హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ రాక‌ముందే రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఒక‌రిపై ఒక‌రు క‌త్తులు దూసుకుంటున్నారు. ఈట‌ల పై టీఆరెస్ సోష‌ల్ మీడియాలో ఆ పార్టీ సైనికులు దూకుడుగా పోస్టులు పెడుతున్నారు. ఇటీవ‌ల ఈట‌ల భార్య జ‌మునారెడ్డి ఇంటింటికి వెళ్లి గోడ గ‌డియారాలు పంపిణీ చేసే విష‌యంలో వివాదం త‌లెత్తింది. ఈ వీడియో టీఆరెస్ శ్రేణుల‌కు దొరికింది. దీన్ని తిప్పి తిప్పి సోషల్ మీడ‌యాలో వైర‌ల్ చేశారు. ఆఖ‌రికి టీ న్యూస్‌లో కూడా దీన్ని బ్రేకింగ్‌గా వేశారు. దొరికింది చాన్స‌ని ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని, అప్పుడే ఏం చెయ్య‌లేదు.. ఇప్ప‌డేం చేస్తావ‌ని నిల‌దీశారంటూ స్క్రోలింగులు వేశారు. ఇదిలా ఉంటే తాజాగా మ‌రో ఫేక్ న్యూస్‌ను వైర‌ల్ చేశారు టీఆరెస్ సైనికులు. ఏకంగా ఈట‌ల రాజేంద‌ర్ పేరు మీద ఆయ‌న వాల్ మీదే రాసుకున్న‌ట్టుగా ఉన్న ఓ పోస్టును వాడుకొని ఆయ‌నే దీన్ని రాసిన‌ట్లుగా పెట్టారు. అందులో ఏమున్న‌దంటే…. ఇక రాజ‌కీయాల‌కు రాంరాం. నేను త‌ప్పుకుంటున్నారు. కోళ్ల ఫారాలు చూసుకుంటున్నాను అని ఉంది. ఇది క‌నీసం న‌మ్మ‌శ‌క్యంగానైనా పెట్ట‌లేదు. ఎవ‌రూ చూసినా ఇది ఫేక్ న్యూస్ అని ఇట్టే గుర్తిస్తారు. ఇక దీన్ని ప‌ట్టుకొని టీఆరెస్ అభిమానులు, సైనికుల‌మ‌ని చెప్పుకుంటున్న చాలా మంది రాజేంద‌ర్‌కు చివాట్లు, హిత‌బోధ‌లు, చుర‌క‌లు వేసి ప‌ని మొద‌లుపెట్టారు. ఈట‌ల ఈనెల 19 నుంచి దాదాపు 23 రోజుల పాటు పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం చుడుతున్న స‌మ‌యంలోనే దీన్ని వైర‌ల్ చేశారు. ఈట‌ల‌ను ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా … మాన‌సికంగా, నైతికంగా ఆయ‌న్ను దెబ్బ‌తీసేందుకే ఇలా దిగ‌జారుడు ఫేక్ పోస్టులు పెడుతున్నార‌ని ఈట‌ల వ‌ర్గీయులు భ‌గ్గుమ‌న్నారు. వాళ్లు కూడా కౌంట‌ర్‌గా పోస్టులు పెడుతూ… ఇది మీ నైతిక ఓట‌మి అంటూ దునుమాడ‌టంతో ఈ వార్ మ‌రింత వేడెక్కింది.

You missed