిజామాబాద్ ఎంపి తేవాలని డిమాండ్ చేశారు. ప్రజల సంక్షేమం వారికి పట్టదన్నారు. దేవాలయాల నిర్మాణాల కోసం లక్షల రూపాయలు వెచ్చించామని ఈ సందర్బంగా మంత్రి వేముల గుర్తు చేశారు.
బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్,ఏర్గట్ల,కమ్మర్పల్లి మండలాల్లో పలు అభివృద్ది పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం కార్యక్రమాల్లో బుధవారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. తొర్తి ౼ ఏర్గట్ల బిటి రోడ్ పునరుద్ధరణ శంకుస్ధాపన 90 లక్షల వ్యయం,మోర్తాడ్ హైవే నుండి తిమ్మాపూర్ వరకు బిటి రోడ్ పునరుద్ధరణ శంకుస్థాపన 1.10 కోట్ల వ్యయం, కమ్మర్పల్లి మండలము ఆర్.ఆర్.నగర్ గ్రామ పంచాయతీ నూతన భవనం ప్రారంభోత్సవము,ఉప్లూర్ గ్రామ పంచాయతీ నూతన భవనం ప్రారంభోత్సవము చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.