వాస్తవం ప్రతినిధి- హైదరాబాద్‌:

అసలే ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు. మోడీ వద్ద ఉన్న ఏకైక అస్త్రం జైశ్రీరామ్‌ నినాదం. హిందుత్వ ఎజెండాతో మళ్లీ అధికారంలోకి రావాలనేది బీజేపీ ఆశ. దీనికి తోడు ఎన్నికల వేళ ఎంతైతే అంత ఈ హిందుత్వ వేడిని రాజేయాలనేది కూడా అందులో కీలక అంశమే. ఈ సున్నితమైన అంశాన్ని ఎవరు కదిలించినా.. అది బీజేపీకే మైలేజీ ఇస్తుందే తప్ప మిగితా పార్టీలకు కాదు.

కానీ కేటీఆర్‌ ఇటీవల చేసిన జైశ్రీరామ్‌ అనే వ్యాఖ్యలు.. కోతికి కొబ్బరి చిప్పలా బీజేపీకి దొరికాయి. జై శ్రీరామ్‌ నినాదం కడుపు నింపదు, ఉద్యోగాలివ్వవు, కొట్లాడినోళ్లను,జనాల కోసం మాట్లాడేటోళ్లను పార్లమెంటుకు పంపాలని.. ఇదే నినాదాన్ని జనాల వద్దకు తీసుకుపోవాలని కేటీఆర్‌ క్యాడర్‌కు హితబోధ చేశాడు. ఇది వివాదస్పదమైంది. కేటీఆర్‌ మళ్లీ మాటమార్చుకున్నాడు. జైశ్రీరాం అందాం.. బీజేపీకి తొక్కుదాం అని ట్వీట్ చేశాడు.

ఇదే మంచి తరుణమని బండి సంజయ్‌ ఎంట్రీ అయ్యాడు. నాడు తానీషా కలలోకి రాముడు వచ్చి కనువిప్పు కలిగించినట్టు రాత్రికి రాత్రి కలలో నీకు కూడా రాముడు వచ్చి కనువిప్పు కలిగించాడా..? అని వ్యంగ్యం జోడించాడు. ఇప్పుడిది పొలిటికల్ సర్కిళ్లలో హాట్‌ టాపిక్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed