దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:

ఇద్దరు బీసీలు, ఒక రెడ్డి. నిజామాబాద్‌ లోక్‌సభ నుంచి పోటీ చేసే అభ్యర్థులు వీరు. బీసీల్లో ఇద్దరూ మున్నూరుకాపు కులానికి చెందిన వారే. ఒకరు సిట్టింగు ఎంపీ అర్వింద్‌. ఇంకొకరు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌. నిజామాబాద్‌ లోకసభ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో మున్నూరుకాపుల ఓట్లు గణనీయంగానే ఉన్నాయి. బీసీ కార్డు, మున్నూరుకాపుల కులబలం కలిసి వస్తుందని ఇద్దరూ ఎవరి అంచనాల్లో వారున్నారు. కానీ కులానికి చెందిన వారు అర్వింద్‌ పట్ల గుర్రుగానే ఉన్నారు.

అంతకు ముందు ఎంపీ ఎన్నికల్లో డీఎస్‌ అన్నీ తానై కొడుకు గెలుపు కోసం మున్నూరుకాపులను ఏకం చేశాడు. ఆ తరువాత ఆయన రాజకీయాలకు క్రమంగా తెరమరుగైపోయాడు.

ఎంపీగా గెలిచిన నాటి నుంచి అర్వింద్‌ కుల సంఘాల నేతలను, కుల పెద్దలను దగ్గరకి రానీయలేదు. వారికి ప్రాధాన్యమూ ఇవ్వలేవు. మీ వల్ల నేను గెలవలేదు.. అనే అహంకారమే ప్రదర్శిస్తూ వచ్చాడు. దీంతో కులసంఘాల నేతలు, కులస్తులు అర్వింద్‌ పట్ల కోపంగానే ఉన్నారు. అదే సమయంలో బీఆరెఎస్‌ లోక్‌సభ స్థానం నుంచి బాజిరెడ్డిని నిలబెట్టింది. బాజిరెడ్డికి అన్ని సెగ్మెంట్లలో మంచిపేరున్నా.. ఆ పార్టీ నానాటికీ తీసికట్టుగా మారింది. పార్టీని లేపే ప్రయత్నం ఆ పార్టీ పెద్దలే పక్కన పెట్టేశారు.

ఈ నేపథ్యంలో బాజిరెడ్డి తన శక్తికి మించి చమటోడుస్తున్నాడు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో బాజిరెడ్డి గెలుస్తాడా..? గెలిచే అవకాశాలున్నాయా..? మనం బీఆరెస్‌ వైపు నిలిస్తే గెలిపించగలమా..? అనే డైలామాలో ఆ కులపెద్దలున్నారు. అర్విందే గెలిచేటట్టయితే .. గెలిచే అభ్యర్థి వైపే ఉండటం బెటరా..? ఇప్పుడు మున్నూరుకాపుల మధ్య నడుస్తున్న చర్చ ఇది. త్వరలో దీనికి క్లారిటీ రానుంది. ఎవరికి ఓటేయాలి..? ఎవరివైపు నిలవాలి..? అని డిసైడ్‌ అయితే మాత్రం మొత్తం ఓట్లలో గంపగుత్తగా 80 శాతం ఓట్లు ఒక్కరికే పడతాయి.

అవి ఎవరికి..? బాజిరెడ్డికా..? అర్వింద్‌కా..? తేలాల్సి ఉంది. కాంగ్రెస్‌ అభ్యర్థికి మున్నూరుకాపులు ఓట్లేసేలా లేరు. ఆ పార్టీలో ఆకుల లలిత, రత్నాకర్, ధర్మపురి సంజయ్‌లాంటి వారున్నా.. వారంతా పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. అంత యాక్టివ్‌గా లేరు. మాకెందుకు వచ్చిందిలే..? మనల్ని పట్టించుకున్నదెవడు..? అనే స్థాయిలోనే వీరు పనిచేస్తున్నారు. దీంతో కీలకమైన ఈ కుల ఓట్లు బీజేపీకా, బీఆరెస్‌కా అనేదే చర్చ నడుస్తోంది.

You missed