తీన్మార్ మల్లన్న.. చాలా మంది నోట్లో నానుతున్న పేరు. తప్పు చేసినోడు ఎవడైనా లైవ్ లో ఫోన్ కాల్ చేసి ప్రశ్నించే మల్లన్న ఇప్పుడు జైల్ గోడల వెనుక కటకటాలు లెక్కిస్తున్నారు. అతనికి ఈ జైల్ గోడలు కొత్తవి కావు.. అక్రమ కేసులు కొత్తవి కావు. సామాన్యుడికి అన్యాయం జరిగిందంటే అధికారంలో ఉన్నోళ్లు ఎంతటోడైనా వారిని ప్రజాక్షేత్రంలో నిలదీసే సత్తా ఉన్నోడు తీన్మార్ మల్లన్న.

హైదరాబాద్, మార్చి 23 : ఇరువై ఏళ్ల క్రితం జర్నలిజం వృత్తిలోకి అడుగు పెట్టిన తీన్మార్ మల్లన్న డైలీ పేపర్ లలో.. ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్ట్ గా పని చేసిన అనుభవం ఉంది. వీ6 న్యూస్ ఛానల్ సీఈవో అంకం రవి ఆధ్వర్యంలో తీన్మార్ వార్తలతో మల్లన్న ఫేమాస్ అయ్యారు. నిజానికి తీన్మార్ మల్లన్న పేరు నవీన్. అతను వీ6 న్యూస్ ఛానల్ లో ప్రజలకు తీన్మార్ మల్లన్నగా పరిచయమయ్యారు. అదే పేరును తన పేరుగా పెట్టుకుని తీన్మార్ మల్లన్నగా కొనసాగుతున్నారు.

అయితే.. క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా తీన్మార్ మల్లన్న డైలీ పేపర్ లు విశ్లేషణ పేరుతో ప్రభుత్వాన్ని నిలదీసి ప్రతిపక్షాల పాత్ర పోషిస్తూ వచ్చారు. సీఎం కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ మాట్లాడిన తీరుతో యూ ట్యూబ్ ను చూసే వారి సంఖ్య లక్షల్లో పెరిగారు. సీఎం కేసీఆర్ ఫ్యామిలీ గురించి ఏక వచనంతో మాట్లాడటం.. వ్యక్తిగత విషయాలను పేర్కొనడంతో మల్లన్న మాటలు వివాదా స్పదమయ్యాయి.

తప్పు చేసినోడు ఎవడైనా లైవ్ లో ఫోన్ చేసి నిలదీయడంతో ప్రజలు తీన్మార్ మల్లన్న హీరోయిజంను మెచ్చుకోవడం మొదలు పెట్టారు. పోలీసు అధికారుల వల్ల నష్ట పోయే బాధితులు.. ఎమ్మెల్యే నియంతృత్వం వల్ల బాధలు పడుతున్న పేదలు కూడా తీన్మార్ మల్లన్న వద్దకు వచ్చే వారి సంఖ్య పెరిగి పోయింది. ఒకవైపు పదుల సంఖ్యలో పోలీసులు కేసులు పెడుతున్నప్పటికీ తీన్మార్ మల్లన్న అభిమానులు పెరుగుతునే ఉన్నారు. ప్రస్తుతం హత్య యత్నం చేశారని ఫిర్యాదుతో పోలీసులు కేసులు నమోదు చేసి జైల్ కు పంపించారు.

అయితే.. తీన్మార్ మల్లన్నపై పోలీసు అధికారులు అక్రమంగా కేసులు పెడుతున్నారని అతని భార్య స్వయంగా గవర్నర్ తమిళ్ సైని కలిసారు. తీన్మార్ మల్లన్నపై పెట్టిన కేసులపై సిబిఐతో విచారణ జరిపించాలని ఆమె కోరారు.

ముగింపు..

ఒకప్పుడు తెలంగాణ సెంటి మెంట్ పేరుతో కేసీఆర్ ఉద్యమంలో చేసిన ప్రయోగాలను ఇప్పుడు తీన్మార్ మల్లన్న జర్నలిస్ట్ పేరుతో చేస్తున్నారు. జర్నలిస్ట్ లు వార్త కథనాలు ఇవ్వాలంటే సాక్ష్యాలు కావాలి.. వివరణ కావాలి.. కానీ.. తీన్మార్ మల్లన్న మాత్రం పొలిటికల్ జర్నలిస్ట్ గా అతని వ్యవహర శైలి ఉండటం  జర్నలిస్ట్ వర్గాల్లో చర్చా నీయంశంగా మారింది.

గతంలో తీన్మార్ మల్లన్నకాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేశారు. కొంత కాలానికి  బీజేపీలో చేరి దానిలో నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడెమో జర్నలిస్ట్ గా కొనసాగుతునే బీఆర్ ఎస్ – కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారని పొలిటికల్ విశ్లేషకుల వాదన. తీన్మార్ మల్లన్న అరెస్ట్ ను గుర్తింపు గల జర్నలిస్ట్ సంఘాలు ఖండన చేయలేక పోవడం విశేషం.

కానీ.. కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్న మల్లన్నకు మాత్రం బీజేపీ బహిరంగంగా మద్దతు పలికాయి. పిసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా పోలీసుల తీరును తప్పు పట్టారు. మాట్లాడే గొంతుకను నొక్కుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, బీజేపీ నాయకురాలు విజయశాంతి పేర్కొన్నారు.

యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

 

You missed