పార్టీ అష్టకష్టాల్లో ఉన్నా తను మాత్రం నమ్ముకున్న కమిట్‌మెంట్‌ను వదులుకోవడం లేదు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. హిందూత్వ భావాజాల వ్యాప్తితో, ఆరెసెస్ దూకుడుతో అధికారంలోకి వచ్చిన బీజేపీని ఢికొట్టే క్రమంలో వెల్లకిలా పడిపోయి … పార్టీకి మళ్లీ జవజీవాలందించేందుకు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నా.. ధైర్యం వీడలేదు.నమ్ముకున్న సిద్దాంతాన్ని వదల్లేదు. ఎక్కడా తొణకడం లేదు. లౌకికపార్టీ అంటే ఇదీ నిర్వచనం అనేరీతిలోనే సమాధానమిచ్చి శభాష్ అనిపించుకున్నాడు తాజాగా రాహుల్. ఇటీవల జరిగిన పార్టీ సోషల్ మీడియా విభాగం జూమ్ మీటింగ్‌లో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఆరెసెస్ భావజాలం ఉన్న నేతలు కాంగ్రెస్‌లో ఎవరైనా ఉంటే అలాంటి వారు ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే పార్టీ నుంచి వెళ్లిపోవాలని, భయం లేని కాంగ్రెస్ నేతలే కాంగ్రెస్‌కు బలం అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం చర్చకు తెరతీసింది.
హిందుత్వం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు బీజేపీ అన్ని యుక్తులు పన్నుతున్న తరుణంలో తను మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. టీఆరెస్ పార్టీ లౌకిక పార్టీగా చెప్పకుంటూనే ఓ దశలో బీజేపీని ఢీకొట్టేందుకు తను సైతం వారిదారిలోనే పయనించి సెల్ఫ్ గోల్ చేసుకున్న సందర్భాలున్నాయి. తమ నేత కేసీఆర్ పెద్ద హిందువని ప్రకటించుకున్నాయి చాలా సందర్భాల్లో టీఆరెస్ శ్రేణులు. బీజేపీ వేసే మతం ఎత్తుల్లో చాలా సందర్భాల్లో చిత్తయ్యింది టీఆర్ఎస్. బీజేపీకి కౌంటర్ ఇవ్వాలనుకుని సెల్ప్ గోల్ అవుతూ వచ్చింది. రా హుల్ గాంధీ ఆరెసెస్ భావంజాలం ఉన్న వారిని పార్టీని విడిచి పారిపోండని చెప్పడం పార్టీ సిద్ధాంతాలకు, దానికి కట్టుబడి ఉన్న విధానానికి నిదర్శనంగా నిలుస్తోంది.