దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి:
సిట్టింగులపై తీవ్ర వ్యతిరేకతతోనే ఘోరంగా ఓడగొట్టారు జనాలు. మళ్లీ వాళ్లకే నియోజకవర్గ ఇన్చార్జిలుగా ప్రకటించాడు కేసీఆర్. దీంతో ప్రజలు పార్టీని మరింత దూరం పెట్టారు. నాయకులు, కార్యకర్తలు పార్టీలో నుంచి జంప్ అవుతున్నారు. అంతా ఖాళీ అవుతోంది. పార్లమెంటు ఎన్నికల వేళ అభ్యర్థిని ప్రకటించినా ఏ ఒక్క ఇన్చార్జి కూడా సీరియస్‌గా తీసుకోలేదు. హైదరాబాద్‌లోనే మకాం పెట్టారు. ఇటు వైపు చుట్టచూపుగా వచ్చి వెళ్లిన వారే తప్ప .. ఇదేదో మాకు పట్టని తంతుగానే చూస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..సమన్వయకర్తల రూపంలో ఇన్చార్జిల పీడ విరగడ చేసుకుందామని ప్లాన్ వేశాడు.
నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సమన్వయకర్తలను ప్రకటించాడు. దీని వెనుక మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మార్క్ ఉంది. అతను చెప్పినట్టుగానే ఇన్చార్జిల నియామకం జరిగింది. లోక్‌సభ ఇన్చార్జిగా ఆయనే ఉన్న నేపథ్యంలో.. తను చెప్పినట్టుగానే కేటీఆర్ సమన్వయకర్తలను నియమించించాడు. అర్బన్‌లో నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఆర్మూర్‌కు కల్వకుంట్ల విద్యాసాగర్ రావును నియమించారు. బాల్కొండకు ఎల్‌ఎంబీ రాజేశ్వర్‌ను నియమించారు. నిజామాబాద్ రూరల్ వీజీగౌడ్‌కు, బోధన్ విఠల్‌రావుకు, జగిత్యాల దావా వసంత, లోక బాపురెడ్డి, కోరుట్లకు ఎల్ రమణను నియమించారు.
ఎమ్మెల్యేలుగా ఉన్న చోట మామూలు లీడర్లకు అప్పగించిన అధిష్టానం.. ఇన్చార్జిలుగా ఉన్న చోట మాత్రం సీనియర్ లీడర్లనే వేశారు. మాజీ ఎమ్మెల్యేలుగా ఇన్చార్జిలుగా చెలామణి అవుతున్న నియోజకవర్గాల్లో ప్రజలు ఇంకా వారిని రిసీవ్ చేసుకోవడం లేదు. వీరి ముఖాలతోనే అభ్యర్థి ఓట్లకు వెళ్తే ఓట్లు పడేవి కూడా పడవనే భయం అధిష్టానానికి పట్టుకున్నది. అందుకే సమన్వయకర్తలను ముందుంచుతున్నది. దీని ద్వారా ఇప్పుడున్న క్యాడర్‌లో కూడా కొత్త ఉత్సాహం వస్తుందని భావిస్తున్నారు. ఇన్చార్జిలు అందుబాటులో ఉండరు..
పైగా వారికి చెప్పుకుండా ఏ పనీ చేయొద్దు. నియోజకవర్గానికే రావొద్దు.. అలాంటి ఫర్మానా జారీ చేసుకుని ఉన్నారిప్పటికీ వీరంతా. ఇప్పుడు వీరి నియంత దాష్టీకాలకు చెక్ పడనుంది. ఇన్చార్జిలు అందుబాటులో లేకున్నా సమన్వయకర్తలు పార్టీ ఆదేశాల మేరుకు ప్రచారంలో దూసుకుపోతారు.ప్రజల వద్దకు వెళ్తారు. రేపు భవిష్యత్తులో ఇన్చార్జిలు మారి.. కొత్తవారికి ఎమ్మెల్యే అభ్యర్థి అవకాశం వస్తుందనే సంకేతాలు దీని ద్వారా వెళ్తున్నాయి.