దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:
బీఆరెస్, కాంగ్రెస్ దొందూ దొందేనని తేలింది. రాజకీయ క్రీడలో రైతులు బలికాక తప్పదని మరోసారి రూడీ అయ్యింది. ఎన్నికల వేళ ఇచ్చే హామీలు అమలుకు సాధ్యం కావడం అంత ఈజీ కాదనీ తెలిసిపోయింది. నాయకుల మాటలు నమ్మి నిండా మునగడం రైతన్నకు కూడా పరిపాటిగా మారింది. ఆనాడు కేసీఆర్ రైతు రుణమాఫీ చేస్తానని ఊరించి ఊరించి పైసల్లేవంటూ తీరా ఎన్నికల ముందు కొద్ది కొద్దిగా చేసినా అవి ఎవరికీ ఎటూ సరిపోలేదు. ఇంకా మిగిలే ఉన్నాయి. ఇప్పుడు సీఎంగా గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఒక లక్ష కాదు.. రెండు లక్షల రుణమాఫీ చేస్తానని ప్రకటించి అధికారంలోకి వచ్చాడు.
అదీ డిసెంబర్ 9నే రుణమాఫీ జరిగిపోతుందని డేట్ కూడా ఫిక్స్ చేశాడు. ఆ డేట్ దాటి పోయి ముచ్చటగా మూడు నెలలు గడుస్తున్నాయి. ఇప్పటి వరకు దాని అతీ లేదు గతీ లేదు. ఆరు గ్యారెంటీల అమలుకే అపసోపాలు పడుతున్న ప్రభుత్వం.. ఇప్పట్లో రుణమాఫీని కనీసం టచ్ చేసే పరిస్థితి కూడా లేదు. అదెప్పుడు అమల్లోకి వస్తుందో కూడా తెలియదు. కేసీఆర్ ఏమన్నా చెప్పంగనే చేసిండా.. మాకూ టైమ్ పడుతుంది.. జర ఆగండి అని అనే అనేలా ఉన్నారు. అంటారు కూడా. రైతబంధు కూడా ఇట్లనే అయిపోయింది. టైమ్ పడవు. ఎదురు చూసీ చూసీ విసిగి వేసారి పోయారు. కేసీఆర్ ఏమో రాళ్లు రప్పలకు వందల ఎకరాల ఆసాములకూ అప్పులు చేసి వేశాడు. బడ్జెట్ దివాళ తీపించాడు.
ఇప్పుడు వీళ్లు స్లాబ్ ప్రకటించి ఓ ఐదు ఎకరాలకు కుదించేలా ఉన్నారు. అలా చేసినా సమయానికైనా వేయండిరా బాబు అని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు రైతులు. ఇది సరే, అసలు విషయాకొద్దాం. తాజాగా రైతులకు బ్యాంకుల నుంచి లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. అప్పు, వడ్డీ అంతా పదిహేను రోజుల్లో చెల్లిస్తారా లేదా అని ఆ నోటీసుల్లో రైతులకు ధమ్కీ ఇస్తున్నాయి బ్యాంకులు. రైతుల పేరు చెప్పుకుని వచ్చిన పార్టీలు ప్రభుత్వాలు ఏర్పడగానే ఇలా రైతుల మీద ప్రేమను చాటుకుంటున్నాయి. వల్లమాలిన ప్రేమలు కాస్త అలవిమాలని హామీల లిస్టులో చేరిపోయి రైతుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి.