ఇదేందీ..! బలగం సినిమా అందరినీ అలరించింది. బంధాలను కలిపింది. దూరమైన బంధుత్వాలను దగ్గర చేసింది. ఉమ్మడి కుటుంబ ప్రేమాప్యాయతలు చవిచూపింది. అంతా కలిసికట్టుగా ఉండాలని చెప్పింది. తెలంగాణ పల్లె జనం నాడి , సంస్కృతి, సంప్రదాయాలను మళ్లీ అందరికి గుర్తు చేసి మనోభావాలను తట్టిలేపింది. ఈ సినిమాకు కనెక్ట్ కాని వారు లేరు. పిల్లా జెల్లా, ముసలి ముతకా అంతా కలసి గ్రామాల్లో ప్రొజెక్టర్లు పెట్టి మరీ చూసుకుని సంబర పడ్డారు. విడిపోయిన అన్నదమ్ములను కలిపిందీ సినిమా. అంతా బాగానే ఉంది గానీ .. మరి ఈ సినిమాకు బీజేపీ కలలు కల్లలు కావడానికి ఉన్న కారణాలేమిటో తెలియక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారా..? ఈ మాటన్నది బాజిరెడ్డి జగన్. సోమవారం ధర్పల్లి బీఆరెస్ పార్టీ మండల కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన తనదైన శైలిలో మాట్లాడారు. బీజేపీ సిద్దాంతం బంధాలను విడగొట్టాలి.
అన్నదమ్ముల్ని వేరు చేయాలి. అక్కచెళ్లెల్లు దూరం కావాలి.. ఆఖరికి పెండ్లాంమొగళ్లు కూడా దూరమైపోవాలి… ఇది బీజేపీ కాన్సెప్ట్. వాళ్లే స్వయంగా దీన్ని ఒప్పుకుని ప్రకటించుకున్నారు కూడా. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈ విషయాన్ని చాలా వేదికల మీద బాహాటంగానే ప్రకటించి ఉన్నాడు. ఏమైనా చేయండి.. విడగొట్టండి. మనవైపు తిప్పుకోండి.. విడదీసి పాలించే టెక్నిక్‌తో పార్టీని బలోపేతం చేయండి.. అని చెప్పుకొచ్చాడీ సోకాల్డ్ మేధావి. అదే విషయాన్ని ఇక్కడ జగన్ తనదైన శైలిలో వారి వైఖరిని ఎండగట్టి.. బలగం సినిమాతో ముడిపెట్టాడు. బలగం సినిమా చూసి కుటుంబాలన్నీ కలిసి ఐకమత్యంగా , ఆప్యాయతతో ఉంటున్న విషయాన్ని చూసి పాపం.. బీజేపీ లీడర్లు జీర్ణించుకోలేకపోతున్నారట.
మనమొకటనుకుంటే.. బలగం సినిమా వచ్చి మొత్తం ప్లాన్ అంతా తలకిందులు చేసిందని మండిపడుతున్నారట. ఈ సినిమా ఎందుకు వచ్చిందో మా కొంపలు ముంచేందుకు అని కూడా లోలోన పరితపిస్తూ..రగిలిపోతూ.. ఉడికిపోతూ… వైరాగ్యాన్ని ప్రదర్శిస్తున్నారట. అంతేగా మరి. వారికి ఇలాంటివి చేస్తే తప్ప పార్టీకి క్యాడర్ లేదు. రాదు. కార్యకర్తలు ఉండవు. అంతా సోషల్ మీడియాలోనే బలం. అంతా వాట్సాప్ యూనివర్సిటీ గోబెల్స్ ప్రచారాలతోనే ఉనికి కాపాడుకునే యత్నం. ఇపుడిది అందరికీ తెలిసిందే కదా. దాన్ని జగన్ తనదైన స్టైల్‌లో చెప్పడంతో అక్కడ అందరినీ ఆకట్టుకుంది. నువ్వులు పూయించాయి. ఆలోచింపజేశాయి. మనం కలిసికట్టుగా ఉండి పోరాడాలనే చివరగా ఆయన ఇచ్చిన పిలుపుకు కనెక్టయ్యారంతా.