మలాన్ని తలమీద మోసిన ఆ మహాతల్లికి పాదాభివందనం …నా మీద నాకు అసహ్యం వేస్తుంది.ఆమె రాక ముందే పెరటి తలుపు తీసి పెట్టేవాళ్ళం.ఆమె ముఖం చూడ్డం ఇష్టం లేక.
……………………………………………
మల్లికా సారా భాయ్ మానవ మలాన్ని చేతులతో ఎత్తి,తల మీద మోసుకెళ్ళే అమానవీయ వృత్తిలో ఉన్న వారి గురించి రాసిన వ్యాసం చదివాకా 45 సంవత్సరాల నాటి జ్ఞాపకాలు నన్ను చుట్టుముట్టాయి.
మల్లిక రాసింది చదువుతుంటే నా కళ్ళల్లో ఎందుకు నీళ్ళొచ్చాయి?
ధారగా కారుతున్న ఈ కన్నీళ్ళు నా గత స్మృతుల్ని కడుగుతాయా?
నేను ఆరవ తరగతి చదువుతున్నపుడు మా నాన్న కొబ్బరికాయల వ్యాపార నిమిత్తం నరసాపురంలో ఉండేవాళ్ళం.మా నాన్న 25 రూపాయలు అద్దె ఇచ్చి అద్దె ఇంట్లో ఉండేవాడు.
మా ఇంటి పక్క పరకాల ప్రభాకర్ వాళ్ళ ఇల్లు ఉండేది.మేమంతా కలిసి ఆడుకునే వాళ్ళం.ఆ విషయాలు మళ్ళీ రాస్తాను.
మేము అద్దెకున్న ఇంటికి టాయ్ లెట్ ఉండేది కాదు.మరుగుదొడ్డి ఉండేది.ఆ దొడ్లో ఓ పది ఇటికలు వేసి ఉండేవి.అదే మా లెట్రిన్ అన్నమాట.
రోజూ ఉదయమే ఒకామె తట్ట తీసుకుని వచ్చి మలాన్ని చేతులతో,ఓ చిన్న రేకు ముక్క సాయంతో ఎత్తి తట్టలో వేసుకుని తట్టని తలమీదో చంకలోనో పెట్టుకుని వెళ్ళేది.
మేము ఎంత ఘోరంగా ప్రవర్తించే వాళ్ళమో ఇప్పుడు తల్చుకుంటే
నా మీద నాకు అసహ్యం వేస్తుంది.ఆమె రాక ముందే పెరటి తలుపు తీసి పెట్టేవాళ్ళం.ఆమె ముఖం చూడ్డం ఇష్టం లేక.
ఒకా రోజు ఆమె రాకపోతే శాపనార్ధాలు పెట్టడమే.
నిజానికి ఆమె ఒక్క రోజు రాకపోతే మా బతుకు ఘోరమే.
ఆమె వస్తే ముఖం చూడకపొయ్యేది.రాకపోతే తిట్ల దండకం అందుకునేది.
చేతులతో మలం ఎత్తే పనికి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్నప్పటి నుండి,దానికి సంబందించిన రచనలు చదువుతున్న కొద్దీ నాలో నా చిన్నప్పటి అనుభవాలు సుళ్ళుతిరుగుతూనే ఉన్నాయి.
ఎప్పటికైనా ఈ అమానుషం గురించి రాయగలనా అని అనుకునే దాన్ని.
తెలిసో తెలియకో నేనూ ఈ అమానవీయ కార్యంలో భాగస్వామినైనందుకు సిగ్గుపడుతూ,దుఖపడుతూ,వేదనపడుతూ చిన్నప్పుడు నేను విసర్జించిన మలాన్ని తలమీద మోసిన ఆ తల్లికి పాదభివందనం చేస్తూ ఈ ఉద్యమంలో నా వంతు కృషి చెయ్యడానికి బద్దురాలనౌతున్నాను.
చేతులతో శుభ్రం చేసే పాకీ దొడ్లు ఉండరాదనే ఉద్యమానికి మద్దతు పలుకుతూ,నా తప్పును సరిదిద్దుకునే ఏ పనికైనా సరే నేను రడీ అవుతున్నాను.
ఇలాంటి అమానవీయ,అమానుష ఆచారాలకు పాతర వేద్దాం.
చేతులతో మలాన్ని ఎత్తే మహాపచార పనికి వ్యతిరేకంగా మీ గళాన్ని విప్పండి మిత్రులారా!
మలాన్ని ఎత్తే మహా తల్లులకి పాదాభివందనం చేద్దాం.
Satyavati Kondaveeti